రామున్ని అవమానించిన కాంగ్రెస్‌: ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

రామున్ని అవమానించిన కాంగ్రెస్‌: ప్రధాని మోదీ

Published Wed, Apr 10 2024 2:55 AM

Congress angry over Ram Temple construction: Narendra Modi - Sakshi

రామాలయ నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు యత్నించింది 

అభివృద్ధిని అడ్డుకోవడానికి నన్ను బెదిరిస్తున్నారు 

ప్రతిపక్ష నేతలపై మోదీ ధ్వజం 

యూపీ, మధ్యప్రదేశ్, తమిళనాడుల్లో ప్రచారం 

పిలిభిత్‌/బోపాల్‌: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణాన్ని నిలిపివేయడానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎన్నో ప్రయత్నాలు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అయినా దేశ ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి అద్భుతమైన ఆలయం నిర్మించుకున్నారని చెప్పారు. ఆలయ నిర్వాహకులు పెద్ద మనసుతో క్షమించి, ప్రాణప్రతిష్టకు హాజరుకావాలని కోరుతూ ఆహా్వనం పంపిస్తే కాంగ్రెస్‌ దాన్ని తిరస్కరించిందని, తద్వారా శ్రీరాముడిని అవమానించిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి హాజరైన నేతలను కాంగ్రెస్‌ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారని తప్పుపట్టారు.

మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, తమిళనాడు రాజధాని చెన్నైలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. బజ్జగింపు రాజకీయాల్లో కాంగ్రెస్‌ పూర్తిగా కూరుకుపోయిందని, అందులో నుంచి ఎప్పటికీ బయటకు రాలేదని విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాల రుణం తీర్చుకోవడానికే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాముడిని పూజించిన వారిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించారని, ఇదెక్కడి పైత్యం? అని ధ్వజమెత్తారు.

ఇలాంటి పాపం చేసినవారిని ప్రజలు క్షమించబోరని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఆరాధించే ‘శక్తి’ని కాంగ్రెస్‌ పార్టీ కించపర్చిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తి ఎదుట మనం తల వంచి నమస్కరిస్తుంటామని, అలాంటి శక్తిని కూలదోయాలని కాంగ్రెస్‌ నాయకులు పిలుపునిస్తున్నారని ఆక్షేపించారు. ఆ నాయకులను శక్తి ఎప్పటికీ క్షమించదని అన్నారు. మన దేశానికి చెందిన గొప్ప వ్యక్తులను ఇండియా కూటమి నేతలు అవమానించారని విమర్శించారు. గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ ఐక్యతా విగ్రహాన్ని విపక్ష నేతలు దర్శించలేదని చెప్పారు.

వారికి విదేశాల్లో గడపానికి సమయం ఉంటుంది గానీ ఐక్యతా ప్రతిమను దర్శించడానికి సమయం లేదా? అని నిలదీశారు. ప్రపంచం దేశాలు నేడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాయని, అయినప్పటికీ అనుకున్న లక్ష్యం సాధించడం సాధ్యమేనని ప్రపంచ దేశాలకు భారత్‌ చాటి చెబుతోందని ప్రధానమంత్రి వెల్లడించారు. దేశ ప్రజల ఓటుతోనే ఇది సాధ్యమవుతోందని పేర్కొన్నారు.

మహాకాలుడి భక్తుడిని.. ఎవరికీ భయపడను 
దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నాయకులు తనను దూషిస్తున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారని నరేంద్ర మోదీ ఆరోపించారు. అవినీతిపరులను రక్షించడమే ఇండియా కూటమి లక్ష్యంగా మారిపోయిందన్నారు. దేశ భద్రతకు గ్యారంటీ ఇచ్చినప్పుడు తిట్టారని, ఆర్టీకల్‌ 370ని రద్దు చేసినప్పుడు దూషించారని, అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు అనరాని మాటలు అన్నారని విపక్ష నేతలపై మండిపడ్డారు. తాను మహాకాళుడి భక్తుడినని, ఎవరికీ భయపడనని తే ల్చిచెప్పారు.

‘న్యూ ఇండియా’ను నిర్మించడానికి రాబోయే ఎన్నికలు మనకు ఒక మిషన్‌ అని ప్రజలకు సూచించారు. ప్రధానమంత్రిగా తన మూడో టర్మ్‌లో అతిపెద్ద, చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నానని, ఇందుకు ప్రజల ఆశీర్వచనాలు కావాలని కోరారు. చెన్నైలో మోదీ రోడ్‌షోకు జనం భారీగా తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ప్రచారానికి సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ, ఆయన తల్లి మేనకా గాంధీ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వరుణ్‌ గాంధీ స్థానంలో జితిన్‌ ప్రసాదను బీజేపీ రంగంలోకి దింపడం తెలిసిందే.

Advertisement
Advertisement