Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Election Commission of India Key Orders On Exit Polls
ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా రేపు వెలువడబోయే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటితో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడాల్సి ఉంది. అయితే.. నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ తాజాగా ఆదేశాలు విడుదల చేసింది. రేపు అంటే జూన్‌ 1వ తేదీ శనివారం సాయంత్రం 6:30 తరువాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాల్సిందేనని తాజా ఆదేశాల్లో ఈసీ పేర్కొంది.లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు,అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే వీటన్నింటికి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ఈసీ బ్యాన్‌ చేసింది. పూర్తి స్థాయిలో అంతటా పోలింగ్‌ ముగిసిన తర్వాతే వెల్లడించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్లకు మార్చి 28వ తేదీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈసీ స్పష్టం గా పేర్కొంది.

MLC Indukuri Raghu Raju Hospitalised New Drama
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీ కొత్త డ్రామా?

విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్‌పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. ఎమ్మెల్సీ రఘురాజు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్‌సీపీ శాసనమండలిలో ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్‌. అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్‌ మోషేన్‌ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్‌, స్పీకర్‌లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్‌, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది.

PM Modi addressed 206 public events during the campaign
PM Modi: మోదీ ప్రచార సునామీ.. ఒక్క నెలలోనే 96 ప్రచార సభలు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మారథాన్ ఇన్నింగ్స్ ఆడారు ప్రధాని మోదీ. 400 ప్లస్‌ స్థానాలే లక్ష్యంగా.. సుడిగాలిలా రాష్ట్రాలను చుట్టేశారు. 75 రోజుల్లో 206 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక ర్యాలీలు నిర్వహించారు ప్రధాని మోదీ. బహిరంగ సభలు, రోడ్‌షోలతోపాటు వివిధ మీడియా సంస్థలకు 80 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్‌ 1న జరిగే చివరి విడత పోలింగ్‌ కౌంట్‌డౌన్ మొదలైంది. కేంద్రంలో హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ప్రచారంలోనూ అదే దూకుడు ప్రదర్శించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను చుట్టేశారు. ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత నుంచి ఈ రెండున్నర నెలల్లో దాదాపు 180 ర్యాలీలు నిర్వహించారు ప్రధాని.ప్రధాని చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 31 సభలు నిర్వహించారు. దీదీ ఇలాకా పశ్చిమ బెంగాల్‌లో రికార్డుస్థాయిలో 22 ర్యాలీల్లో పాల్గొన్నారు. బుధవారం కూడా ఆయన బెంగాల్‌లో ప్రచారం చేపట్టారు. ఆ తర్వాత బిహార్‌పై దృష్టిపెట్టిన ప్రధాని.. ఆ రాష్ట్రంలో 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలో 19 ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 2019తో పోలిస్తే మహరాష్ట్రలో ఈసారి రెట్టింపు స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు మోదీ. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీలు చేపట్టినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.2024 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిపైగా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు ప్రధాని మోదీ. సౌత్‌లో బలం పెంచుకోవాలన్న లక్ష్యంతో.. ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. అందుకే మోదీ సభలు పెంచింది.ఒడిశాలో నవీన్ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌తో పొత్తు కుదరకపోవడంతో.. ఆ రాష్ట్రంపైనా బీజేపీ గట్టిగానే ఫోకస్‌ పెట్టింది. అక్కడ మోదీ 10 సభలు నిర్వహించారు. జగన్నాథ సన్నిధి పూరీలో ఆయన చేపట్టిన భారీ రోడ్‌ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇక సొంత రాష్ట్రం గుజరాత్‌లో మోదీ 5 సభల్లో పాల్గొనగా.. మధ్యప్రదేశ్‌లో 10, జర్ఖండ్‌లో 7, రాజస్థాన్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 4, హరియాణాలో 3 ర్యాలీలు నిర్వహించారు ప్రధాని. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రచారాల్లో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోనూ ఓసారి పర్యటించిన ప్రధాని.. పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిచ్చారు. 2024 ఎలక్షన్‌ సీజన్‌లో తన చివరి ప్రచారాన్ని పంజాబ్‌లో నిర్వహించారు ప్రధాని మోదీ. హోషియార్‌పుర్‌ బహిరంగ సభతో సార్వత్రిక ప్రచార పర్వానికి ముగింపు పలికి.. ధ్యాన ముద్రలోకి వెళ్లారు.

Dravid Rohit Sharma Inspect New York Pitch Know What Is Drop In Pitch Full Details
WC: పక్కా టీ20 టైప్‌.. న్యూయార్క్‌ పిచ్‌ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్‌తో పాటు..

టీ20 ప్రపంచకప్‌-2024 లీగ్‌ దశలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే న్యూయార్క్‌ చేరుకున్న రోహిత్‌ సేన ప్రాక్టీస్‌లో తలమునకలైంది.ఇక జూన్‌ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. అంతకంటే ముందే బంగ్లాదేశ్‌తో జూన్‌ 1 వార్మప్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఈ మైదానంలో ఉన్న డ్రాప్‌- ఇన్‌ పిచ్‌(drop-in pitch)ను శుక్రవారం పరిశీలించారు. క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం.. ఈ పిచ్‌ బ్యాటర్లకు అనూకూలించేలా ఉందని సమాచారం.ఇంతకీ డ్రాప్‌-ఇన్‌ పిచ్(drop-in pitch)‌ అంటే ఏమిటి?మ్యాచ్‌ జరిగే స్టేడియంలో కాకుండా బయట పిచ్‌ను తయారు చేసి.. ఆ తర్వాత దానిని అక్కడికి తరలించి నిర్ణీత ప్రదేశంలో ఫిక్స్‌ చేస్తారు.ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్(ఎంసీజీ)‌, అడిలైడ్‌ ఓవల్‌, పెర్త్‌లోని కొన్ని స్టేడియాలు ఇందుకు చక్కని ఉదాహరణ. ఈ మైదానాల్లో కేవలం క్రికెట్‌ మ్యాచ్‌లే కాదు.. సీజన్‌కాని సమయంలో ఫుట్‌బాల్‌, రగ్బీ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి.ప్రత్యేకమైన యంత్రం సాయంతోఎంసీజీలో 24 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు ఉన్న పిచ్‌ను నల్లరేగడి మట్టితో తయారు చేసి దానిపై గ్రాస్‌ను ఉంచుతారు. స్టీల్‌ ఫ్రేమ్స్‌లో తయారు చేస్తారు.మ్యాచ్‌లు ఉన్న సమయంలో కస్టమైజ్డ్‌ ట్రక్‌లో తీసుకువచ్చి ప్రత్యేకమైన యంత్రం సాయంతో పిచ్‌ను డ్రాప్‌ చేస్తారు. మ్యాచ్‌లు ముగియగానే అదే మెషీన్‌ సహాయంతో దానిని అక్కడి నుంచి తొలగిస్తారు.ఇక్కడ మొత్తం అవేఇక అమెరికా విషయానికొస్తే... తొలిసారిగా వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూయార్క్‌లో అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ జరగడం కూడా ఇదే మొదటిసారి. టీమిండియా వంటి మేజర్‌ జట్లు ఆడే మైదానంలో డ్రాప్‌-ఇన్‌ పిచ్‌లను ఉపయోగిస్తున్నారు.న్యూయార్క్‌ మైదానంలో వాడేందుకు 10 డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను తయారు చేశారు. ఇందులో నాలుగు మ్యాచ్‌ల కోసం.. మిగతావి వార్మప్‌ మ్యాచ్‌ల కోసం వినియోగిస్తారు.తయారు చేసింది వీళ్లేఅమెరికాలోకి తొలిసారి మేజర్‌ ఈవెంట్‌ జరుగనున్న తరుణంలో గతేడాది నుంచే పిచ్‌ల తయారీ మొదలుపెట్టారు. అడిలైడ్‌ ఓవల్‌ టర్ఫ్‌ సొల్యూషన్స్‌ గత డిసెంబరు నుంచి.. న్యూయార్క్‌ స్టేడియం కోసం ఫ్లోరిడాలో పిచ్‌ల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.ఇందుకోసం డ్రాప్‌-ఇన్‌ ట్రేలను అడిలైడ్‌లో తయారు చేయించి.. ఓడల ద్వారా ఫ్లోరిడాకు తరలించారు. కాగా ఈ ట్రేలను స్థానికంగా దొరికే మట్టితో నింపి.. బెర్ముడా గ్రాస్‌ను దానిపై పరిచారు. తర్వాత ఫ్లోరిడాలో దాన్ని ఇంక్యుబేట్‌ చేసి పూర్తిస్థాయి పిచ్‌గా తయారు చేశారు.తర్వాత వీటిని రోడ్డు మార్గం ద్వారా 20 సెమీ ట్రేలర్‌ ట్రక్కులలో జాగ్రత్తగా న్యూయార్క్‌కు తరలించారు. ఇక ఈ న్యూయార్క్‌ నసావూ కౌంటీ స్టేడియం కోసం లాండ్‌టెక్‌ గ్రూప్‌ అవుట్‌ఫీల్డ్‌ను తయారు చేసి ఇచ్చింది.పక్కా టీ20 టైపే!ఈ విషయం గురించి అడిలైడ్‌ ఓవల్‌ హెడ్‌ ప్రధాన క్యూరేటర్‌ డామియన్‌ హో ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘అనుకున్నట్లుగా పక్కా టీ20 తరహా పిచ్‌లు తయారు చేశామనే అనుకుంటున్నాం.పేస్‌, బౌన్స్‌కు అనుకూలించడంతో పాటు పరుగులు రాబట్టేందుకు కూడా ఈ పిచ్‌ అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం. బ్యాటర్లు మైదానం నలుమూలలా బంతిని తరలించేలా.. షాట్లు ఆడేందుకు వీలుగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అదీ న్యూయార్క్‌ పిచ్‌ వెనుక ఇంత కథ దాగుందన్న మాట!!అమెరికాలో టీ20 వరల్డ్‌కప్‌ వేదికలు👉న్యూయార్క్‌- నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం👉ఫ్లోరిడా- లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం👉డల్లాస్‌-టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియంలీగ్‌ దశలో న్యూయార్క్‌లో 3- 12 వరకు ఎనిమిది మ్యాచ్‌లు జరుగనున్నాయి. హై వోల్టేజ్‌ మ్యాచ్‌ ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌(జూన్‌ 9)కు కూడా ఇదే వేదిక కావడం విశేషం. చదవండి: T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు

Gam Gam Ganesha Movie Review And Rating In Telugu
‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ

టైటిల్‌: గం..గం..గణేశా నటీనటులు : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.నిర్మాణ సంస్థ:హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్నిర్మాతలు:కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచిరచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడిఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్విడుదల తేది: మే 31, 2024‘బేబీ’లాంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ మూవీపై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా భారీగా చేయడంతో ‘గం..గం..గణేశా’పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాలతో నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్‌కు గణేష్‌(ఆనంద్‌ దేవరకొండ) ఓ అనాథ. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయేల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు. అదే ఏరియాలో ఓ షాపులో పని చేసే శృతి(నయన్‌ సారిక)తో పీకల్లోతూ ప్రేమలో ఉంటాడు. అయితే శ్రుతి మాత్రం డబ్బుకు ఆశపడి ఆ షాపు ఓనర్‌ కొడుకుతో పెళ్లికి రెడీ అయిపోతుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో హర్ట్‌ అయిన గణేష్‌..ఎలాగైన భారీగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితుడు శంకర్‌తో కలిసి రూ. 7 కోట్లు విలువ చేసే డైమండ్‌ను దొంగిలిస్తాడు. ఆ డైమండ్‌ కోసం అరుణ్‌ (ప్రిన్స్‌ యావర్‌) గ్యాంగ్‌ గణేష్‌ వెంటపడుతుంది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ డైమంగ్‌ ఓ గణేశ్‌ విగ్రహంలోకి చేరుతుంది. ఆ విగ్రహం కర్నూలు జిల్లాకు చెందిన రాజావారు(సత్యం రాజేశ్‌)కొనుగోలు చేసి తన గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి విగ్రహంలో పడిపోయిన డైమండ్‌ కోసం గణేష్‌ ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని దొంగిలించేందుకు రుద్రా(కృష్ణ చైతన్య) గ్యాంగ్‌ ఎందుకు ప్రయత్నించింది? ముంబైలో చాలా విగ్రహాలు ఉన్నప్పటికీ.. రాజావారు ప్రత్యేకంగా ఆ విగ్రహాన్నే ఎందుకు కొనుగోలు చేశాడు? ఈ విగ్రహానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకుంటున్న కిషోర్‌ రెడ్డి(రాజ్‌ అర్జున్‌)కి ఉన్న సంబంధం ఏంటి? ఆర్గాన్‌ డేవిడ్‌(వెన్నెల కిశోర్‌) కారణంగా రుద్రా గ్యాంగ్‌తో పాటు గణేష్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆ విగ్రహం ఎవరికి దక్కింది? అందులో పడిపోయిన డైమాండ్‌ చివరకు ఎవరికి దక్కింది? గణేష్‌ లైఫ్‌లోకి కృష్ణవేణి(ప్రగతి శ్రీవాస్తవ)ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే మూడు లక్షణాలు ఉంటాయి. ఇవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ‘గం..గం..గణేశా’ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇలాంటి క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. కానీ డిఫరెంట్‌ కామెడీతో పాటు క్రిస్పీ ఎడిటింగ్‌తో హిలేరిస్‌గా కథనాన్ని సాగించాడు. కథ మొత్తం వినాయకుడి విగ్రహం చుట్టే తిరుగుతుంది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ సింపుల్‌గానే ఉన్నా ఎంటర్‌టైన్‌ చేస్తాయి.హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా కథ ఆ తర్వాత కర్నూల్ కు షిప్ట్ అవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే హీరో లవ్‌ ట్రాక్‌ అంతగా ఆకట్టుకోదు. డైమాండ్‌ దొంగిలించాలని హీరో ఫిక్సయ్యాక..కథలో వేగం పుంజుకుంటుంది. ఒకవైపు కిశోర్‌ రెడ్డి ట్రాక్‌.. మరోవైపు గణేష్‌ ట్రాక్‌ రెండింటిని సమాంతరంగా నడిపిస్తూ ఎక్కడా బోర్‌ కొట్టకుండా కథనాన్ని సాగించాడు. డైమండ్‌ వినాయకుడి విగ్రహంలోకి చేరడం..దాన్ని కిశోర్‌ రాజకీయ ప్రత్యర్థి గ్రామమైన రాజావారి పల్లెకు తీసుకెళ్లడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథంతా విగ్రహం చుట్టే తిరగడంతో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే విగ్రహం కొట్టేసేందుకు రుద్రా గ్యాంగ్‌, డైమండ్‌ను తీసుకెళ్లడం కోసం హీరో చేసే ప్రయత్నాలు అంతగా ఎంటర్‌టైన్‌ చేయవు. మతిభ్రమించిన డాక్టర్‌ ఆర్గాన్‌ డైమండ్‌గా వెన్నెల కిశోర్‌ పండించే కామెడీ మాత్రం సినిమాకు ప్లస్‌ అయింది. అతను తెరపై కనిపించిన ప్రతి సారి థియేటర్లలో నవ్వులు పూశాయి. అదేసమయంలో అరుణ్‌ గ్యాంగ్‌కు సంబంధించిన సన్నివేశాలు.. నీలవేణితో గణేష్‌ నడిపే లవ్‌ట్రాక్‌ కథకు అనవసరంగా జోడించినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో స్వామిజీ(రంజగన్‌)ఇచ్చే ట్విస్ట్‌ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు మాత్రం దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను నెగెటివ్‌ క్లైమాక్స్‌ని ఒప్పుకోరని అలా ముగించాడేమో. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే.. ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేని ఈ ‍క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. ఈ చిత్రంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. గ్రే షేడ్స్ ఉన్న గణేష్‌ పాత్రలో ఆనంద్‌ ఒదిగిపోయాడు. డ్యాన్స్‌తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఇక జబర్థస్త్‌ ఫేం ఇమ్మాన్యుయేల్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు శంకర్‌గా ఆయన చక్కగా నటించాడు. తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్లుగా నటించిన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక ఇద్దరు తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా..ఉన్నంతలో చక్కగా నటించారు. మతిభ్రమించిన డాక్టర్‌ ఆర్గాన్‌ డేవిడ్‌గా వెన్నెల కిశోర్‌ పండించిన కామెడీ సినిమాకు ప్లస్‌ అయింది. ఆ పాత్రకు మరిన్ని సన్నివేశాలు ఉంటే బాగుండేది. కిశోర్‌ రెడ్డిగా రాజ్‌ అర్జున్‌, రుద్రాగా కృష్ణ చైతన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. చేతన్‌ భరద్వాజ్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్‌ సినిమాకు ప్లస్‌ అయింది. సన్నివేశాలను చాలా క్రిస్పిగా కట్‌ చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Florida 12 Year Old Bruhat Soma Wins US Spelling Bee competition
అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా తెలుగు విద్యార్థి

అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్‌ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతి విద్యార్థుల హవానే కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజేతగా నిలిచాడు భారత సంతతి విద్యార్థి బృహత్‌ సోమ. కేవలం 90 సెకన్లలో అబ్సెయిల్‌ సహా 29 పదాలను అలవోకగా తప్పుల్లేకుండా చెప్పి..కప్‌ తోపాటు 50 వేల డాల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్‌ సోమ ప్రస్తుతం ఏడో గ్రేడ్‌ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్‌ సోమ నల్గొండకు చెందినవారు. ఈ ఏడాది స్పెల్లింగ్‌ బీ పోటీల్లో దాదాపు 240 మందికి పైగా పాల్గొన్నారు. అందులో ఏడుగురు గురువారం రాత్రికి ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక వారిలో బృహత్‌ సోమకి, టెక్సాస్‌కు చెందిన పైజాన్‌ జాకీ మధ్య టై ఏర్పడింది. దీంతో ఇద్దరికీ మరో రౌండ్‌ పోటీ నిర్వహించి 90 సెకన్ల సమయాన్ని కేటాయించారు నిర్వాహకులు. ఈ పోటీలో జాకీ 90 సెకన్లలో 20 పదాలు చెప్పగా, బృహత్‌ ఏకంగా 29 పదాలు చెప్పి టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్‌ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్‌లు చెప్పగా, ఆ రికార్డును బృహత్‌ బ్రేక్‌ చేశాడని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు బృహత్ గతంలో 2022లో స్పెల్లింగ్ బీలో 163వ స్థానానికి చేరురోగా, 2023లో 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం బృహత్ టైటిల్‌తో సత్తా చాటాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన జాకీ 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీని అందుకున్నాడు. ఇక ఈ పోటీల్లో శ్రేయ్‌ పరీఖ్‌ రెండోవ స్థానంలో నిలవగా, అనన్య రావు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అమెరికా ఈ స్పెల్లింగ్‌ బీ పోటీలను 1925 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో 29 మంది భారత సంతతి విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. (చదవండి: US: పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!)

Ksr Comments On The Importance Of Kcr Behavior In The Parliamentary Elections
గులాబీ పార్టీకి వెరీ వెరీ టఫ్‌ టైం!

తెలంగాణ రాజకీయాలలో పార్లమెంటు ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఒక పెద్ద పరీక్ష కాబోతుండగా, బీజేపీకి ఒక గేమ్‌గా మారబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. దానికి కారణం తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది ఒకటైతే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను రుజువు చేసుకోలేకపోతే తదనంతర పరిణామాల వల్ల నష్టపోయే అవకాశం ఉందన్న భావన మరొకటి అని చెప్పాలి.బీఆర్‌ఎస్‌ విషయం చూద్దాం. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రుజువు చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ది సంగతి ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా అహంభావంతో వ్యవహరించారన్న విమర్శ తెలంగాణ వ్యాప్తంగా ఉంది. సొంత పార్టీవారిని కూడా పెద్దగా కలవకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, శాసనసభ ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులను మార్చవలసి ఉన్నా, మార్చకపోవడం, తనపైనే అంతా నడుస్తుందన్న అభిప్రాయంతో రాజకీయం చేయడం వంటి కారణాల వల్ల ప్రజలలో అసమ్మతి ఏర్పడింది. నిజానికి ఆయన ఓ ఇరవై, ముప్పై మంది అభ్యర్దులను మార్చి ఉంటే తిరిగి అధికారంలోకి వచ్చేవారన్నది ఎక్కువ మంది ఫీలింగ్.సాధారణ ఎన్నికల ముందు వివిధ ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారం చేజిక్కించుకుందంటే ప్రజల అభిప్రాయాలు ఎంత త్వరగా మారతాయో గమనించవచ్చు. ఆ విషయాన్ని కేసీఆర్‌ పసికట్టలేకపోయారు. అక్కడికీ హైదరాబాద్ ప్రాంతంలో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్దిపనులు, విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడడం వంటి కారణాలతో బీఆర్‌ఎస్‌ స్వీప్ చేసింది. కానీ ఇతర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో బాగా దెబ్బతింది. ఫలితంగా అధికారాన్నే వదలుకోవల్సి వచ్చింది. అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ నేతల వ్యవహార సరళి ఎలా మారిపోయిందో చూడవచ్చు. అంతవరకు కేసీఆర్‌ పిలిస్తే చాలు అన్నట్లుగా ఉన్న నేతలు కొందరు ఓటమి తర్వాత మొహం చాటేసేవారు.కేసీఆర్‌ సొంత పార్టీని పునాదుల నుంచి నిర్మించుకోవడం కన్నా ఇతరపార్టీల నేతలను తీసుకు వచ్చి అందలం ఎక్కించడం ద్వారా బలపడదామని అనుకున్నారు. కానీ అదే బెడిసికొట్టింది. ఉదాహరణకు సీనియర్‌ నేత కే. కేశవరావు మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారంటే అది కేసీఆర్‌ పుణ్యమే అని చెప్పకతప్పదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జారుకున్నారు. కేశవరావుకు ఉన్న ప్రజాబలం పునాది చాలా తక్కువే అయినా, కేవలం నోరు పెట్టుకుని రాజకీయాలలో చెలామణి అయ్యారంటే అతిశయోక్తి కాదు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ నుంచి వచ్చిన నేత అయినా.. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రాధాన్యత తగ్గించారన్న భావన ఉంది. కడియం శ్రీహరి కోరుకున్నట్లు ఆయన కుమార్తెకు ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయినా దానిని వదలుకుని కాంగ్రెస్‌లోకి వెళ్లడం పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. దాంతో బీఆర్‌ఎస్‌ బలహీనపడుతోందన్న సంకేతం జనంలోకి వెళ్లింది.మరో కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌కు రెండుసార్లు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లి ఎంపీ అభ్యర్థి అయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాటలోనే ఉన్నారు. కానీ వారంతా పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌కు నాలుగు, ఐదు సీట్లు వస్తే వలసలు తగ్గుతాయి. కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, నాగర్ కర్నూలు సీట్లలో కొన్ని రాకపోతాయా? అని ఆశాభావంగా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఒకటి లేదా రెండు వస్తే గొప్పేనని అంటున్నారు.మెదక్ సీటుపై కొంత ఆశ ఉంది. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో వచ్చే మెజార్టీతో గట్టెక్కవచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. ఒకవేళ ఈ సీటు కూడా రాకపోతే పార్టీకి కష్టాలు తప్పవు. కేసీఆర్‌ జారి గాయపడి కోలుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లకపోవడం కొంత నష్టం చేసిందని చెప్పాలి. ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గింది. కేటీఆర్‌, హరీష్‌రావు వంటివారు ఎంత గట్టిగానే పనిచేసినా, ప్రతిపక్ష నేత అసెంబ్లీలోకి రాకపోవడం బలహీనతగానే చూడాలి. పార్లమెంటు ఎన్నికలలో కేసీఆర్‌ బస్సు యాత్ర చేపట్టిన తర్వాతే పార్టీకి మళ్లీ ఊపిరి పోసినట్లయింది. జనం పెద్ద ఎత్తున తరలిరావడం ఉపశమనం కలిగించింది. అయినా ఓట్లు పడతాయా?లేదా? అనేది చెప్పలేని పరిస్థితి.పార్లమెంటు ఎన్నికలలో ఐదు సీట్లు గెలిచినా, లేకపోయినా కేసీఆర్‌ వ్యవహరించే శైలిపైనే ఆయన పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రజలు తమ ఓట్లను ఈ ఎన్నికలలో బీజేపీకి వేశారన్న అభిప్రాయం ప్రబలింది. బీఆర్‌ఎస్‌ గెలవలేదన్న భావనతో పలువురు ఇలా చేశారన్నది ఒక వాదన. దీనిని కేసీఆర్‌ కానీ, ఆయన పార్టీవారు కానీ అంగీకరించకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ ఐదేళ్లు నిలబడుతుందా? లేక బీజేపీ పుంజుకుని బీఆర్‌ఎస్‌ను దెబ్బతీస్తుందా? అన్నది ఫలితాలను బట్టి ఉండవచ్చు.కాంగ్రెస్ పార్టీ కనీసం ఏడెనిమిది సీట్లు తెచ్చుకోగలిగితే ఆ పార్టీవైపు బీఆర్‌ఎస్‌ నేతలు చూడవచ్చు. అదే బీజేపీ కనుక ఎనిమిది పైగా సీట్లు తెచ్చుకుంటే బీఆర్‌ఎస్‌ పై నమ్మకం కోల్పోయినవారు ఆ పార్టీవైపు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. బీఆర్‌ఎస్‌ను పూర్తిగా దెబ్బతీయడం ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ యత్నిస్తోంది. ముందుగా దీనిని నిరోధించడం పెద్ద సవాలు అవుతుంది. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలనుంచి ఫిరాయింపులపైన అధిక దృష్టి పెట్టారు. ఇతర పార్టీలను బలహీనపర్చడం వేరు. తనపార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేసుకోవడం వేరు. కేసీఆర్‌ మొదటి నుంచి ఈ విషయంలో అంత గట్టిగా లేరనే చెప్పాలి.తెలంగాణ ఉద్యమం పెరగడానికి కారణం అయనే అయినప్పటికీ 2009లో టీఆర్ఎస్‌కు పది అసెంబ్లీ సీట్లే రావడం అప్పట్లో అశనిపాతం అయింది. ఆ రోజుల్లో ఆయన ఒక దశలో నిస్పృహలోకి వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతలో ఆనాటి సీఎం రాజశేఖరరెడ్డి మరణంతో రాజకీయ పరిణామాలు వేగంగా ఆయనకు అనుకూలంగా మారాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్‌ సీఎం కావడం, తొమ్మిదిన్నరేళ్లు నిర్విఘ్నంగా కొనసాగడం జరిగాయి. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడం, ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరింప చేయడం కోసం ప్రయత్నించడం వంటివి కూడా జనానికి పెద్దగా నచ్చలేదు. పేరు మార్చడమే చాలా మందికి ఇష్టం లేదు.అప్పట్లో కాంగ్రెస్‌ను వీక్ చేయడానికి కేసీఆర్‌ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి వారు బీఆర్‌ఎస్‌లో కొనసాగడమా? లేక కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరడంపై ఆలోచన చేస్తారు. కేసీఆర్‌ వీటిని పట్టించుకోనవసరం లేదు. ఆయన నిత్యం ప్రజలలో ఉంటూ, ఐదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుంటే వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ విజయావకాశాలు పెంచుకోవచ్చు. కానీ కేసీఆర్‌ అంత సహనంతో, ఓపికతో రాజకీయం చేయవలసి ఉంటుంది. గత పార్లమెంటు ఎన్నికలలో నాలుగు సీట్లు బీజేపీ గెలుచుకున్నప్పుడే కేసీఆర్‌ అప్రమత్తం అయి ఉండవలసింది. బీజేపీతో అనవసర వివాదాలకు వెళ్లి కొంత నష్టపోయారు. తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం కూడా కొంత అప్రతిష్టగా మారింది.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన బీజేపీవైపు వెళ్లలేరు. అలాగని కాంగ్రెస్‌తో స్నేహం చేయలేరు. సొంతంగా పార్టీ నిలబడాలంటే కేసీఆర్‌ చాలా కష్టపడవలసి ఉంటుంది. నిత్యం ప్రజలలోనే సంచరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయగలగాలి. ఈ లోగా తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములు ఆయన మెడకు చుట్టుకోకుండా ఉండాలి. ఐదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ నిలబడగలిగితే, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడే అసంతృప్తిని క్యాష్ చేసుకుని మళ్లీ అధికారంలోకి రాగలుగుతారు. అంత వరకు వేచి ఉండే ఓపిక, పోరాడే శక్తి కేసీఆర్‌కు ఉన్నాయా? అన్నదే ప్రశ్న.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

JDS MP Prajwal Revanna remanded to six days police custody
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్‌ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్‌ కస్టడీ

బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ సస్పెండెడ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్‌ కస్టడీ విధించారు.. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ఆరురోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చింది.ఇక మైసూర్‌లోని కేఆర్ నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్‌ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవణ్ణ కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.కాగా జర్మనీ నుంచి బయల్దేరిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. గురువారంయ అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిన వెంటనే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను భారీభద్రత మధ్య విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు. శుక్రవారం ఉదయం రేవణ్ణకు బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజ్వల్‌ను సిటీ సివిల్‌ కోర్టుకు తరలించారు. అక్కడ అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి.. ప్రజ్వలను 14 రోజులపాటు తమ కస్టడికి అప్పగించాలని సిట్‌ కోర్టును కోరింది.మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ 2014-19లో హాసన నుంచి జీడీఎస్‌ తరపున ఎంపీగా గెలుపొందారు. ఈ లోక్‌సభల్లోనూ ఎన్డీయూ కూటమి తరపున. హాసన నుంచి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన ఆచూకి కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్‌’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

Is Balakrishna facing tough time in Hindupur Assembly Fight
హిందూపురంలో బాలకృష్ణకు ఎదురీత తప్పదా?

ఎన్నికల వేళ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. హిందూపురం నుంచి ఎవరు విజేతగా నిలుస్తారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత నలభై సంవత్సరాలుగా టీడీపీ అభ్యర్థులే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. అయితే ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణకు హిందూపురం ఓటర్లు గట్టిగానే గుణపాఠం చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే సినీ హీరో బాలయ్య హిందూపురంలో ఎదురీదుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గంలో మొత్తం 2,49,174 మంది ఓటర్లు ఉండగా. 77.82 శాతం ఓటింగ్ నమోదైంది. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీఎన్‌ దీపిక పోటీ చేయగా..ఎన్‌డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ బరిలో నిలిచారు. నందమూరి కుటుంబానికి కంచుకోటగా హిందూపురం నియోజకవర్గానికి పేరుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 1985 నుంచి వరుసగా మూడు సార్లు, ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ 1996లో జరిగిన ఉప ఎన్నికలో ఒకసారి హిందూపురం నుంచే గెలిచారు.2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే మా బ్లడ్ వేరు..మా బ్రీడ్‌ వేరు అంటూ డప్పు కొట్టుకునే బాలకృష్ణకు బీసీ మహిళ అయిన కురుబ దీపిక చుక్కలు చూపించారు. నియోజకవర్గం అంతటా ఇంటింటా ప్రచారం నిర్వహించి వైఎస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లారు. తాను హిందూపురం కోడలినని.. తనకు ఓటు వేస్తే హిందూపురంలోనే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు. తనను రెండుసార్లు అసెంబ్లీకి పంపించిన హిందూపురం ప్రజల బాగోగులను ఆయన ఏనాడూ పట్టించుకోలేదు.తాను హైదరాబాద్‌లో సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ..హిందూపురంలో తన తరపున పీఏలను ఏర్పాటు చేసి ప్రజాగ్రహానికి గురయ్యారు బాలకృష్ణ. అందుకే ఈ ఎన్నికల్లో బాలకృష్ణకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో బాలకృష్ణకు వ్యతిరేక పవనాలు బలంగా వీచినట్లు చర్చ జరుగుతోంది. హిందూపురం పట్టణంలో ముస్లిం మైనార్టీలు పెద్దసంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు స్పష్టం అవుతోంది. దీంతో ఫలితం ఎలా ఉండబోతోందో అని సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ టెన్షన్ కు గురవుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో ఖచ్చితంగా హిందూపురంలోనూ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.మూడోసారి గెలవాలనే లక్ష్యంతో నందమూరి బాలకృష్ణ ఆపసోపాలు పడ్డారు. పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉండి..నియోజకవర్గం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి..ఇప్పుడు తనను ఈసారి గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తానంటూ చెప్పిన కబుర్లు ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీయే విశ్వసనీయత కోల్పోగా..ఆయన బావమరిదిగా బాలకృష్ణ కూడా అదే బాటులో పయనించి ప్రజలకు దూరమయ్యారు. అందుకే ఈసారి హిందూపురంలో ఫ్యాన్ గిర్రున తిరిగిందని చెబుతున్నారు.

Today Gold and Silver Price 31 May 2024
స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి: ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఎట్టకేలకు స్థిరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు (మే 31) పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66700 (22 క్యారెట్స్), రూ.72760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి.ఈ రోజు చెన్నైలో కూడా బంగారం ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 67300 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73420 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరలే ఈ రోజూ ఉన్నట్లు సమిష్టమవుతుంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు ఎటువంటి మార్పు చెందలేదు. నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66850, కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72910గా ఉంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి మాత్రం రూ. 1000 తగ్గింది. కాబట్టి కేజీ వెండి ధర రూ. 95500 వద్ద ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా వెండి ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. కానీ వెండి ధర త్వరలోనే రూ. 1 లక్షకు చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement