చిన్నమ్మ ఇలాకాలో కమలనాథుల విలాపం

28 Mar, 2024 13:16 IST|Sakshi

చంద్రబాబు జిత్తులమారి రాజకీయాలకు జనసేన, బీజేపీ నేతలకు భంగపాటు తప్పలేదు. పొత్తు పేరుతో ఓట్లు కొల్లగొట్టేఎత్తు వేసి.. బరిలో ఆ పార్టీల ప్రాతినిధ్యం లేకుండా చేసి మరోసారి తన వెన్నుపోటు నైజాన్ని నిరూపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు పార్టీలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (చిన్నమ్మ) సొంత ప్రాంతం కావడంతో ఒక్క సీటన్నా వస్తుందని భావించిన కమలనాథులకు నిరాశేమిగిలింది. జనసేనల పరిస్థితి కూడా అంతే. ఆ రెండు పార్టీ నేతలు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల మధ్య పొత్తు పేరుతో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయానికి తెర తీశారు. మూడు పార్టీల ప్రాతినిధ్యం ఉంటుందని చివరి వరకు నమ్మించి.. చివరకు ఏకపక్షంగా అన్ని సీట్లు టీడీపీకే కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 స్థానాల్లోనూ టీడీపీ మాత్రమే పోటీ చేస్తోంది. జనసేన, బీజేపీ కార్యకర్తలు జెండాలు మోయడానికి మాత్రమే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎంత చొక్కాలు చించుకున్నా ఒరిగేదేమీ లేదు కదా అని ఆ పార్టీల కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రచారంలో జనసేన, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పెద్దగా కనిపించడంలేదు. టీడీపీ నాయకులే జనసేన, బీజేపీ జెండాలను తమ కార్యకర్తల చేత పట్టించి డూప్‌ షో చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

నమ్మకంగా తడిగుడ్డతో గొంతు కోశారు
జనసేన పరిస్థితి ఘోరంగా తయారైంది. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికొచ్చే సరికి రిక్తహస్తం చూపెట్టారని ఆ పార్టీ నాయకులు బహిరంగానే కామెంట్స్‌ చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌కు నమ్మకమైన మనిషిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌కు పేరుంది. ఆయనకు ఒంగోలు సీటు ఇస్తానని పవన్‌హామీ ఇచ్చారు. పొత్తు కుదిరినా ఒంగోలు సీటు మాత్రం జనసేనకే అని నమ్మకంగా చెప్పారు. తీరా పొత్తు కుదిరిన తరువాత టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌కు కట్టబెట్టారు. ఇదేం అని అడిగితే నీకు న్యాయం చేస్తామంటూ బుజ్జగిస్తున్నారు. ఇక గిద్దలూరు సంగతి కూటమిలో కలకలం సృష్టిస్తోంది.

ఇటీవల కంభం, ఒంగోలులో జరిగిన సభల్లో ఆమంచి స్వాములు తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం పాటించకుండా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. గిద్దలూరు సీటు ఇస్తామని పవన్‌ కళ్యాణ్‌తో పాటుగా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా తనకు హామీ ఇచ్చినప్పటికీ తనకు సీటు దక్కకుండా కొందరు టీడీపీ నాయకులు మోసం చేశారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. నేను పవన్‌ కళ్యాణ్‌ ప్రతినిధిని అని చెబుతూ ఆమంచి సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ మౌనం వహించడం పలు అనుమానాలకు తెరతీస్తోంది.

పురందేశ్వరి సొంత జిల్లాలో కమలానికి దక్కని చోటు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సొంత జిల్లా అయిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఒంగోలు పార్లమెంట్‌ సీటును బీజేపీకి ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. పురంధేశ్వరి ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగడంతో ఒంగోలు, మార్కాపురం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని బీజేపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె అనూహ్యంగా రాజమండ్రికి వెళ్లిపోవడమే కాకుండా సొంత జిల్లా గురించి ఆసక్తి చూపకపోవడంతో కమలం కార్యకర్తలలో నైరాశ్యం నింపింది. కనీసం ఒక్కసీటు ఇచ్చినా పార్టీలో ఉత్సాహం నింపినట్లుండేదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

తెలుగు సీరియల్‌ను తలపిస్తున్న దర్శి సీటు:
దర్శి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి సరైన నాయకుడు లేక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఎన్నికల్లో పోటీకి రోజుకో కృష్ణుడు తెరపైకి వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ నుంచి జనసేన పోటీ చేయడం ఖాయమంటూ తొలి నుంచి ప్రచారం జరిగింది. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన గరికపాటి వెంకట్‌ను వ్యూహాత్మకంగా జనసేనలో చేర్పించింది. ఆయన తనకే సీటు అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు.

ఆ తరువాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీటు నిరాకరించడంతో టీడీపీలో చేరిన అద్దంకికి చెందిన బాచిన కృష్ణ చైతన్యను దర్శికి వెళ్లమని చెప్పారు. ఆయన నో అని చెప్పేయడంతో ఒంగోలుకు చెందిన గోరంట్ల రవికుమార్‌ను టీడీపీ ఇన్‌చార్జిగా నియమించారు. రవికుమార్‌ పేరు ప్రచారంలో ఉండగానే నరసరావుపేటకు చెందిన కడియాల లక్ష్మి పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం చేశారు. ఆమె కూడా ఆసక్తి చూపకపోవడంతో దామచర్ల సత్య పేరు ఖరారు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్‌ వ్యవహారంలో దామచర్ల సత్య పేరు రావడంతో తేలు కుట్టిన దొంగల్లా ఉలిక్కిపడ్డారు. రోజులు గడుస్తున్నప్పటికీ దర్శి సీటు పీటముడి వీడడం లేదు.

ప్రచారంలో కనిపించని జనసేన, బీజేపీ నాయకులు
పొత్తు ప్రక్రియ పూర్తయి అభ్యర్థులను కూడా ప్రకటించినప్పటికీ మూడు పార్టీ నాయకుల్లోలలో ఉత్సాహం కనిపించడం లేదు. పేరుకు పొత్తే కానీ పోటీ మాత్రం టీడీపీ చేస్తుండడంతో జనసేన నాయకులు కానీ, బీజేపీ కేడర్‌ కానీ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రధాన మంత్రి మోదీ సభలో సైతం పచ్చ జెండాలే కానీ బీజేపీ, జనసేన జెండాలు పెద్దగా కనిపించలేదు. జనసేనతో మొక్కుబడిగా రెండు సార్లు సమావేశాలు నిర్వహించిన టీడీపీ బీజేపీతో ఆంటీ ముట్టనట్లుగా ఉండడం పట్ల కమలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Election 2024

మరిన్ని వార్తలు