మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కేసులో కీలకం కానున్న టీవీ, రిఫ్రిజిరేటర్‌ | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కేసులో కీలకం కానున్న టీవీ, రిఫ్రిజిరేటర్‌

Published Sun, Apr 7 2024 3:24 PM

Ed Used Fridge, Smart Tv Invoice As Evidence Against Hemant Soren - Sakshi

రాంచీ : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ మనీ ల్యాండరింగ్‌ కేసులో టీవీ, రిఫ్రిజిరేటర్‌లు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. 

రూ.31 కోట్ల కంటే ఎక్కువ విలువైన 8.86 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన వాదనను సమర్ధించేందుకు కీలకమైన సాక్ష్యాలలో రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీ ఇన్‌వాయిస్‌లను స్వీకరించింది. ఈడీ రాంచీకి చెందిన ఇద్దరు డీలర్ల నుండి ఈ రశీదులను పొందింది. సోరెన్‌తో పాటు మరో నలుగురిపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో వాటిని జత చేసింది.

సంతోష్‌ ముండా పేరుమీద
ఈడీ వర్గాల సమాచారం మేరకు..హేమంత్‌ సోరెన్‌ ఈడీ సేకరించిన టీవీ, రిఫ్రిజిరేటర్‌లను తన కుటుంబసభ్యుడు సంతోష్‌ ముండా పేరుమీద తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సంతోష్‌ ముండానే సోరెన్‌ కొనుగోలు చేసిన 8.86 ఎకరాల ల్యాండ్‌ వ్యవహరాలను గత 14 నుంచి 16 ఏళ్ల నుంచి చూసుకుంటున్నట్లు ఈడీ గుర్తించింది.  

సోరెన్‌కు ఈడీ సమన్లు.. రంగంలోకి పహాన్‌
మనీ ల్యాండరింగ్‌ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆ 8.86 ఎకరాల ల్యాండ్‌కు తనకు సంబంధం లేదని ఈడీ అధికారులతో వాదించారు. అందుకు కౌంటర్‌గా ఈడీ అధికారులు సంతోష్‌ ముండా నుంచి స్టేట్మెంట్‌ తీసుకున్నారు. అంతేకాదు, మనీ ల్యాండరింగ్‌ కేసులో ఈడీ తొలిసారి గతేడాది ఆగస్టులో హేమంత్‌ సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు జారీ చేసిన వెంటనే రాజ్‌కుమార్‌ పహాన్‌ అనే వ్యక్తి ఆ 8.86 ఎకరాల భూమి తనతోపాటు మరికొందరి ఆధీనంలో ఉందని, ఇతర యజమానుల పేరిట ఉన్న మ్యుటేషన్‌ రద్దు చేయాలని రాంచీ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు. తద్వారా తన ఆస్తిని కాపాడుకోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఖండించిన ఈడీ
రాజ్‌కుమార్ పహాన్ లేఖను ఈడీ ఖండించింది. సోరెన్‌ తన ఆస్తుల్ని సంరక్షించుకునేందుకు బినామీల పేరిట రాశారని ఆరోపిస్తోంది. సోరెన్ ఆదేశానుసారం సంతోష్‌ ముండాకు ఆస్తి సంరక్షకుని బాధ్యతను అప్పగించారని ఈడీ చెబుతోంది. కేసులో మరొక నిందితుడు హిలారియాస్ కచాప్ అక్కడ విద్యుత్ మీటర్‌ను అమర్చారని వెల్లడించింది. ఇక సోరెన్‌ సంతోష్‌ ముండా పేరుమీద ఫిబ్రవరి 2017లో రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయగా, నవంబర్ 2022లో అతని కుమార్తె పేరు మీద స్మార్ట్ టీవీని రాంచీలో భూమి ఉన్న చిరునామాలో కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 

ఆధారాల్ని తారుమారు చేసే ప్రయత్నం
సంతోష్‌ ముండాతో పాటు, రాజ్‌కుమార్ పహాన్‌లు హేమంత్ సోరెన్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా ఆస్తి పహాన్ అతని కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నట్లు చూపించి సోరెన్‌ను రక్షించేలా సాక్ష్యాలు తారుమారు చేయడం, అతని ఆస్తులు బయట పడకుండా దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందంటూ ఈడీ చెబుతోంది.  

జ్యుడీషియల్‌ కస్టడీలో హేమంత్‌ సోరెన్‌
కాగా, సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే హేమంత్‌ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం సోరెన్‌ రాంచీలోని హోత్వార్‌లోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Advertisement
Advertisement