వైఎస్సార్‌ సీపీలోకి కోరుకొల్లు జనసేన నేతలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి కోరుకొల్లు జనసేన నేతలు

Published Tue, Apr 23 2024 8:25 AM

డీఎన్నార్‌ సమక్షంలో పార్టీలో చేరిన జనసేన నాయకులు  
 - Sakshi

కలిదిండి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జనసేన నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) అన్నారు. కోరుకొల్లు గ్రామం నుంచి మాజీ సర్పంచ్‌ చన్నంశెట్టి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు చన్నంశెట్టి భాస్కర్‌, పూసల పుల్లయ్య, పూసల బాలులు ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు, ఉపసర్పంచ్‌ చన్నంశెట్టి నాగరాజు, పీఏసీఎస్‌ అధ్యక్షులు అంకెం నరసయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డీఎన్నార్‌ సమక్షంలో పార్టీలో చేరారు. జిల్లా ఎస్సీ నాయకులు దాసి యేసుబాబు, కాన్వెంట్‌ కృష్ణ, చన్నంశెట్టి వెంకటరాజు, వలవల చిన్న పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా

గోపాల్‌ యాదవ్‌ నియామకం

చింతలపూడి : వైఎస్సార్‌ సీపీ బీసీ నాయకులు గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌కు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కీలక పదవి లభించింది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గోపాల్‌ యాదవ్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం, గుంటుపల్లి పంచాయితీ కంఠమనేనివారిగూడెం గ్రామానికి చెందిన గోపాల్‌ యాదవ్‌ సింగపూర్‌, మలేషియాలలో పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పెట్టి ఎంతో మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆయన టీడీపీ నుంచి ఏలూరు పార్లమెంట్‌ సీటు ఆశించి భంగపడ్డారు. అనంతరం టీడీపీ నుండి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. టీడీపీలో బీసీలకు న్యాయం జరగదని, బీసీలకు వైఎస్సార్‌ సీపీ మాత్రమే న్యాయం చేయగలదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. పార్టీలో చేరిన నాటి నుంచి జిల్లాలోని బీసీలను సమాయత్త పరిచి వైఎస్సార్‌ సీపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. బీసీలకు వైఎస్సార్‌ సీపీలో సముచిత స్ధానం ఉందని, బీసీలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలంటే సీఎం వైఎస్‌ జగన్‌కు మద్దతు ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్‌ యాదవ్‌తో పాటు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో బీసీల ఓట్లు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకే వేసి గెలిపించాలని విస్త్రృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

రూ.272 పలికిన వర్జీనియా కేజీ ధర

జంగారెడ్డిగూడెం : వర్జీనియా పొగాకు ధర కేజీ ఒక్కింటికి రూ.272కు చేరుకుంది. ఈ ఏడాది మార్చి 6న వేలం ప్రారంభం కాగా, ప్రారంభ ధర కేజీకి రూ.240 లభించింది. అయితే ఇది క్రమంగా ఈ నెల 20వ తేదీ నాటికి రూ.266కు చేరుకుంది. కాగా, సోమవారం ఈ సీజన్‌లో అత్యధికంగా రూ.272 ధర పలికింది. అయితే ఇది ఇంకా పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఇంకా ప్రధాన కంపెనీలు వేలంలో చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో చిన్న చిన్న కంపెనీలు, సప్లయిర్స్‌ వేలంలో పాల్గొంటున్నారు. గత ఏడాది వేలంలో కేజీ ధర అత్యధికంగా రూ.288 లభించింది. ఈ ఏడాది ఈ గరిష్ట ధర దాటి లభించే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉంటే జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాల్లో సోమవారం కేజీ ధర రూ.272 లభించింది. కొయ్యలగూడెం, గోపాలపురం కేంద్రాల్లో రూ.271, దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.268 చొప్పున విక్రయాలు జరిగాయి.

తనిఖీల్లో రూ.2 లక్షల నగదు స్వాధీనం

కామవరపుకోట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్‌పోస్ట్‌ వద్ద సోమవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఒక వ్యక్తి నుంచి ఎటువంటి ఆధారాలు లేని రూ.1.59 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెక్‌పోస్ట్‌ ఎన్నికల అధికారి మహమ్మద్‌ మోహిద్దీన్‌ చెప్పారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన ఆటోలో వెళుతున్న వ్యక్తి నుంచి ఈ నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నగదున సీజ్‌ చేసి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏఎస్సై స్వామి ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేస్తామన్నారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది కె.రామకృష్ణ, సూర్యనాయక్‌, ఎ.సుధీర్‌, ఎం.నాగార్జున పాల్గొన్నారు.

గణపవరంలో..

గణపవరం: గణపవరంలో సోమవారం ఎఫ్‌ఎస్‌టీ తనిఖీ బృందం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఎన్నికల నిబంధనలకు మించి సొమ్ము కలిగి ఉన్న వ్యక్తి నుంచి రూ.1.06,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదును వెంట తీసుకువెళితే స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న నగదును చూపుతున్న ఎన్నికల అధికారులు
1/3

స్వాధీనం చేసుకున్న నగదును చూపుతున్న ఎన్నికల అధికారులు

గణపవరంలో వాహనాన్ని తనిఖీ చేస్తున్న ఎఫ్‌ఎస్‌టీ సిబ్బంది
2/3

గణపవరంలో వాహనాన్ని తనిఖీ చేస్తున్న ఎఫ్‌ఎస్‌టీ సిబ్బంది

3/3

Advertisement
Advertisement