వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి నంబూరు నామినేషన్‌ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి నంబూరు నామినేషన్‌

Published Tue, Apr 23 2024 8:25 AM

జనసంద్రమైన కాలచక్ర రహదారి - Sakshi

పెదకూరపాడు: వైఎస్సార్‌ సీపీ పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరరావు నామినేషన్‌ జన జాతరను తలపించింది. మండుటెండనూ లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, చిన్నారులు, యువకులు తరలివచ్చారు. కాలచక్ర రోడ్డు జన సంద్రమైంది. తొలుత తన ఇంటి నుంచి ఉదయం 8 గంటలకు శంకరరావు బయలుదేరారు. శంకరరావుకు భార్య వసతంకుమారి, కుటుంబ సభ్యులు గుమ్మడి కాయలతో హారతి పట్టి విజయతిలకం దిద్దారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి తుళ్లూరు మండలం పెద్ద పరిమిలోని తమ ఇష్టదైవమైన సాయిబాబా, ఆంజనేయస్వామిలకు పూజలు నిర్వహించారు. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం అభిమానులతో కలసి అమరావతి మండలం 14వ మైలు వద్దకు చేరుకుని అక్కడ నుంచి ర్యాలీగా అమరావతి, 75త్యాళ్లూరు మీదగా పెదకూరపాడులోని ఆర్వో కార్యాలయానికి చేరుకోని ఆర్వో కందుల శ్రీరాములుకు నామినేషన్‌ పత్రాలు అందించారు. అంతకు ముందు శంకరరావు సతీమణి వసంతకుమారి, కుమారుడు కళ్యాణ్‌ చక్రవర్తిలు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

కాలచక్ర రోడ్డు జనమయం

అమరావతి–పెదకూరపాడు కాల చక్ర రోడ్డు జనంతో నిండిపోయింది. అమరావతి, లింగాపురం, బలుసుపాడు, పరస, 75త్యాళ్లూరు, అబ్బరాజుపాలెం, పెదకూరపాడు గ్రామాల గుండా ర్యాలీ సాగింది. 75త్యాళ్లూరు వద్ద అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. అమరావతిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి శంకరరావు పూలమాల వేసి నివాళులర్పించారు.

అభివృద్ధి చేసి చూపించా..

గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసి చూపించానని.. అందుకే ధైర్యంగా ఓటు అడుగుతున్నానని వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరరావు అన్నారు. టీడీపీ ఎన్ని కూటములు కట్టినా పెదకూరపాడులో పార్టీ విజయం ఖాయమని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వారికి మద్దతు ఉంటుందనేందు కు నామినేషన్‌కు హాజరైన ప్రజలే సాక్ష్య మని అన్నారు. కృతజ్ఞతలు తెలిపారు.

అత్యధిక మోజార్టీతో గెలుపు తథ్యం

పెదకూరపాడులో ముందే శంకరరావు గెలుపు కనిపిస్తోందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం అన్నారు. క్రోసూరు, సత్తెనపల్లి మార్కెట్‌ యార్డు చైర్మన్లు ఈదా సాంబిరెడ్డి, పెండెం బాబురావు పాల్గొన్నారు.

ఇది విజయోత్సవ ర్యాలీ

శంకరరావు నామినేషన్‌కు వచ్చిన జనవాహిని చూస్తే ఇది నామినేషన్‌ పర్వం కాదు, శంకరరావు విజయోత్సవంగా కనిపిస్తోందని వైఎస్సార్‌ సీపీ నాయకులు వంగవీటి నరేంద్ర అన్నారు. ఇంత జనాన్ని చూస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదన్నారు. అభివృద్ధికి మారుపేరుగా జగనన్న, శంకరన్న నిలిచారన్నారు.పెదకూరపాడులో ఫ్యాన్‌ ప్రభజనం ఇప్పుడే కనిపిస్తోందన్నారు.

పెదకూరపాడులో నామినేషన్‌ పత్రాలను 
అందిస్తున్న నంబూరు శంకరరావు
1/1

పెదకూరపాడులో నామినేషన్‌ పత్రాలను అందిస్తున్న నంబూరు శంకరరావు

Advertisement
Advertisement