-

ఆర్టీసీలో బ్రేక్‌ జర్నీ

28 May, 2023 10:04 IST|Sakshi

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఇప్పటివరకు విమాన ప్రయాణికులకు మాత్రమే పరిమితమైన బ్రేక్‌ జర్నీ సదుపాయం ప్రస్తుతం ఆర్టీసీ ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సు మారిన ప్రతిసారి టిక్కెట్టును తీసుకునే వారు. ఇకపై అలాంటి అవసరం లేకుండా మల్టీ సిటీ టిక్కెటింగ్‌ సౌలభ్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఏదైనా పట్టణం నుంచి దూర ప్రాంతంలో ఉన్న మరో పట్టణానికి లేదా నగరానికి వెళ్లడానికి నేరుగా బస్సు సదుపాయం ఉండడం లేదు. ఇలాంటి వారు తాము వెళ్లేబోయే ప్రాంతానికి ఎక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉందో అక్కడికి చేరుకోవాల్సి ఉండేది.

ఇకపై తాము బయలుదేరే చోటునుంచే వెళ్లే గమ్యస్థానానికి ఆన్‌లైన్‌ ద్వారా ఒకేసారి నేరుగా టిక్కెట్‌ను పొందవచ్చు. ఉదాహరణకు కడప నుంచి శ్రీకాకుళం వెళ్లాలంటే డైరెక్టర్‌గా ఆర్టీసీ సర్వీసు లేదు. విశాఖపట్టణం ఒక బస్సులో వచ్చి శ్రీకాకుళం వెళ్లాలంటే మరో బస్సు ఎక్కి టిక్కెట్‌ తీసుకోవాల్సి వచ్చేది. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంది. అంతేకాకుండా వీరు ఎక్కిన ప్రతి బస్సులోనూ రిజర్వేషన్‌ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. అయితే ఈ మల్టీ సిటీ టిక్కెటింగ్‌ విధానంలో తాము వెళ్లే బస్సులో ఒకే రిజర్వేషన్‌ చార్జితో ప్రయాణించే వీలు కల్పించారు.

మారే బస్సులోనూ ముందుగానే సీటు రిజర్వు అయి ఉంటుంది. ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానంలో ప్రయాణీకులు తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు బ్రేక్‌ జర్నీ సదుపాయాన్ని కల్పించారు. తాము వెళ్లే బస్సుకోసం 2 గంటల నుంచి 22 గంటల వరకు వేచి ఉన్న బ్రేక్‌ జర్నీలో ఆ టిక్కెట్‌ చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ముందు వెళ్లే వారి బస్సు మార్గమధ్యలో ఎక్కడైనా మరమ్మతుకు గురైతే ఆ ప్రయాణీకుడిని మరో బస్సులో వెంటనే పంపించి ప్రయాణానికి ఆటంకం లేకుండా చూస్తారు.

రాయలసీమ ప్రాంతం నుంచి
రాయలసీమలోని 8 జిల్లాల నుంచి విశాఖ పట్టణం మినహా ఇతర దూర ప్రాంతాలకు నేరుగా ఆర్టీసీ బస్సు సదుపాయాలు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకుని విశాఖ సహా శ్రీకాకుళం, విజయనగరం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మల్టీ సిటీ టిక్కెటింగ్‌ (బ్రేక్‌ జర్నీ) సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది.

ప్రచారం నిర్వహిస్తున్నాం
ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిన మల్టీ సిటీ టిక్కెటింగ్‌ సదుపాయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నాం. టిక్కెట్‌ కౌంటర్లలోనూ ఈ విషయం తెలియజేస్తున్నాం. అక్కడక్కడ పోస్టర్లను కూడా ప్రదర్శించనున్నాం. ఈ కొత్త విధానంలో బ్రేక్‌ జర్నీకి వీలు కల్పిస్తున్నాం. కడప జోన్‌ వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె. పుట్టపర్తి, అనంతపురం, హిందూపురం డిపోల నుంచి బ్రేక్‌ జర్నీ సదుపాయం కల్పిస్తున్నాం. – గోపినాథ్‌రెడ్డి, కడపజోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు