Sakshi News home page

ఫరూక్‌.. పరేషాన్‌ !

Published Sat, Apr 20 2024 1:20 AM

ఎన్‌ఎండీ ఫరూక్‌,  భూమా బ్రహ్మానందరెడ్డి - Sakshi

నంద్యాల టీడీపీలో నేతల మధ్య

కుదరని సయోధ్య

ఫరూక్‌ నామినేషన్‌కు

డుమ్మా కొట్టిన

భూమా బ్రహ్మానందరెడ్డి

చివరకు సాదాసీదాగా

టీడీపీ అభ్యర్థి నామినేషన్‌

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని

బ్రహ్మంపై అనుచరుల ఒత్తిడి

నంద్యాల: నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఫరూక్‌ నామినేషన్‌కు రావాలని ఫరూక్‌ తనయుడు ఫిరోజ్‌ స్వయంగా భూమా బ్రహ్మం ఇంటికి వెళ్లి పిలిచినా గైర్హాజరు కావడంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. 2019 ఎన్నికల నుంచినంద్యాల టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ అధిష్టానం ఇటీవల తప్పించి మాజీ మంత్రి ఫరూక్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించింది. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కేవలం ఇన్‌చార్జ్‌గా మాత్రమే నియమించామని, టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేదని, అధిష్టానం చెప్పడంతో భూమా బ్రహ్మానందరెడ్డి కొన్ని రోజులు టికెట్‌ తనకే వస్తుందన్న భావనతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే చివరకు పార్టీ టికెట్‌ కూడా ఫరూక్‌కు ఇవ్వడంతో బ్రహ్మం టీడీపీ అధిష్టానంపై అలకబూనారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్‌లతో పాటు నారా భువనేశ్వరి సైతం ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు. టీడీపీ పెద్దల సమక్షంలో రాజీ అయినట్లు ఫొటోలు దిగారే తప్ప ఇంత వరకు భూమా బ్రహ్మానందరెడ్డి ఫరూక్‌కు ఓటు వేయాలని ఎక్కడ చెప్పకపోవడంతో పాటు, ఫరూక్‌ ప్రచారాల్లో సైతం పాల్గొన లేదు. శుక్రవారం ఫరూక్‌ నామినేషన్‌కు రావాలని ఫరూక్‌ తనయుడు ఫిరోజ్‌ స్వయంగా భూమా బ్రహ్మం ఇంటికి వెళ్లి పిలిచినా గైర్హాజరు కావడంతో ఫరూక్‌కు షాక్‌ తగిలింది. మొదట కార్యకర్తలతో భారీగా వెళ్లి నామినేషన్‌ వేయాలనుకున్న ఫరూక్‌ చివరకు బ్రహ్మం రాకపోవడంతో సాదాసీదాగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.

Advertisement
Advertisement