ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా.. ఒకనాడు.. | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా.. ఒకనాడు..

Published Mon, Apr 15 2024 8:32 AM

Funday Inspirational Story Bhaktha Vijayam Bhavishyadbrahma Anjaneya - Sakshi

శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు ఆంజనేయుడు రాముని వద్ద సెలవు తీసుకుని, తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని, నిరంతరం తపస్సు కొనసాగించేవాడు. సముద్రాన్ని లంఘించి, లంకకు వెళ్లి అక్కడ సీతమ్మవారిని చూడటమే కాకుండా, రావణుడి ఆజ్ఞపై రాక్షసులు తోకకు నిప్పంటిస్తే లంకను తగులబెట్టి మరీ తిరిగి వచ్చిన వైనం సహా రామ రావణ యుద్ధంలో హనుమంతుని సాహసాలను జనాలు కథలు కథలుగా చెప్పుకొనేవారు.

      అయోధ్యవాసులకే కాదు, రామరాజ్యం అంతటా జనాలకు శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు కూడా ఆరాధ్యుడయ్యాడు.  గంధమాదన పర్వతం మీద నిర్మించుకున్న ఆంజనేయుడి ఆశ్రమం తాపసులకు ఆశ్రయంగా ఉండేది. ఆశ్రమంలో ప్రతిరోజూ వేదపఠనం సాగేది. తాత్త్విక చర్చలు సాగుతుండేవి.
      ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా, ఒకనాడు ఆంజనేయుడికి శ్రీరాముడిని దర్శించుకోవాలని కోరిక పుట్టింది. వెంటనే తన ఒంటె వాహనం మీద అయోధ్య నగరానికి బయలుదేరాడు. జానకీ సమేతుడైన శ్రీరాముడిని దర్శించుకుని, పరిపరి విధాలుగా స్తుతిస్తూ ప్రణమిల్లాడు. శ్రీరాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుని, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. 
      ‘ఇక్కడి నుంచి గంధమాదనానికి వెళ్లిపోయాక చాన్నాళ్లకు వచ్చావు. నీ రాక నాకే కాదు, సీతకు కూడా ఆనందదాయకమే! నువ్వు ఉంటున్న చోటు సౌకర్యంగానే ఉందా? ఆశ్రమవాసంలో అంతా కుశలమే కదా?’ అంటూ కుశలప్రశ్నలు వేశాడు.

      ‘రామా! నీ దయ నిరంతరం నా మీద ఉండగా నాకు చింత ఏమిటి? క్షేమంగానే ఉన్నాను స్వామీ!’ అని బదులిచ్చాడు ఆంజనేయుడు.
‘హనుమా! సీతాన్వేషణ మొదలుకొని రావణుడితో యుద్ధం వరకు నాకు ఎన్నో రకాలుగా తోడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నాకు మరొక పని చేసిపెట్టాలి’ అన్నాడు రాముడు.
      ‘ఆజ్ఞాపించు ప్రభూ! నీ ఆజ్ఞను నెరవేర్చడమే నా కర్తవ్యం’ చేతులు జోడించి అన్నాడు హనుమంతుడు.
‘నా అంగుళీయకాన్ని అడిగితే దానిని బ్రహ్మదేవుడికి ఇచ్చాను. లంకలో ఉన్నప్పుడు సీత ఆ ఉంగరాన్ని చూసుకుంటూ తన దుఃఖాన్ని తీర్చుకునేది. ఇప్పుడు ఆ ఉంగరం కావాలి. నువ్వు వెంటనే సత్యలోకానికి వెళ్లి, ఆ ఉంగరాన్ని తెచ్చి ఇవ్వు’ అన్నాడు రాముడు.
      శ్రీరాముడి మాట పూర్తికావడమే తడవుగా ఆంజనేయుడు రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వాయువేగ మనోవేగాలతో నేరుగా సత్యలోకానికి చేరుకున్నాడు.

      సత్యలోకంలో బ్రహ్మదేవుడి కొలువు నిండుగా ఉంది. అష్టదిక్పాలకులు, సనక సనందాది మహామునులు అక్కడ ఉన్నారు. ఆంజనేయుని చూడగానే వారందరూ లేచి నమస్కరించి, అతడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టారు. సభలోకి బ్రహ్మదేవుడు అడుగుపెట్టాడు. సభాసదులందరూ ఆయనకు నమస్కరించారు. ఆంజనేయుడు కూడా లేచి నిలుచుని బ్రహ్మదేవుడికి నమస్కరించాడు.
      ‘దేవా! మా శ్రీరామచంద్రుడు తన రత్నఖచిత కనక అంగుళీయకాన్ని నీకు ఇచ్చాడట. ఆ ముద్రికను తీసుకు రమ్మని నన్ను ఇక్కడకు పంపాడు. ఆ ముద్రికను వెంటనే ఇచ్చేస్తే, నేను దానిని తీసుకువెళ్లి నా ప్రభువుకు అందిస్తాను’ అన్నాడు.
      ‘ఇది సత్యలోకం. ఇక్కడ ఒకసారి ఇచ్చినది ఏదైనా తిరిగి ఇవ్వడానికి వీలుపడదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.
బ్రహ్మదేవుడి మాటలకు ఆంజనేయుడికి కోపం వచ్చింది. ‘బ్రహ్మదేవా! బొత్తిగా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. నాకు ఇక్కడ ఆలస్యం చేయడానికి వీలుపడదు. నువ్వు ఇవ్వకుంటే, ఈ సత్యలోకాన్నే పెళ్లగించుకుని పోయి నా ప్రభువు పాదాల ముందు ఉంచుతాను’ అంటూ తన దేహాన్ని విపరీతంగా పెంచి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సత్యలోకంలో ఉన్నవారంతా ఆంజనేయుని భీకర విశ్వరూపాన్ని చూసి హాహాకారాలు చేశారు.

      ఇంతలో సనక మహర్షి కల్పించుకుని, ‘బ్రహ్మదేవా! రామదూత ఆంజనేయుడి బలవిజృంభణను చూశావు కదా! పరిస్థితి అదుపు తప్పక ముందే ఆ ముద్రికను అతడికి ఇచ్చి పంపడమే మంచిది’ అని పలికాడు.
      అప్పుడు బ్రహ్మదేవుడు పక్కనే తామరలతో నిండి ఉన్న కొలనను చూపించి, ‘ఆ ముద్రిక అందులోనే ఉంది. తీసుకువెళ్లు’ అన్నాడు.
హనుమంతుడు కొలనులోకి చూస్తే, నీటి అడుగున అసంఖ్యాకంగా రామ ముద్రికలు కనిపించాయి. అన్నిటినీ తీసుకువెళ్లడానికి రామాజ్ఞ లేదు. ఏం చేయాలో తోచక ఆంజనేయుడు రిక్తహస్తాలతోనే అయోధ్యకు చేరుకుని, రాముడికి జరిగిన సంగతంతా చెప్పాడు. 
      ‘హనుమా! ఆ సరస్సున ఉన్నవి నా అంగుళీయకానికి బింబ ప్రతిబింబాలే! వాటి మహిమతోనే బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని సకలలోక సమ్మతంగా పరిపాలిస్తున్నాడు. వాటిలో ఒకటి తీసుకురా’ అని చెప్పాడు. హనుమంతుడు వెంటనే మళ్లీ సత్యలోకానికి వెళ్లి సరస్సులో ఉన్న ముద్రికల్లో ఒకదానికి తీసుకువచ్చి, రాముడికి అందజేశాడు. రాముడు సంతోషించి, ‘హనుమా! భవిష్యత్తులో నువ్వే సత్యలోకాధిపత్యం పొంది భవిష్యద్బ్రహ్మవై వర్ధిల్లగలవు’ అని ఆశీర్వదించాడు. — సాంఖ్యాయన

ఇవి చదవండి: బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు..

Advertisement
Advertisement