కశ్మీర్‌లో ఇళ్లు కొనాలంటే? | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఇళ్లు కొనాలంటే?

Published Fri, Aug 16 2019 4:33 PM

All You Need To Know About Buying Property in Jammu Kashmir - Sakshi

శ్రీనగర్‌ : సుందర కశ్మీర్‌లో ఇళ్లు కొనాలానేది చాలామంది కల. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఇప్పుడు కశ్మీర్‌లో ఇళ్లు కొనడానికి ఉన్న ప్రధాన ప్రతిబంధకం కూడా తొలగిపోయింది. దీంతో అందరి చూపు కశ్మీర్‌లో ఆస్తులు కొనాలనే దానిపైనే ఉంది. కశ్మీర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే శాంతిస్తాయా? ఆస్తులు కొందామా? అని ఆలోచిస్తున్నారు. దీనిపై ఎకనమిక్‌ టైమ్స్‌ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం కశ్మీర్‌లో ఇళ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయా? సోషల్‌ మీడియాలో వస్తోన్న అమ్మకాల ప్రకటనలు ఎంతవరకు నిజం? అక్కడ నిజంగా రియల్‌ ఎస్టేట్‌ అందుకు అనుగుణంగా ఉంటుందా? అంటూ కొన్ని సమాధానాలను వెతికే ప్రయత్నం చేసింది.

కశ్మీర్‌లో ఇళ్లు కొనాలంటే
జమ్మూకశ్మీర్‌ను జమూకశ్మీర్‌, లడాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. ఇక జమ్మూకశ్మీర్‌ భారత్‌లోని మిగతా రాష్ట్రాలతో సమానం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని చట్టాలు, నియంత్రణలు కశ్మీర్‌కు కూడా మిగతా రాష్ట్రాలతో సమానంగా వర్తిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ ఇండస్ట్రీకి అపెక్స్‌లాంటి సంస్థ రెరా(రియల్‌ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) విధానం ఏవిధంగా రూపుదిద్దుకుంటుందనే దానిపైనే ఆ రాష్ట్రంలో ఇళ్ల కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఆ విధానాల రూపకల్పనపై స్పష్టత రావాల్సింది ఉందని వెల్లడించింది. శ్రీనగర్‌లో ప్రస్తుతం చదరపు అడుగు రూ.2500 నుంచి రూ.3200 ఉంది. జమ్మూలో రూ.2400 నుంచి రూ.4000 ఉండగా బారాముల్లాలో రూ.2500 నుంచి రూ.3200 ఉంది. అయితే వీటి కొనుగోలుపై స్థానికేతరులకు ఇప్పుడే అనుమతి లేదని చెప్పింది.

ఓ రియల్‌ఎస్టేట్‌ నిపుణుడు మాట్లాడుతూ.. మిగతా కొండ ప్రాంతపు రాష్ట్రాలతో సమానంగా ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు రెరా విధానాలని రూపొందిస్తుందా? లేక మరిన్ని నియంత్రణలు ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఆస్తి లావాదేవీలు రెరా పరిమితికి లోబడి ఉంటాయని, సంస్థ ప్రకటన కోసం వేచి ఉండాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు అంతకాలం ఆగకపోతే కొనుగోలు లావాదేవీలలో న్యాయ నిపుణుడి సలహా తీసుకోవడం మంచిదని తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లో ప్రధానంగా టైర్2, టైర్3 పట్టణాలు రియల్టీ గమ్యస్థానాలుగా మారుతాయి. జమ్మూకశ్మీర్‌కు రియల్‌ ఎస్టేట్‌లో భారీ సామర్థ్యం ఉన్నప్పటకీ ఇంకా ఆ దిశగా సరైన కృషి జరగలేదు. ఇప్పుడు అవకాశం వచ్చినా తక్షణ అభివృద్ధికి సమయం కావాలి. ఎందుకంటే నిబంధనల చుట్టూ చాలా అస్పష్టత ఉంది. పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. వినియోగదారుడు రక్షణ, భద్రతను దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి మరికొంత సమయం వేచి చూడాల్సిందేనని పేర్కొన్నారు. లడాఖ్‌ నుంచే రియల్‌ఎస్టేట్‌ ప్రారంభం కానుందని వెల్లడించారు. స్థానిక రాజకీయాల సహకారం, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయనేది కూడా ముఖ్యమేనని తెలిపారు.

ఇంకో నిపుణుడు మాట్లాడుతూ.. 370 రద్దుతో కశ్మీర్‌లో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి అమాంతం పెరుగుతుంది. ఈ ప్రాంతాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడి స్థానికులు వాళ్ల కళ్ల ముందరే ఉహించని మార్పును​ చూస్తారు. బాలీవుడ్‌ తదితర సినిమా ఇండస్ట్రీలు వస్తాయి. భారీ కంపెనీలు అక్కడి మార్కెట్‌ వృద్ధికి వ్యూహాత్మకంగా పనిచేస్తూ స్థానికులతో కలసి జాయింట్‌ వెంచర్స్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇక చివరాగా సోషల్ మీడియాలో కశ్మీర్‌లో విల్లాలు, బంగ్లాలను కొనండని వస్తున్న ప్రకటనలు అవాస్తవమని, కశ్మీర్‌లో ఆస్తిని సొంతం చేసుకోవాలనుకునే వారు అలాంటి అయాచిత సలహా లేదా ఆఫర్ల వలలో పడొద్దని సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement