Sakshi News home page

SRH vs RCB: 'కోహ్లిని అలా చూసి చాలా బాధపడ్డా.. 11 మంది బ్యాటర్లతో ఆడాలి'

Published Tue, Apr 16 2024 6:10 PM

Let Virat Kohli bowl, play 11 batters:  - Sakshi

ఐపీఎల్‌-2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస‌గా ఐదో ఓట‌మి చ‌విచూసింది. సోమ‌వారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 25 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట‌ర్లు దుమ్ములేపిన‌ప్ప‌టికి .. బౌల‌ర్లు మాత్రం మ‌రోసారి చేతులెత్తేశారు.

గ‌ల్లీ బౌల‌ర్ల కంటే దారుణంగా ఆర్సీబీ బౌల‌ర్లు బౌలింగ్ చేశారు. ఆర్సీబీ బౌలింగ్‌ను ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఆర్సీబీ చెత్త బౌలింగ్ కార‌ణంగా ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏకంగా 287 ప‌రుగుల రికార్డు స్కోర్‌ను సాధించింది. ఇది ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలో ఆర్సీబీ బౌల‌ర్ల‌పై భార‌త మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాడు. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలింగ్ చాలా దారుణంగా ఉందని శ్రీకాంత్ సీరియస్ అయ్యాడు. 

"ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్ వంటి సీనియర్‌ బౌలర్లు కూడా పూర్తిగా తేలిపోయారు. నిన్నటి మ్యాచ్‌లో విల్ జాక్స్ మినహా మిగితా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీకి నేను ఇచ్చే సలహా ఒక్కటే.

రాబోయో మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 11 మంది బ్యాటర్లతో ఆడాలి. కెప్టెన్‌ ఫాఫ్ డు ప్లెసిస్‌ రెండు ఓవర్లు, ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌ 4 ఓవర్లు బౌలింగ్‌ చేయాలి. అదే విధంగా విరాట్‌ కోహ్లి కూడా బౌలింగ్‌ చేయాలి. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఉంటే అన్ని పరుగులు ఇచ్చేవాడు కాదు.

ఎందుకంటే కోహ్లి ఒక మంచి బౌలర్‌. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు స్టేడియం బయటకు బంతులను కొడుతుంటే కోహ్లి ముఖం వాడిపోయింది. కోహ్లిని అలా చూసిన నేను చాలా బాధపడ్డాను. బ్యాటింగ్‌ చేసే సమయంలో కూడా కోహ్లి చాలా కోపంగా ఉన్నాడు. అందుకు కారణం ఆర్సీబీ బౌలర్లే" అని తన యూట్యూబ్ ఛానల్‌లో శ్రీకాంత్ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement