హస్తానికి అందని ద్రాక్షేనా! | Sakshi
Sakshi News home page

హస్తానికి అందని ద్రాక్షేనా!

Published Fri, Apr 26 2024 4:23 AM

Lok sabha elections 2024: Congress struggles to break saffron stranglehold on 6 seats

మధ్యప్రదేశ్‌లో ఆరు సీట్లకు నేడే పోలింగ్‌

రెండు దశాబ్దాలుగా కాషాయ జెండానే 

యువ అభ్యర్థులతో కాంగ్రెస్‌ ప్రయోగం

హిందీ బెల్టులో కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. 2009లో 12 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ 2014లో 2 స్థానాలకు పడిపోయింది. 2019కి వచ్చేసరికి ఒకే సీటుకు పరిమితమైంది. మిగతా 28 చోట్లా కాషాయ జెండాయే ఎగిరింది! గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ దుమ్ము రేపింది. శుక్రవారం రెండో విడతలో రాష్ట్రంలో ఆరు కీలక స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఇవన్నీ బీజేపీ కంచుకోటలే. ఇక్కడ బీజేపీని ఎదుర్కోలేక రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ అష్టకష్టాలు పడుతోంది. ఆ స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, వారి బలాబలాలపై ఫోకస్‌...
 

ఖజురహో...
కాంగ్రెస్‌ సెల్ఫ్‌ గోల్‌
బలమైన బీజేపీని దీటుగా ఢీకొట్టాల్సిన వేళ హస్తం పార్టీ ఆదిలోనే ‘చేయి’ కాల్చుకుంది. పోలింగ్‌కు ముందే ఈ స్థానాన్ని చేజేతులా ‘కమలం’ పువ్వులో పెట్టి మరీ అందిస్తోంది. పొత్తులో భాగంగా ఖజురహోను సమాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్‌ త్యాగం చేసింది. ఇక్కడ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, సిట్టింగ్‌ ఎంపీ వీడీ శర్మపై అనామకుడైన మనోజ్‌ యాదవ్‌ను ఎస్పీ తొలుత అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత మాజీ ఎమ్మెల్యే మీరా దీపక్‌ యాదవ్‌కు సీటిచి్చంది. 
 

కానీ నామినేషన్‌ పత్రాల్లో సంతకం మర్చిపోవడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఈసీ తిరస్కరించింది. దాంతో కంగుతిన్న కాంగ్రెస్, ఎస్పీ పెద్దగా సోదిలో లేని ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి ఆర్‌.బి.ప్రజాపతికి మద్దతివ్వాల్సి వస్తోంది. దీంతో ఇక్కడ విజయం బీజేపీకి నల్లేరుపై నడకే కానుంది. 2019లో 4.3 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలిచిన శర్మ ఈసారి దాన్ని మరింత పెంచుకుంటారంటున్నారు. ‘‘వీడీ శర్మ చూడ్డానికి సన్నగా కనిపించినా ఆయన నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొత్త రికార్డులు కొట్టింది’’ అంటూ తాజాగా దామోహ్‌ ఎన్నికల సభలో ప్రధాని మోదీ ఆకాశానికెత్తారు.
 

హోషంగాబాద్‌.. కుబేరుడితో సరస్వతీ పుత్రుడు ఢీ!
ఇక్కడ బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. దాంతో ఈసారి ఐదు మాస్టర్‌ డిగ్రీల వీరుడు, రైతు ఉద్యమకారుడు దర్శన్‌ సింగ్‌
చౌదరిని బీజేపీ బరిలో దింపింది. నెరిసిన గడ్డం, తెల్లటి తలపాగాతో సౌమ్యంగా కనిపించే ఈయన సరస్వతీ పుత్రుడు. ఫిలాసఫీ, ఇంగ్లి‹Ù, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సోషియాలజీల్లో ఎంఏ చేశారు. నర్మదా లోయలో పలు రైతు ఉద్యమాలకు సారథ్యం వహించారు. బీజేపీ రాష్ట్ర కిసాన్‌ మోర్చా అధ్యక్షుడయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు కొత్తే అయినా బాగా గుర్తింపున్న నాయకుడు. కాంగ్రెస్‌ అభ్యర్థి సంజయ్‌ శర్మ రాష్ట్రంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం ఆయన ఆస్తి రూ.233 కోట్లు. హోషంగాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని తెండుఖేడా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు గెలిచారు. అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడారు.
 

తికంగఢ్‌...   యమా టఫ్‌
2009లో ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంగా మారినప్పటి నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. ఇక్కడ బీజేపీ హ్యాట్రిక్‌ వీరుడు, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ ఖటిక్‌ మళ్లీ బరిలో ఉన్నారు. గతంలో సాగర్‌ లోక్‌సభ స్థానంలోనూ నాలుగుసార్లు గెలిచిన రికార్డు ఆయనది. 2009లో తికంగఢ్‌ స్థానం ఏర్పడ్డప్పటి నుంచీ ఆయనే గెలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ ఇక్కడ ప్రతిసారీ అభ్యర్థులను మార్చినా ఫలితం మాత్రం శూన్యం. వీరేంద్ర అంతకంతకూ మెజారిటీ పెంచుకుంటూ పోతున్నారు. ఈసారి పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్‌ అహిర్వార్‌ రూపంలో యువ నేతను కాంగ్రెస్‌ బరిలోకి దించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జతారా స్థానం నుంచి టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన తిరుగుబావుటా ఎగరేశారు. దాంతో ఇలా ఎంపీ టికెటిచి్చంది. బాహుబలి వంటి కేంద్ర మంత్రి వీరేంద్రపై పోటీకి నిలపడం పంకజ్‌ను బలిపశువును చేయడమేనని కాంగ్రెస్‌ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు!
 

దామోహ్‌..  లోధీ వర్సెస్‌ లోధీ
బడా నేతలెవరూ రేసులో లేకున్నా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గమిది. బీజేపీ అభ్యర్థి రాహుల్‌ సింగ్‌ లోధీ, కాంగ్రెస్‌ అభ్యర్థి తర్బార్‌సింగ్‌ లోధీ ఇద్దరూ ఒకప్పుడు బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి వీరవిధేయులే! పైగా బంధువులు కూడా. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇద్దరూ బీజేపీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరారు. దామోహ్‌ నుంచి రాహుల్, బాందా నుంచి తర్బార్‌ ఎమ్మెల్యేలుగా గెలిచారు. 15 నెలలకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోవడంతో రాహుల్‌ మళ్లీ బీజేపీ పంచన చేరారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య పోటీ హోరాహోరీగానే ఉండొచ్చనేది పరిశీలకుల అభిప్రాయం. ఇక్కడ రెండుసార్లు నెగ్గిన సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ గత డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యారు.   

సత్నా..  హోరాహోరీ
నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ బలశాలి గణేశ్‌ సింగ్‌పై యువ ఎమ్మెల్యే సిద్దార్థ్‌ కుశ్వాహను కాంగ్రెస్‌ బరిలో నిలిపింది. ఐదు నెలల క్రితమే సత్నా అసెంబ్లీ స్థానంలో గణేశ్‌ సింగ్‌ను కుశ్వాహ మట్టికరిపించడం విశేషం! దాంతో ఈసారి వారిద్దరి పోటీ ఉత్కంఠ రేపుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి షాకిచి్చన చరిత్ర కుశ్వాహది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత శంకర్‌లాల్‌ తివారీని ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా పేరొందారు.

రేవా..  కమలానికే మొగ్గు
బ్రాహ్మణ ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో ఇరు పారీ్టలూ ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే నిలబెడుతూ వస్తున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ జనార్దన్‌ మిశ్రాకే బీజేపీ మళ్లీ టికెటిచ్చింది. ఇక్కడ 2014లో 1.68 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గిన మిశ్రా 2019లో దాన్ని 3.12 లక్షలకు పెంచుకున్నారు. ప్రతిసారీ అభ్యర్థులను మారుస్తున్న కాంగ్రెస్‌ ఈసారి మహిళకు టిక్కెట్‌ ఇచి్చంది. రేవా మేయర్‌ అభయ్‌ మిశ్రా భార్య నీలంను రంగంలోకి దించింది. అయితే ఈ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు బీజేపీ గుప్పిట్లోనే ఉన్నాయి. ఈసారీ ఆ పారీ్టకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.  
 

– సాక్షి, నేషనల్‌ డెస్క్

Advertisement

తప్పక చదవండి

Advertisement