మెరిసిన ఆణిముత్యాలు | Sakshi
Sakshi News home page

మెరిసిన ఆణిముత్యాలు

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

పాఠశాలలో సమకూర్చిన వసతులే కారణం..

మా స్వస్థలం గొట్టిపాడు. అమ్మా నాన్న అరుణకుమారి, మధుబాబు. కూలిపనులకు వెళుతుంటారు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు పాఠశాలలో ఎటువంటి వసతులు లేవు. నాడు–నేడు ద్వారా మా పాఠశాలకు ఎన్నో సదుపాయాలు వచ్చాయి. డ్యూయల్‌ డెస్క్‌లు, ఫ్యాన్లు, విద్యుత్‌ లైట్లు, టాయిలెట్లు వసతులు కల్పించారు. ముఖ్యంగా ఐఎఫ్‌పీల ద్వారా బోధన విధానంతో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయులు క్షుణ్ణంగా వివరించి చెప్పడం ద్వారా పరీక్షల్లో అధిక మార్కుల సాధనకు కృషి చేశాను. చెల్లెలు శ్రీజ ఇదే పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసింది. త్రిపుల్‌ ఐటీలో సీటు సాధించి, ఇంజినీరింగ్‌ చదవాలనేది నా ఆశయం.

– తమలపాకుల అభినవ్‌(584),

జెడ్పీ హైస్కూల్‌, గొట్టిపాడు, ప్రత్తిపాడు మండలం

గుంటూరు ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా అధిక మార్కులతో ప్రతిభావంతులుగా నిలిచారు. పాఠశాలల్లో అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని మట్టిలో మాణిక్యాలుగా మెరిశారు.

అమ్మానాన్నల కలను నెరవేరుస్తా..

నాన్న నాగేశ్వరరావు హోటల్లో పని చేస్తుంటారు. అక్క మధులిక ఇదే పాఠశాలలో టెన్త్‌ చదివి, ప్రస్తుతం త్రిపుల్‌ ఐటీలో చదువుతోంది. తన బాటలోనే త్రిపుల్‌ఐటీలో సీటు సాధించి, నన్ను విద్యావంతురాలిగా చూడాలనే ఆశ అమ్మానాన్నలకు ఉంది. వారి ఆశయాన్ని నెరవేరుస్తాను. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలతోనే ప్రస్తుతం ఈ స్థాయిలో మార్కులు సాధించగలిగాను.

– బాలనాగు మధుమిత (578), జెడ్పీ హైస్కూల్‌, యనమదల

త్రిపుల్‌ ఐటీలో సీటు సాధిస్తా..

మా నాన్న మాబు సుభానీ, నల్లపాడులోని వెల్డింగ్‌ షాపులో పని చేస్తారు. 8వ తరగతిలో ఉండగా ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాను. పాఠశాలలో ట్యాబ్‌లతో పాటు ఐఎఫ్‌పీల ద్వారా ఉపాధ్యాయులు చేస్తున్న బోధన ఎంతో బాగుంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అధిక మార్కులను సాధించాను. త్రిపుల్‌ ఐటీలో చదవాలనే లక్ష్యంతో ఉన్నాను.

– షేక్‌ రిహానా (583), జెడ్పీ హైస్కూల్‌, యనమదల

‘పది’లో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మార్కుల సాధన ప్రభుత్వం కల్పించిన వసతులు,అత్యుత్తమ బోధనే కారణమంటున్న విద్యార్థులు

1/2

2/2

Advertisement
Advertisement