హలో బ్రదర్.. హాయ్ సిస్టర్

10 Sep, 2023 10:13 IST|Sakshi

వైఎస్సార్: వారు నలుగురు ఒకేసారి పుట్టారు. వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు. వీరిలో ఒకరికి ఏడుపువస్తే మిగిలిన ముగ్గురికీ ఏడుపొస్తుంది.జ్వరమొచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా అందరికీ ఒకేసారి అలాగే వస్తుంది. ఇది చదువుతుంటే ‘హలో బ్రదర్స్‌’ సినిమా గుర్తుకొస్తోంది కదూ. వీరిది అచ్చంగా అలాంటి కథే.. అయితే ఇది కథ కాదు.. జీవితవిచిత్రం. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలకేంద్రానికి చెందిన వీరి గురించి ప్రత్యేక కథనమిది.

ఒకే కాన్సులో..
బి.కొత్తకోటలో మొబైల్‌ షాపు నిర్వహకుడు పి.సైఫుల్లా దంపతులకు ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. తొలుత భార్య నఫీసా కడుపులో నలుగురు పిల్లలు ఉన్నారని డాక్టర్‌ చెప్పిన వార్తకు సైఫుల్లాపై పిడుగుపడ్టట్టయ్యింది. ‘యా అల్లా ఏమిటిది’ అని కంగారు, ఆందోళన అన్నీ పడ్డాడు. చివరకు అల్లా నిర్ణయానికి కట్టుబడుదాం అని సముదాయించుకున్న సైఫుల్లా ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు తండ్రి అయిపోయాడు. ఇప్పటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఒకబిడ్డను పెంచి పెద్దచేయడమంటే తల ప్రాణం తోకకు వచ్చినట్టే.

ఏ ఇబ్బంది లేకుండా వారి ఆలనాపాలనా చూడాలంటే అబ్బ ఎంత కష్టమో తల్లిదండ్రులకు ఎరుకే. చిన్నపిల్లలు ఏదైనా కావాలని పట్టుపట్టినా, ఏడుపు మొదలెట్టినా ఇక అంతే. సముదాయించేందుకు ఇంట్లో ఎందరుంటే అందరూ..ఒకరి తర్వాత ఒకరుగా చేతుల్లోకి తీసుకుని లాలిస్తారు..ఆడిస్తారు.. అలాంటిది ఏకంగా ఒకేసారి పుట్టిన నలుగురు బిడ్డల ఆలనాపాలనా చూడాలంటే..తల్లి నఫీసా పడిన కష్టం అంతా ఇంతా కాదు. 2011లో ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. వీరంతా ఒకేసారి స్కూలుకు వెళ్తారు. ఒకే తరగతిలో కూర్చుంటారు. జన్మదినం ఒకేరోజు ఒకే సమయంలో జరుపుకుంటారు. అందుకే ఈ నలుగురు పిల్లలు అందరిలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

స్కాన్‌కు అందక బెంగళూరుకు..
సైఫుల్లా, నఫీసాలు స్థానిక ఖాజాఖాన్‌వీధిలో నివాసం ఉంటున్నారు. సైఫుల్లా మొబైల్‌ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. నఫీసాకు 2008లో తొలికాన్పు అయింది. అఫన్నాన్‌ అనే ఆడబిడ్డ పుట్టింది. 2011లో నఫీసా రెండోసారి గర్భందాల్చింది. మదనపల్లెలో వైద్యసేవలు అందిస్తుండగా ఒకరోజు డాక్టర్‌ స్కాన్‌ చేయగా అర్థంకాని పరిస్థితి ఎదురైంది. గర్బంలో ఉన్నది ఒకరా, ఇద్దరా అన్నది స్పష్టం కాలేదు. దీనిపై బెంగళూరు వెళ్లాల్సిందిగా వైద్యుల సూచన మేరకు నఫీసాను బెంగళూరులోని క్లౌడ్‌నైన్‌ ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు నఫీసా గర్భంలో నలుగురు పిల్లలువున్నట్టు నిర్ధ్దారించగా ఈ మాట విన్న సైఫుల్లా నమ్మలేక నమ్మాల్సి వచ్చింది.

ఒకరివెంట ఒకరుగా..
2011 అక్టోబర్‌, 22న నఫీసాకు జరిగిన సిజేరియన్‌ కాన్పులో నలుగురు జన్మించగా వారిలో తొలుత, చివరన మగపిల్లలు, మధ్యలో ఆడపిల్లలు పుట్టారు. తొలిగా మహమ్మద్‌ రెహన్‌, తర్వాత వరుసగా..బుస్సా అంజుమ్‌, హానియా అంజుమ్‌, మహమ్మద్‌ షయాన్‌ జన్మించారు. వీరుపుట్టాక కొన్నిరోజులు క్లౌడ్‌నైన్‌ ఆసుపత్రి గైనిక్‌ లీలాభగవాన్‌, డైరెక్టర్‌ కిషోర్‌కుమార్‌లు ప్రత్యేక వైద్యసేవలు అందించారు. నెలరోజులు ఆస్పత్రిలో, నెలరోజులు బెంగళూరులోనే ఉండి బి.కొత్తకోటకు వచ్చారు. ఇంటిలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య పిల్లల పెంపకం జరిగింది.

ఒక్కొక్కరికీ ఒక్కో సమయం
చిన్నప్పుడు తల్లి, నాయనమ్మ వీరి ఆలనాపాలనా చూశారు.ఒక్కొక్కరికి ఒక్కో సమయాన్ని గుర్తుపెట్టు కుని పాలు తాగిస్తారు. ఉదయం 11దాకా నిద్రపోతారు. నిద్రలేచాక వారికి స్నానాలు చేయించేవారు.నిద్రపుచ్చేందుకు ఇంట్లో మూడు జోలెలు క ట్టారు. వీరిని తల్లి నసిఫా, నానమ్మ హబీబ్‌జాన్‌ చూసుకుంటారు. పిల్లలకు ఏదైనా ఇబ్బంది కలిగితే చుట్టుపక్కల వారు వచ్చి సహకారం అందించేవారు.

స్కూలుకు సిద్ధం చేయడమే కష్టం
పిల్లల ఆలనాపాలనా విషయంలో తల్లిదండ్రులకు ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు కాని..స్కూలుకు పంపేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందని తల్లి నఫీసా అంటోంది. స్కూలు సమయానికి ఒకేసారి నలుగురు పిల్లలతోపాటు మొదట పుట్టిన పాపను సిద్దం చేయాలి. పిల్లల విషయంలో కష్టంగా అనిపించేది ఇదొక్కటే. వారిని చూసుకోవడంలో ఎక్కడా విసుగు అనిపించదు.వారితో ఉండటమే ఆనందం అంటోంది నఫీసా.

ఒకే తరగతిలో కలిసి..
ఈ నలుగురు పిల్లలది అన్నింటిల్లో స్పెషల్‌. ఇప్పుడు 12 ఏళ్ల వయసుతో పీపల్‌ ట్రీ స్కూలులో ఆరో తరగతి చదువుతున్నారు. తండ్రి సైఫుల్లా రోజూ వీరిని స్కూలుకు తీసుకెళ్లడం, మళ్లీ ఇంటికి తీసుకురావడం దినచర్య. నలుగురు పిల్లలు ఒకే తరగతి గదిలో ఒకేచోట కూర్చుని చదువుకుంటారు. వీరంతా ఒకేసారి సమాన తరగతి కావడం వల్ల ఒకే సిలబస్‌ను కలిసి చదువుకునే అవకాశం కలిగింది.

ఒకేసారి బర్త్‌డే
నలుగురు పిల్లల బర్త్‌డే ఒకేసారి జరుపుకోవడం సైఫుల్లా కుటుంబానికి ప్రత్యేకం. అక్టోబర్‌ 22న నలుగురికి నాలుగు కేక్‌లను తెచ్చి ఒకేసారి జన్మదినం వేడుకలను జరపడం అదో సంబరం. ఆ రోజంతా పండగ వాతావరణమే. ఉదయం నుంచి రాత్రి వరకు ఇల్లు సందడిగానే ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల రాకతో సందడి నెలకొంటుంది. ఒకేసారి నలుగురు కేక్‌ కట్‌ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుంటారు.

ఇబ్బంది లేదు..
పిల్లలను పెంచే విషయంలో ఏనాడు ఇబ్బందిగా భావించలేదు. మా అత్త, ఇరుగుపొరుగు వాళ్లు పిల్లలను ఎంతో ఆదరించారు. వారిని చూసుకునే విషయంలో సహకరించారు. ఒకేసారి నలుగురు పుట్టినప్పటికీ వారి బాగోగులు చూసుకోవడం దినచర్యగా మారింది. ఎవరికి ఏ సమయంలో ఏమి కావాలో అర్థం చేసుకుని అందిస్తుంటాను. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకొంటూ వస్తున్నాం. 
–నఫీసా, సైఫుల్లా

మరిన్ని వార్తలు