గంజాయి అక్రమ రవాణాపై దాడులు

1 Oct, 2023 00:04 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్‌) : గంజాయి అక్రమ రవాణాపై నవాబుపేట పోలీసులు దాడి చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి నవాబుపేట పోలీసుస్టేషన్‌లో నగర డీఎస్పీ డీ శ్రీనివాసరెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం కొండగట్టుపల్లికి చెందిన షావలి డ్రైవర్‌. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఒడిశాకు వెళ్లేవాడు. ఈ క్రమంలో గంజాయికి బానిసయ్యాడు. సులభంగా నగదు సంపాదించేందుకు గంజాయి విక్రయాలను ప్రారంభించాడు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి నెల్లూరు నగరం, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు. వైఎస్సార్‌ జిల్లా తేరేనామ్‌పల్లిలో నివాసం ఉంటున్న తన అక్క సబీరా, నెల్లూరులోని మూలాపేటలో ఓ ప్రైవేట్‌ పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న షేక్‌ ఫైరజ్‌, మరో వ్యక్తిని వ్యాపారంలో భాగస్వామ్యం చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. శనివారం షావలి, సబీరా, ఫైరజ్‌ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ ఎం బాబికి అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి ప్రశాంతినగర్‌ జంక్షన్‌(జాతీయ రహదారి)వద్ద మాటు వేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల విలువచేసే 9 కేజీల 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసుస్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించారు. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడించడంతో అరెస్ట్‌ చేశారు. నెల్లూరులోని కొందరు గంజాయి విక్రేతల పేర్లు వెల్లడించడంతో వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఇన్‌స్పెక్టర్‌ ఎం బాబి, ఎస్సైలు బీ శివప్రకాష్‌, ఎస్‌ఏ రెహమాన్‌, సిబ్బంది జీ వెంకటేశ్వర్లు, ఆర్వీ రత్నం, ఎస్‌ సురేంద్రబాబు, బీ మోహన్‌బాబు, ఎం వేణు, జీ మస్తానయ్య, డీ శ్రీనిజను డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు