పేదలకు ఇళ్లు కాలనీలు కాదు ఊళ్లు | Sakshi
Sakshi News home page

పేదలకు ఇళ్లు కాలనీలు కాదు ఊళ్లు

Published Fri, Apr 26 2024 4:24 AM

Owning a Home dreams of lakhs of poor people realized: Andhra Pradesh

నిరుపేదల సొంతింటి కల సాకారం   

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు అమలు 

దేశంలోనే రికార్డుగా 31.19 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలు 

స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు 

21.75 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు 

అనతికాలంలోనే 9 లక్షలకు పైగా ఇళ్ల పూర్తి 

టీడీపీ మోకాలడ్డినా లక్ష్యసాధనలో జగన్‌ ముందంజ 

  • నిన్నటి కన్నా ఈ రోజు బాగుండాలి...ఈ రోజు కన్నా రేపు బాగుండాలి...ఎవరైనా కోరుకునేది ఇదే...సగటు మనిషి కాస్తంత నీడ కోసం పరితపిస్తాడు...తన సంపాదన ఓ చిన్న గూడును కట్టుకోవడానికీ చాలకపోతే ప్రభుత్వం సాయపడుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తాడు...ప్రభుత్వం ఓట్ల కోసం తప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వస్తే మోసపోయానే...అని తనలో తానే మథనపడతాడు...మోసమనే ఇటుకతో గాలిలో మేడలు కట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిరుపేదలను ఇలాగే వంచించింది... ఆ వంచనకు శాస్తిగా బాబును చిత్తుగా ఓడించింది జనసామాన్యం...ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలకు ఆచరణ రూపమిస్తే జననీరాజనం ఎలా ఉంటుందో నేడు జగన్‌ మేం సిద్ధం యాత్ర సాక్ష్యంగా నిరూపిస్తోంది...
     

  • ఆ హామీ పేరు పేదలకు ఇళ్లు...అర్హతే ప్రాతిపదికగా దేశంలోనే రికార్డుగా...ఒక ఘనతగా చెప్పేలా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలకు గాలిలో కాదు...నేలపైనే మేడలు...ఇంకా చెప్పాలంటే ఊళ్లకు ఊళ్లను నిర్మిస్తూ...నవ్యాంధ్ర చరితను సీఎం జగన్‌ తిరగరాస్తున్నారు... స్థలం విలువ ఆధారంగా చూస్తే ఒక్కొక్కరికి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల ఆస్తిని ఉచితంగా కట్టబెట్టిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని జనసామాన్యమే ఉప్పొంగిపోతోంది...ఇది కదా మాటకు కట్టుబడి...మడమ తిప్పని ప్రభుత్వానికి సార్థకత. –వడ్డే బాలశేఖర్, సాక్షి ప్రతినిధి

  • ప్రతి పేదవాడు ఏం కోరుకుంటాడు? ‘కడుపు నింపుకోవడానికి గుప్పెడు మెతుకులు, తలదాచుకోవడానికి ఓ సొంత గూడు’.. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా తమకంటూ ఓ సొంత గూడు లేని పేదలు ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందిన వేళంగిణి, దుర్గ తరహాలనే రాష్ట్రంలో తమకంటూ ఓ పక్కా ఇల్లు ఉండాలనే ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నాన్ని తోబుట్టువుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు.
     

  • రాష్ట్ర, దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పేదలకు పెద్ద ఎత్తున ఉచితంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణానికి సాయం, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇలా ప్రతి అడుగులోనూ చేయి పట్టి అక్కచెల్లెమ్మలను ముందుకు నడిపారు. ఇదిలా ఉండగా 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ, విజనరీ లీడర్‌ అని చెప్పుకునే చంద్రబాబు పేదల ఇళ్ల స్థలాలను శ్మశానాలతో పోల్చిన దుస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, విభజిత ఏపీలో ఒక పర్యాయం సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి ఏనాడు పేదల గూడు గోడును పట్టించుకోలేదు.   
     

  • అడ్డంకులను అధిగమిస్తూ... 
    రాష్ట్రంలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం రూపంలో ఏకంగా కొత్తగా ఊళ్లకు ఊళ్లనే సీఎం జగన్‌ గడిచిన ఐదేళ్లలో నిర్మించ తలపెట్టారు. 71,811 ఎకరాల్లో 31.19 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తద్వారా 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు. పేదలకు పంపిణీ చేసిన ఒక్కో ప్లాట్‌ విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటుంది. ఈ లెక్కన ఏకంగా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ప్లాట్‌ల మార్కెట్‌ విలువ రూ.76 వేల కోట్లకు పైమాటే. నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల సాకారానికి చిత్తశుద్ధితో సీఎం జగన్‌ అడుగులు వేస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అడుగడుగునా పథకాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
     

  • టీడీపీ, తమ మద్దతుదారుల ద్వారా కోర్టుల్లో 1,000 కేసులను వేయించి, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలను పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. ఈ అడ్డంకులేవీ జగన్‌ మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. దేశంలోనే తొలిసారిగా ఉచితంగా పంపిణీ చేసిన స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులను సీఎం జగన్‌ ప్రభుత్వం కల్పించింది. వారి పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ అందించింది. 2024లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టి 15 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో మిగిలిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.   

  • పేదల తరపున పెత్తందారులతో యుద్ధం 
    అమరావతిలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు చెందిన నిరుపేదలకు సీఎం జగన్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక అసమతుల్యత (డెమోగ్రాఫిక్‌ ఇంబ్యాలెన్స్‌) ఏర్పడుతుందని టీడీపీ కోర్టులకు వెళ్లి స్టే తెచ్చింది. అయినా జగన్‌ మనోబలం సడలిపోలేదు. పేదల తరపున పెత్తందారులతో సీఎం జగన్‌ ప్రభుత్వం యుద్ధం చేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లి విజయం సాధించి గత ఏడాది 50,793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది.
     

  • ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పేదలకు అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దంటూ కేంద్ర ప్రభుత్వానికీ టీడీపీ మద్దతుదారులు అనేక ఫిర్యాదులు చేశారు. ఈ అడ్డంకులను సైతం అధిగమించి అనుమతులు రాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి గత ఏడాది జూలై 24న సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ టీడీపీ పేదల ఇళ్లకు అడ్డుపడుతూ తన కపటబుద్ధిని ప్రదర్శించింది. మరోమారు కోర్టుకు వెళ్లి పేదల ఇళ్ల నిర్మాణంపై స్టే తెచ్చి నిర్మాణాలను అడ్డుకుంది. 

  • కోర్టులనూ మోసం చేసిన టీడీపీ... 
    మహిళల పేరిటే ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఎందుకివ్వాలనే అభ్యంతరాలతో హైకోర్టులో  తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణæ జరిపిన న్యాయస్థానం 2021లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత తాము కోర్టులో పిటిషన్‌ వేయలేదంటూ వారు వెల్లడించారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ దళారులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ ఆధార్, రేషన్‌ కార్డులతో పాటు, వారి సంతకాలు, రూ.5 వేల నుంచి రూ.40 వేల వరకూ డబ్బు వసూళ్లు చేశారు.
     

  • ఇలా మా నుంచి తీసుకున్న ధ్రువపత్రాలతో మాకే తెలియకుండా కోర్టుల్లో టీడీపీ నాయకులే కేసులు వేశారంటూ అప్పట్లో పేదలు బయటకు వచ్చి చెప్పారు. యర్రజర్ల కాల్వ సమస్యకు ఫిర్యాదు చేద్దామంటూ బల్లి ప్రభాకర్‌రావు, జాజుల హరికృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి తెల్ల కాగితంపై సంతకం, ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ కాపీలు తీసుకుని ఇళ్ల పట్టాల పంపిణీపైనా టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారు. తమను టీడీపీ నాయకులు మోసగించినదానిపై లిఖితపూర్వకంగా వివరించారు. 

  • రికార్డు స్థాయిలో 
    31.19 లక్షల ఇళ్ల పట్టాలు రికార్డు సృష్టించడమే కాకుండా, కరోనా, కోర్టు కేసులు, ఇతర అడ్డంకులను ఎదురొడ్డి అనతికాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టి మరో సరికొత్త రికార్డును సీఎం జగన్‌ కైవసం చేసుకున్నారు. 2020 డిసెంబర్‌లో ఇళ్ల స్థలాల పంపిణీ అనంతరం వివిధ దశలుగా 21.75 లక్షల ఇళ్ల (19.13 లక్షలు సాధారణ ఇళ్లు, 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు) నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలినవి శరవేగంగా నిర్మితమవుతున్నాయి.
     

  • సాధారణ ఇళ్లలో 11.61 లక్షల గృహాలు వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. 2020 డిసెంబర్‌ 25న కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో పట్టాలను పంపిణీ చేయడంతో పాటు పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్ల నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందించారు. 

  • ఉచితంగా స్థలం... ఆపై అమిత సాయం 
    ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్‌ ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు, ఎస్‌హెచ్‌జీల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయం అందించింది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేల చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చింది. 


  •  

  • గేటెడ్‌ కమ్యూనిటీల తరహాలో... 
    పేదలకు సొంత గూడు కల్పించడమే కాకుండా కాలనీలను ప్రైవేట్‌ గేటెడ్‌ కమ్యూనిటీల తరహాలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. విశాలమైన రోడ్లు, విద్యుత్‌ సరఫరా, డ్రైనేజీ, పార్కులు, ఇంటర్నెట్‌ సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్ర మంలో మౌలిక సదుపాయా ల కల్పన కోసమే ఏకంగా రూ.32,909 కోట్లను వెచ్చిస్తోంది. 

  • చంద్రబాబు రూ.8,929.81కోట్ల  అవినీతి  
    చంద్రబాబు తన అక్రమాలకు  పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించేందుకు 2016–17లో రాష్ట్రంలో అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పారు. 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు.
     

  • ఇలా నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్చిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టింది.  2016–17లో మార్కెట్‌లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1,000 మధ్య ఉండగా... కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్‌ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్‌ ధర కంటే తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. 
     

  • ఇలా తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు చాలినంత భూమి లేదని 3.15 లక్షల ఇళ్లకే  శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మించేందుకు అనుమతులిచ్చి రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షల భారం మోపి, 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాలని షరతు పెట్టింది. దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. ఇంకా 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు 
    చేసింది.  

  • వాళ్లిప్పుడు లక్షాధికారులు
    ఒకప్పుడు అద్దె ఇళ్లలో, పూరిగుడిసెల్లో ఎన్నో అగచాట్లు, ఇబ్బందులు పడ్డ మహిళలు, నిరుపేద కుటుంబాలు సీఎం జగన్‌ చొరవతో లక్షాధికారులుగా మారారు. అది ఎలాగంటే... మహిళల పేరిట రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ విలువ చేసే స్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికీ సాయం చేశారు. స్థలం, ఇంటి రూపంలో ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ప్రాంతాన్ని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ మార్కెట్‌ విలువ చేసే స్థిరాస్తి సమకూరినట్లయింది. ఇలా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపదను ప్రభుత్వం సృష్టించింది.  


  •  

  • సమాజంలో గౌరవం పెరిగింది. 
    నా భర్త భవన నిర్మాణ కార్మికుడు. మాకు సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటిలో ఉంటున్నాము. ఓ వైపు పిల్లల చదువులు, మరోవైపు ఇంటి అద్దెలు. కుటుంబ పోషణ భారం. మా అద్దె ఇంటి కష్టాల నుంచి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఎటువంటి సిఫార్సులు లేకుండా ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి ఇంటిస్థలం రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. జగనన్న దయతో సొంతింటి భాగ్యం కలిగింది. గతంలో మాకంటూ సొంతిల్లు లేదని బంధువులు, సన్నిహితుల్లో చిన్న చూపు ఉండేది. ప్రస్తుతం ఆ సమస్య లేదు. సమాజంలో మాకు గౌరవమూ పెరిగింది.  – మీసాల వనజాక్షి, వైఎస్సార్‌ జగనన్న కాలనీ, పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా   

  • మాగోడు విన్న నేత సీఎం కావాలి 
    నా భర్త భానుప్రసాద్‌ పెయింటింగ్‌ పని చేస్తారు. మా ఇద్దరు పిల్లలతో కలిసి మా అత్తమ్మ వాళ్లింట్లో ఉండేవాళ్లం. ఒకే ఒక గది. ఆ గదిలోనే వంట చేసుకోవాలి. ఇరుకు ఇంట్లో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డాం. మా కష్టాలను సీఎం జగన్‌ ప్రభుత్వం ఆలకించింది. ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల రుణమూ ఇచ్చింది. ఇప్పుడు మాకు రూ.15 లక్షలకు పైగా విలువైన సొంత ఆస్తి ఉంది. మా గూడు గోడు విని, గోడు తీర్చిన నేతనే సీఎంగా మళ్లీ కావాలి. ఆయన్ని మేం సీఎం చేసుకుని తీరుతాం.  
    – బుడితి బాలామణి, దగ్గులూరు, పశ్చిమగోదావరి జిల్లా 

  • పథకం అమలులో కీలక ఘట్టాలు
    ► 2020 డిసెంబర్‌: 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు. 
    ​​​​​​​► 28 ఏప్రిల్‌ 2022: పథకంలో రెండో దశకు శ్రీకారం. 1.24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. 3.53 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు.  
    ​​​​​​​► 27 మే 2023: సీఆర్‌డీఏలో రూ.3,506 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 1,402.58 ఎకరాల భూమి 50,793 మంది అక్కచెల్లెమ్మలకు పంపిణీ. 
    ​​​​​​​► 24 జూలై 2023: సీఆర్‌డీఏలో 47,071 పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్‌ శంకుస్థాపన. 

  • బాబు చేతిలో దగాపడ్డ టిడ్కో లబ్ధిదారులకు అండగా  
    వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో ప్రభుత్వం 2,62,212 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. పేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తోంది. 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ. లక్ష చొప్పున వాటా చెల్లించాలనే నిబంధనలో సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ఈ  ప్రభుత్వమే చెల్లించింది. 
     

  • దీంతో రెండు, మూడు కేటగిరీల పేదలు గత ధరల ప్రకారం చెల్లించాల్సిన రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు ఈ  సర్కారు తగ్గించింది. విద్యుత్, రోడ్లు వంటి అన్ని వసతుల కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్‌డీడ్, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, యూజర్‌ చార్జీలు భరించడంతో లబ్ధిదారులు మొత్తం రూ.5,487.32 కోట్ల మేలు పొందారు. మొత్తం ఇళ్లలో ఫేజ్‌–1 కింద 1,51,298 ఇళ్లను నూరు శాతం నిర్మాణం పూర్తి చేసి, 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది.   

  • ► ఈ ఫొటోలో సెల్ఫీ తీసుకుంటున్న టి.తిరుపతి స్వామి, వేళంగిణిలది బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామం. వీరు రెండేళ్ల క్రితం గ్రామంలోని కృష్ణా కెనాల్‌కు సంబంధించిన పిల్లకాలువ గట్టుపై పూరి గుడిసెలో నివసించేవారు. ఆ గుడిసెలోనే వేళంగిణి అమ్మ, అన్నయ్య కుటుంబాలూ ఉండేవి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ...ఈ కుటుంబం ప్రత్యక్ష నరకాన్ని అనుభవించింది. గత ప్రభుత్వంలో ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా...ఇంటి స్థలం మంజూరు కాలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వేళంగిణికి ఇంటి స్థలం, ఇంటిని మంజూరు చేసి నిర్మించి ఇచ్చింది. 
     

  • 2022 సెప్టెంబర్‌లో ఈ కుటుంబం ఆ ఇంటిలోకి మారింది. ‘నా చిన్నప్పటి నుంచి కాలువ గట్టుపై మురికి కూపంలో గుడిసెల్లోనే బతికాను. దీపం వెలుతురు తప్ప కరెంటు కనెక్షన్‌ ఉండేది కాదు. వర్షాలు కురిస్తే మా గుడిసె వరదనీటిలో మునిగిపోయేది. మురుగు నీరు బయటకు వెళ్లిపోయి, సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ రోడ్డు పక్కనే ఉండేవాళ్లం. సాధారణ రోజుల్లోనూ మురికి నీటి కారణంగా దోమల బెడద తీవ్రంగా ఉండేది. పాములు, తేళ్లు, కీటకాలు గుడిసెల్లోకి వచ్చేసేవి. సీఎం జగన్‌ ప్రభుత్వం మా గోడును ఆలకించింది. ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, ఇంటినీ నిర్మించి ఇచ్చింది. గుడిసెల్లో నివాసం దినదినగండమే. కంటి నిండా నిద్రపోయిన రోజులే లేవు. ఇప్పుడు మాకంటూ ఓ సొంత ఇల్లుంది. గుడిసె కష్టాలన్నీ తొలగిపోయాయి..’ అని వేళంగిణి సంతోషం వ్యక్తం చేస్తోంది.   

  • ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన మేడిశెట్టి దుర్గ భర్త సంచులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దుర్గ కూలి పనులకు వెళుతుంటారు. వారికి ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు లేదు. 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. దంపతుల అరకొర సంపాదన ఇంటి అద్దె, కుటుంబ పోషణకే సరిపోతుంది. సీఎం జగన్‌ ప్రభుత్వంలో దుర్గకు విస్సాకోడేరు జగనన్న లే అవుట్‌లో స్థలంతో పాటు ఇల్లు మంజూరయింది. ప్రభుత్వ సాయం రూ.1.80 లక్షలకు, కొంత సొంత నగదు జోడించి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు అద్దె బాధలు తప్పాయని ఆ కుటుంబం సంబరంగా చెబుతోంది. ఇక్కడ సెంటు స్థలం రూ.4 లక్షలు ఉంటుందని, జగనన్న దయతోనే తమ కల నెరవేరిందని ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలైనా సొంతింటిలో జీవించాలని మాకు కోరిక. సీఎం జగన్‌ మా కోరికను నెరవేర్చారని భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement
Advertisement