పెళ్ళి... ఇద్దరి మధ్య వ్యవహారం కాదు | Sakshi
Sakshi News home page

పెళ్ళి... ఇద్దరి మధ్య వ్యవహారం కాదు

Published Mon, Apr 8 2024 6:18 AM

Marriage is never an affair between two people - Sakshi

గృహస్థాశ్రమ విశిష్టత

ధర్మం, కామం, అర్థం సమంగా ఉంటే... మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోనక్కరలేదు. అదే వస్తుంది. అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదించానా ? ఖర్చుపెడితే.. ధర్మంకోసం ఖర్చు పెట్టానా? నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? దీనిని నేను నెరవేర్చుకోవచ్చా? ... ఈ పరిశీలన అలవాటయితే అర్థం. కామం ధర్మానికి ముడిపడిపోయినట్టే. సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూరాలని మన రుషులు ప్రవేశపెట్టిన మార్గం ఇది.. అదే గృహస్థాశ్రమం.

గృహస్థు అంటే కేవలం ఒక గృహంలో ఉన్నవాడని కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చేశాడు... అంటే ధర్మాన్ని స్వీకరించాడు.. అని. తరువాత నిత్యకర్మ చేయకుండా ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. ఏదో కర్మ చేయవలసిందే. దీనివల్ల చివరకు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మోక్షమే కలుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు.
రామాయణంలో భరతుడు ఒక మాటంటాడు.

నాలుగు ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం శ్రేష్ఠమైనది–అని. అంతకన్నా గొప్పది మరొకటి లేదు. కోటలో యుద్ధం చేయడం గృహస్థాశ్రమం. కోట బయట చేసేవి ఇతర ఆశ్రమాలు. అవి జన్మతః వైరాగ్యం కలిగిన మహాపురుషులకే సాధ్యం. ఎన్నో జన్మల అనుష్ఠాన బలం వారిది. వారు కారణజన్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు, చంద్రశేఖర భారతీ మహాస్వామివారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అరుణాచల భగవాన్‌ రమణులు... ఇటువంటివారు ఎక్కడో కోట్లలో ఒకరుంటారు.

కానీ అందరికి అందుబాటులో ఉండేది, అర్థకామములను ధర్మం తో ముడివేసుకోవడానికి యోగ్యమైనది – గృహస్థాశ్రమం. దీని ప్రవేశం... కేవలం ఒక పురుషుడికో, ఒక స్త్రీకో సంబంధించినది కాదు. అంటే పెళ్ళి ఎప్పుడూ పూర్తిగా వ్యక్తిగత విషయం కానే కాదు. ఇక్కడ సక్రమంగా ప్రవర్తించకపోతే... దాని చెడు ప్రభావం సమాజం మీద పడుతుంది. కచ్చితంగా మూడవ వ్యక్తిమీద అది ప్రభావం చూపి తీరుతుంది. అదే దంపతులిద్దరూ అన్యోన్యంగా బతకగలిగితే... మూడవ వ్యక్తికి ఆదర్శంగా నిలుస్తారేమో గానీ, సమాజాన్ని అది చెడుగా ప్రభావితం చేసే అవకాశమేలేదు.

వాళ్ళిద్దరూ పుట్టుకనుంచి కలిసి ఉన్నవారు కాదు, కలిసి చదువుకోలేదు, కలిసి బతకలేదు. అకస్మాత్తుగా ఇద్దరు కలుసుకుని జీవిత ప్రయాణానికి, ఒక ఆశ్రమ నియమానికి కట్టుబడటానికి సిద్ధమవుతున్నారు.  మనం ఒక ఉద్యోగంలో చేరితేనే... సవాలక్ష నియమాలకు అంగీకరించినప్పడే దానిలో కొనసాగగలం. అటువంటిది ఒక జీవితకాలం పూర్తిగా కలిసి ఇద్దరూ ప్రయాణించాలి.

పుట్టిన సంతానానికి మార్గదర్శకంగా నిలవాలి... అంటే దానికి ఎంతో పరిణతి ఉండాలి. జీవితం అంటే పూలపడవ కాదు కదా... వెలుతురు, చీకటి, కష్టాలు, సుఖాలు... అన్నింటినీ చక్కగా సమన్వయంతో, అవగాహనతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వంశాభివృద్ధి చేసుకుంటూ సంసారనావను నడపాల్సి ఉంటుంది. అటువంటి సంసారంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది సమాజాన్ని సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ ప్రభావితం చేస్తుంటుంది. అందుకే పెళ్ళి ఎప్పుడూ ఇద్దరి మధ్య వ్యవహారం కాదు.

Advertisement
Advertisement