వరుస సభలు.. ప్రచార హోరు! | Sakshi
Sakshi News home page

వరుస సభలు.. ప్రచార హోరు!

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ రాజకీయ పార్టీల పోరుగల్లుగా మారింది. నామినేషన్ల ఘట్టం 25న ముగియనుండగా.. అప్పుడే పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతల ప్రచార సభలు హోరెత్తుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు చెందిన అగ్రనేతలు.. అభ్యర్థుల గెలు పు కోసం సర్వశక్తులొడ్డేందుకు రోడ్‌షోలు, బహిరంగ సభల షెడ్యూల్‌లను ప్రకటించారు. ఇప్పటికే విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా ఓవైపు అభ్యర్థులు నిత్యం నియోజకవర్గాల్లో అలుపెరగకుండా తిరుగుతుండగా.. మరోవైపు జోష్‌ పెంచేందుకు అగ్రనేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

నామినేషన్ల నుంచే మొదలైన ప్రచారం...

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఆ మరుసటి రోజు నుంచే అగ్రనేతల ప్రచార సభలు మొదలయ్యాయి. 19న మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌ నామినేషన్‌ సందర్భంగా హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఉమ్మడి వరంగల్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అగ్రనేతల షెడ్యూల్‌ కూడా మానుకోటలో ఖరారయ్యింది. మే 1న మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మానుకోటలో రోడ్‌షో నిర్వహించనున్నారని ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ తరఫున కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొననున్నట్లు వెల్లడించారు. అలాగే వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ ఎం.సుధీర్‌కుమార్‌ తరఫున ప్రచారం నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నేడు (మంగళవారం) వరంగల్‌లో పర్యటించనున్నారు. ఆ మరుసటి రోజు, ఈ నెల 24న సీఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య తరఫున ప్రచారం చేసేందుకు వరంగల్‌కు రానున్నారు. 28న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, అమిత్‌షాలు బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్‌ గెలుపు కోసం రోడ్‌షో, సభలు నిర్వహించనున్నట్లు పార్టీవర్గాలు ప్రకటించాయి. కాగా 25న నామినేషన్ల పర్వం ముగియనుండగా 29న ఉపసంహరణ అనంతరం గుర్తుల కేటాయింపు, బ్యాలెట్‌ పత్రాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత సుమారు 14 రోజులు ప్రచారం నిర్వహించే అవకాశం ఉండగా.. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు, బీజేపీ తరఫున పీఎం నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, అశ్విన్‌ వైష్ణవ్‌, సీఎం ఆదిత్యనాథ్‌ యోగి తదితరులు, బీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు, తదితరులు ప్రచారాన్ని హోరెత్తించనున్నారని ఆయా పార్టీలు ప్రకటించాయి.

నేడు వరంగల్‌కు కేటీఆర్‌.. షెడ్యూల్‌ ఇదీ..

బీఆర్‌ఎస్‌ వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్‌ తరఫున ప్రచారం నిర్వహించేందుకు మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) మంగళవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. అలంపూర్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా సాయంత్రం 4.30 గంటలకు సుబేదారి పరిధిలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కళాశాల మైదానానికి చేరుకోనున్న కేటీఆర్‌.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో హంటర్‌రోడ్డులోని డి–కన్వెన్షన్‌కు వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఉర్సుగుట్టలోని నాని గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో పాల్గొని.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్తారు.

అగ్రనేతల ఆగమనం.. ఊపందుకున్న ప్రచారం

ప్రధాన పార్టీల అభ్యర్థులకు

మద్దతుగా నేతలు..

నేడు వరంగల్‌లో కేటీఆర్‌ సభ..

రేపు సీఎం రేవంత్‌ రెడ్డి రాక

మరోవైపు బీజేపీ కేంద్రమంత్రులు..

పోటాపోటీగా అగ్రనేతల సభలు

నామినేషన్ల సందడి

దాఖలు చేసిన ప్రధాన పార్టీల

అభ్యర్థులు

వరంగల్‌ పార్లమెంట్‌ స్థానానికి

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌

అభ్యర్థుల నామినేషన్లు

మహబూబాబాద్‌లో బీజేపీ ఎంపీ

అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ దాఖలు..

తొలిసెట్‌ సమర్పించిన సుధీర్‌

కుమార్‌, కడియం కావ్య

– వివరాలు 8లోu

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement