రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా.. | Alert IMD Weather Forecast, Srinagar Experienced The Coldest Weather Of This Season - Sakshi
Sakshi News home page

IMD Weather Forecast: రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా..

Published Sat, Dec 9 2023 10:59 AM

Alert IMD Weather Forecast Srinagar Recorded Winter Season - Sakshi

దేశంలో వాతావరణ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు నెలకొనివుంది. దక్షిణ భారతదేశంలో వర్షాకాలం కొనసాగుతోంది. హిమాచల్‌లోని కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఎముకలు కొరికే చలి వ్యాపించింది. 

శుక్రవారం రాత్రి శ్రీనగర్‌లో ఈ సీజన్‌లో అత్యంత చలి వాతావరణం ఏర్పడింది. నగరంలో ఉష్ణోగ్రత -4.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం రానున్న రెండు రోజుల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గే అవకాశం ఉంది. 
 

తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం దేశంలోని జార్ఖండ్, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ , అండమాన్, నికోబార్ దీవులలో వర్షాలు కురుస్తాయి. 

పంజాబ్, హర్యానా, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 12న పశ్చిమ బెంగాల్, సిక్కింలో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 10న దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజస్థాన్‌లోనూ చలి ప్రభావం పెరుగుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది. 
 

ఇక ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ విషయానికి వస్తే శనివారం ఉదయం చల్లగాలులు వీచాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో డిసెంబర్ 15 తర్వాత చలి గణనీయంగా పెరగనుంది. కనిష్ట ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరుకోవచ్చు.
ఇది కూడా చదవండి: కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి!

Advertisement
 
Advertisement
 
Advertisement