Kuppam: బాబుకు ఓటమి భయం! | Sakshi
Sakshi News home page

Kuppam: బాబుకు ఓటమి భయం!

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

కుప్పం తమ్ముళ్లపై నిరంతర నిఘా

ఎలక్షన్‌ మేనేజర్ల పేరిట సొంత మనుషులతో పర్యవేక్షణ

బెంగళూరు..హైదరాబాద్‌ నుంచి తరలింపు

అధినేత అపనమ్మకంపై టీడీపీ నేతల ఆవేదన

కుప్పం కోటపై చంద్రబాబుకు నమ్మకం సడలుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నేళ్లుగా మోసిన జనం ఇప్పుడు ముఖం చాటేస్తుండడంపై ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేతకు తెలుగు తమ్ముళ్ల సమర్థతపై అనుమానం మొదలైంది. అందుకే ఇతర ప్రాంతాల నుంచి సొంత మనుషులను కుప్పానికి తరలిస్తున్నారు. ఎలక్షన్‌ మేనేజర్ల పేరిట నేతల ఇళ్లలో తిష్ట వేయిస్తున్నారు. ప్రచారం నుంచి తాయిలాల పంపిణీ వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. బాబు వ్యవహారిశైలికపై స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమను విశ్వసించకుండా బయటి వారిని తెచ్చిపెట్టడంపై లోలోపల రగిలిపోతున్నారు.

శాంతిపురం : కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను నమ్మకుండా ప్రకాశం జిల్లా నుంచి తన సామాజికి వర్గానికి చెందిన కంచెర్ల శ్రీకాంత్‌కు చంద్రబాబు పెద్దపీట వేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఎన్నికల వేళ సైతం గ్రామ స్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నాయకులపై కూడా అపనమ్మకంతో సొంత మనుషులతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు.

వంద మంది మేనేజర్లు
కుప్పంలో ఎన్నికల పర్యవేక్షణకు బయటి ప్రాంతాల నుంచి తన సొంత మనుషులు వందమందిని చంద్రబాబు మోహరిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి 3 పోలింగ్‌ కేంద్రాలకు ఒకరి చొప్పున ఎలక్షన్‌ మేనేజర్ల పేరుతో ఇక్కడికి తీసుకువస్తున్నారు. బెంగళూరులోని టీడీపీ ఐటీ ఫోరమ్‌ ద్వారా బెంగళూరు, హైదరాబాదులో గుర్తించిన దాదాపు వంద మందిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం కుప్పానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి దాదాపుగా రోజూ బెంగళూరు–కుప్పం మద్య చక్కర్లు కొడుతున్నారు. ఆయా మేనేజర్లు తమ పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని టీడీపీ నాయకుల బంధువులుగా చెప్పుకుని వారి ఇళ్లలోనే బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారి బసకు ఇబ్బంది లేకుండా వసతులు ఉన్న నాయకుల ఇళ్లను ఇప్పటికే గుర్తించారు.

ఈ నెల 26 నుంచి మే 12వ తేదీ రాత్రి వరకూ బయటి వ్యక్తులు స్థానికంగా మకాం వేసి పార్టీ వ్యవహారాలను నడపనున్నారు. ప్రచారం సాగాల్సిన తీరును పర్యవేక్షిస్తూ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలను వారు సమన్వయం చేయనున్నారు. తమపై పరిశీలకుల కన్ను ఉంటే పార్టీ క్యాడర్‌ రాజీ పడకుండా పనిచేస్తారని ఈ ఏర్పాటుకు చంద్రబాబు ఆలోచన చేసినట్లు తెలిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిపే పంపకాలు కూడా వీరి ద్వారానే నిర్వహించి, పోలింగ్‌ ముందు రోజు రాత్రి వారంతా స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేలా వ్యూహరచన చేసుకున్నారు. కానీ ఇంత కాలం పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన తమను ఎన్నికల వేళ నమ్మకుండా అవమానిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు కుమిలిపోతున్నారు. అలవి కాని హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకపోగా కాలకేయుల్లాంటి నాయకులను ప్రోత్సహించిన తమ అధినేత, ఇప్పుడు తమను చేతకాని వాళ్లుగా నిలబెడుతున్నారని ఓ సీనియర్‌ కార్యకర్త వాపోయారు. చివరకు ఎన్నికలకు ముందే చంద్రబాబు ఓటమి భయం రుచిచూస్తున్నారని వెల్లడించారు.

తగ్గిన జనాదరణ
కుప్పం నుంచి తొలుత 1989 ఎన్నికల్లో చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు 52.65 శాతం ఓట్లు సాధించారు. తర్వాత ప్రత్యర్థి పార్టీల నాయకులను ప్రలోభ పెట్టి తన దారికి తెచుకోవడం ద్వారా నియోజకవర్గంపై క్రమంగా పట్టు బిగించారు. 1994లో గరిష్టంగా 75.49 శాతం ఓట్లు సాధించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత కుప్పంలో కూడా బాబు ప్రభ తగ్గడం మొదలైంది. 2014లో 62.59 శాతం ఓట్లు రాగా, 2019లో 55.18 శాతం ఓట్లు మాత్రమే సాధించారు.

అనంతరం వివక్ష లేని సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అశేష ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. కుప్పం ప్రజల మనసును గెలుచుకున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం ప్రజలు సైతం వైఎస్సార్‌సీపీకే జైకొట్టారు. దీంతో అసలు సంగతి చంద్రబాబుకు బోధపడింది. ఇక కల్లబొల్లి కబుర్లును కుప్పం వాసులు నమ్మరని అర్థమైంది. అందుకే తరచూ కుప్పంలో పర్యటనలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో సైతం తన సతీమణి నారా భువనేశ్వరి చేతులమీదుగా నామినేషన్‌ వేయించారు. ఆమె కూడా కుప్పంలోనే మూడు రోజులపాటు తిష్ట వేసి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement