నిబంధనలకు నీళ్లు.. | Sakshi
Sakshi News home page

నిబంధనలకు నీళ్లు..

Published Tue, Apr 23 2024 8:40 AM

- - Sakshi

చర్లలో ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన
● నిషేధాజ్ఞలు బేఖాతర్‌, ఎడాపెడా ఇసుక తవ్వకం ● అక్షయ పాత్రల్లా మారిన ఇసుక స్టాక్‌ పాయింట్లు ● మాఫియాకు అధికార యంత్రాంగం వత్తాసు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞాలను ఇసుక మాఫియా ఏ కోశానా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలకు వక్ర భాష్యాలు చెబుతూ లెక్కా పత్రం లేకుండా గోదావరి నుంచి ఇసుకను అక్రమంగా దోచేస్తున్నారు.

తవ్వకాలపై నిషేధం ఉన్నా..

గోదావరిలో ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం రెండు నెలల క్రితం విధించిన నిషేధం అమల్లో ఉంది. స్టాక్‌ పాయింట్‌లో ఉన్న ఇసుకను మాత్రమే అమ్మాలి. కానీ చర్ల మండలంలో రెండు నెలలు గడిచినా స్టాక్‌ పాయింట్లలో ఇసుక అమ్మకం పూర్తి కాలేదు. నిత్యం లారీల్లో ఇక్కడి నుంచి ఇసుక తరలిపోతోంది. అయినప్పటికీ ఈ స్టాక్‌ పాయింట్‌లో ఇసుక అయిపోవడం లేదు. ప్రతీరోజు అక్షయ పాత్ర తరహాలో కొత్త ఇసుక రాశులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక్కడ నిత్యం ఇసుక అమ్మకాలు సాగుతున్నా స్టాక్‌ పాయింట్‌లో కొరత అన్న పదమే వినిపించక పోవడానికి ప్రభుత్వ నిషేధాజ్ఞల ఉల్లంఘనే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇసుక అమ్ముకునేందుకు తమకు అనుమతులు ఉన్నాయంటూ భారీ యంత్రాలతో నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు.

ఎవరికీ కనిపించడం లేదు

చర్ల మండల పరిధిలో గోదావరి తీరం వెంట సుబ్బంపేట, వీరాపురం, పెద్దిపల్లి, కొత్తపల్లిలో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ప్రభుత్వ నిషేధం అమల్లోకి రాగానే స్టాక్‌ పాయింట్‌లో ఇసుక అమ్మకం పూర్తయిన తర్వాత పెద్దిపల్లి, కొత్తపల్లి మినహా మిగిలిన చోట్ల ర్యాంపుల్లో కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. కానీ పెద్దిపల్లి ర్యాంపుల్లో అక్షయ పాత్ర తరహాలో ఇప్పటికీ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. గోదావరి నుంచి ఇసుకను తీయొద్దనే ప్రభుత్వ నిషేధాన్ని పూర్తిగా గోదావరిలో కలిపేశారు. ఆఖరికి పెసా వంటి ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ లారీలు, ప్రొక్లెయినర్లు (జేసీబీ) వంటి భారీ యంత్రాలను రాత్రీ పగలు తేడా లేకుండా గోదావరిలోకి పంపిస్తున్నారు. నది నుంచి ఇసుకను ఎడాపెడా తోడేస్తున్నారు.

కన్నెత్తి చూడరు

చర్ల మండలంలో జరుగుతున్న ఇసుక దందాకు అధికార యంత్రాంగం అండదండలు దండిగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. స్టాక్‌ పాయింట్‌లో ఇసుక అమ్ముతున్నారనే ముసుగులో నది నుంచి నిత్యం భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నా చూసీచూడనట్టుగా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రతీ రోజు వందల సంఖ్యలో ఇసుక లారీలు ఇటు భద్రాచలం, అటు వెంకటాపురం మీదుగా రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గిరిజనుల హక్కులకు రక్షణగా ఉన్న చట్టాలను అమలు చేయించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా మిన్నకుండి పోతున్నారు.

నిబంధనలు ఇలా

కాగితాలపై కనిపించే నిబంధనలు ఒకలా ఉంటే, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరు మరోలా ఉంటోంది. చర్ల మండలం ఏజెన్సీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ గిరిజనుల రక్షణ కోసం పెసా చట్టాన్ని అమలు చేయాల్సి ఉంది. దీని ప్రకారం ఇక్కడున్న ప్రకృతి వనరులపై తొలి హక్కు గిరిజనులకే దక్కుతుంది. ఈ క్రమంలో గిరిజనులకు ఎక్కువ లబ్ధి జరిగేలా పనులు జరగాలి. యంత్రాలను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ ఇసుకను తోడేందుకు వీలు లేదు. స్థానిక గిరిజనులకు ఎక్కువ రోజులు ఉపాధి దొరికేందుకు వీలుగా మానవ శక్తితోనే ఇసుక తవ్వకాలు చేపట్టాలి. అంతేకాదు.. ఇసుక క్రయవిక్రయాలు, తోడటం వంటి పనులు నిర్వహించేందుకు గిరిజనులతోనే సొసైటీలు ఏర్పాటు చేయాలి.

Advertisement
Advertisement