‘టీఎంసీని ఉగ్రసంస్థగా ప్రకటించి.. సీఎం మమతను అరెస్ట్‌ చేయాలి’ | Sakshi
Sakshi News home page

‘టీఎంసీని ఉగ్రసంస్థగా ప్రకటించి.. సీఎం మమతను అరెస్ట్‌ చేయాలి’

Published Sat, Apr 27 2024 12:10 PM

Suvendu Adhikari demands 'Arrest Mamata, declare TMC a terror outfit'

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని, సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్‌ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. సందేశ్‌కాళీలో టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్‌ సన్నిహితుడి వద్ద  ఆయుధాలు, మందుగుడు సామాగ్రిని సీబీఐ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సువేందు టీఎంసీ, సీఎం మమతపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడ లభ్యమైన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవని తెలిపారు. 

 

‘సందేశ్‌కాళీలో లభించిన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవి.  దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదకరమైన ఆర్‌డీఎక్స్‌ వంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు అన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉపయోగించేవి. అందుకే టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నా. అప్పడే పశ్చిమ బెంగాల్‌ ప్రశాంతంగా ఉంటుంది. సందేశ్‌కాళీలో ఆయుధాలకు సంబంధించి ఘటనకు సీఎం మమత బాధ్యత  వహించాలి. సీఎం మమతను వెంటనే అరెస్ట్‌ చేయాలి’ అని సువేందు డిమాండ్‌ చేశారు.

 

శుక్రవారం సందేశ్‌కాళీలో సీబీఐ జరిపిన సోదాల్లో టీఎంసీ సస్పెండెడ్‌  నేత షాజహాన్‌ షేక్‌ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, ఒక పోలీసు తుపాకీ లభించింది. వాటిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ దాడులపై టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ వేళ (శుక్రవారం) సీబీఐ పలు చోట్ల సోదాలు చేపట్టింది’ అని ఆరోపణలు చేసింది.

జనవరిలో ఈడీ అధికారులుపై టీఎంసీ కార్యకర్తలు చేసిన దాడికి సంబంధించి శుక్రవారం సీబీఐ పలు చోట్లు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక.. షాజహాన్‌ షేక్‌ను బెంగాల్‌ పోలీసులు ఫ్రిబవరి 29న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement