ఏపీలో అరబిందో ప్లాంటు సిద్ధం | Sakshi
Sakshi News home page

ఏపీలో అరబిందో ప్లాంటు సిద్ధం

Published Fri, Mar 15 2024 4:44 AM

Aurobindo Pharma unit Pen-G plant ready to Trail Run in Kakinada - Sakshi

వచ్చే నెలలోనే ట్రయల్‌ రన్‌

రూ.2,400 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెన్‌–జి (పెన్సిలిన్‌) ప్లాంటు ఏప్రిల్‌లో ట్రయల్‌ రన్‌కు సిద్ధం అయింది. జూన్‌లోగా వాణిజ్యపరంగా తయారీ కార్యకలాపాలు మొదలవుతాయని అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. పెన్సిలిన్‌–జి ధర విషయంలో చైనాతో పోటీపడాలన్నది తమ లక్ష్యం అని చెప్పారు.

పూర్తిగా దేశీయంగా పెన్సిలిన్‌ ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. ఏటా 15,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,400 కోట్లు వెచి్చస్తోంది. ఈ ప్లాంటు జూలై–సెపె్టంబర్‌ కాలంలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోనుంది. 80–90 శాతం పెన్సిలిన్‌ను కంపెనీ దేశీయంగా విక్రయించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద పెన్సిలిన్‌ ప్లాంటు ఆమోదం పొందింది.  

మరో రూ.1,000 కోట్లు..
అరబిందో ఫార్మా 8–10 ప్లాంట్ల ఏర్పాటుకు గడిచిన మూడు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు ఖర్చు చేసింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి చేయనుంది. చైనాలో ఏర్పాటు చేస్తున్న ఓరల్‌ సాలిడ్స్‌ తయారీ ప్లాంటులో వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సంస్థ సీఎఫ్‌వో శాంతారామ్‌ సుబ్రమణియన్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరబిందో టర్నోవర్‌ 3.4–3.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనాగా పేర్కొన్నారు. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో టర్నోవర్‌ 2.6 బిలియన్‌ డాలర్లు నమోదైంది. అరబిందో ప్రస్తుతం అంటువ్యాధుల విభాగంలో ఐదు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైంది. సంస్థ ఖాతాలో 25 తయారీ, ప్యాకింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న 10 ప్లాంట్లు ఒకట్రెండేళ్లలో కార్యరూపం దాల్చనున్నాయి.  

Advertisement
Advertisement