ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు, కేసీఆర్‌పై కోపంతో.. : కేటీఆర్‌ ఆవేదన

28 Mar, 2024 13:15 IST|Sakshi

రాజన్న సిరిసిల్ల, సాక్షి: తెలంగాణలో ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన ఆయన.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

‘‘రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. గతేడాది ఇదే సమయానికి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అంతటా నీళ్లిచ్చింది. కేసీఆర్‌పై కోపంతోనే మేడిగడ్డకు రిపేర్‌ చేయించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఢిల్లీకి హైదరాబాద్‌కు తిరగడం తప్ప.. రైతుల్ని పరామర్శించే తీరిక సీఎం రేవంత్‌రెడ్డికి లేకుండా పోయింది. ఇప్పటికే 200 మంది రైతులు చనిపోయారు. ఇప్పటికైనా రైతుల్ని ఆదుకోండి’’ అని కాంగ్రెస్‌ సర్కార్‌ను కోరారాయన. 

‘ఎండిపోయి పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వాలి. ఎకరానికి పదివేలా, 25 వేలా.. ఎంతిస్తారో  పరిహారం అంత ఇవ్వండి. అధికారం నుంచి దిగేపోయేనాటికి రైతుల కోసం కేసీఆర్‌ రైతుబంధు పేరిట రూ.7,000 కోట్ల రూపాయలు పెట్టారు. కానీ, అవికూడా రైతులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు చేరవేస్తోంది. ఎన్నికల టైంలో.. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతుబంధు ఇవ్వాలి. రైతులకు అండగా మేమున్నాం. కేసీఆర్ ఉన్నారు. దయచేసి ఆత్మహత్యల్లాంటి చర్యలకు రైతులు పాల్పడొద్దు’ అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

Election 2024

మరిన్ని వార్తలు