లోక్‌సభలో నారీ పవర్‌.. | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో నారీ పవర్‌..

Published Wed, Apr 24 2024 4:54 AM

Today is Womens Political Empowerment Day - Sakshi

నేడు మహిళల రాజకీయ సాధికారత దినోత్సవం 

(మేకల కళ్యాణ్‌ చక్రవర్తి) :  రాజకీయాల్లో రాణించడం.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయతీరాలకు చేరడం అంత సులువేమీ కాదు. భారత్‌లాంటి సాంప్రదాయ దేశాల్లో మహిళాలోకం రాజకీయంగా అభివృద్ధి చెందడం కొద్దిగా కష్టమే. అయినా ఉక్కు మహిళలుగా పేరొందిన మన దేశ నారీమణులు ప్రత్యక్ష ఎన్నికల్లో బ్రహా్మండంగా రాణిస్తున్నారు. సమకాలీన పరిస్థితులు, పురుషాధిపత్య రాజకీయాలను అధిగమిస్తూ అనేకస్థాయిల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గ్రామ సర్పంచ్‌ మొదలు దేశ ప్రధాని, రాష్ట్రపతి లాంటి మహోన్నత స్థానాల్లో కూడా కూర్చున్న ఘనత మన భారతీయ మహిళలది. మండల పరిషత్‌ అధ్యక్షురాలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా, ఆర్థికం లాంటి కీలకశాఖలు నిర్వహించిన ధీర వనితలుగా మన దేశ మహిళలకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి భారతీయ మహిళల ప్రాతినిధ్యం పార్లమెంట్‌ దిగువసభ అయిన లోక్‌సభలో నానాటికీ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 4–5 శాతం ఉన్న మహిళల ప్రాతినిధ్యం ఇప్పుడు లోక్‌సభలో ఏకంగా 14 శాతం దాటింది. క్షేత్రస్థాయిలోనే కాదు జాతీయస్థాయిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నారీమణులు పురుషులను ఢీ కొడుతూ, రాజకీయ దిగ్గజాలను ప్రజాక్షేత్రంలో మట్టికరిపిస్తూ ప్రజల మన్ననలు పొంది దేశంలోనే అత్యున్నత చట్టసభలో అడుగుపెడుతున్నారు.  

మాటలే కాదు... చేతల మాస్కరీన్‌ 
యానీమాస్కరీన్‌...వాక్‌ స్వాతంత్య్రం, విద్యావికాసం, తిరుగుబాటు, మహిళా సాధికారతకు ప్రతీక ఈ పేరు. ప్రస్తుత కేరళ రాష్ట్రం, అప్పటి ట్రావెన్‌కోర్‌ సంస్థానంలో జన్మించిన ఈమె రాజకీయాల్లో మహిళాప్రాతినిధ్యానికి 20వ శతాబ్దం తొలినాళ్లలోనే బీజం వేసిన యోధురాలు. 1902 జూన్‌ 6న లాటిన్‌ కాజిnథలిక్‌ కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వఉద్యోగి అయిన తండ్రి గాబ్రియెల్‌ పెంపకంలో తిరువనంతపురంలోని మహారాజాస్‌ కళాశాల నుంచి డబుల్‌ పీజీ (ఎకనామిక్స్, హిస్టరీ) చేశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు.

ఆ తర్వాత 1938లో ట్రావెన్‌కోర్‌ స్టేట్‌ కాంగ్రెస్‌లో చేరిన మాస్కరీన్‌ సంస్థానా«దీశులు, దివాన్‌లకు వ్యతిరేకంగా గళమెత్తారు. దివాన్‌గా పనిచేసిన రామస్వామి అయ్యర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ జరిపిన పోరాటంలో ఆమె క్రియాశీలపాత్ర పోషించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆమె పోలీసు దెబ్బలు తిన్నారు. ఆమె ఇంటిని కూలగొట్టి, ఇంట్లోని వస్తువులను దొంగిలించారు.

ఆ తర్వాత 1939లో ఆమె ట్రావెన్‌కోర్‌ సంస్థానంలో ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు ప్రాతినిధ్యం వహించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న మాస్కరీన్‌కు 1946, ఫిబ్రవరి 21న మహాత్మాగాంధీ రాసిన లేఖ అప్పట్లో సంచలనమైంది. బాంబేలో ఆమె ఇచ్చిన ఉపన్యాసానికి స్పందిస్తూ ‘మీ నాలుక అదుపులో లేదు. బుద్ధికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు.’అని రాస్తూనే ట్రావెన్‌కోర్‌ ప్రభుత్వం నుంచి ఆమెను తొలగించాలని గాందీజీ ఆ లేఖలో కోరడం గమనార్హం.

ఇక, ఆ తర్వాత 1946లో ఏర్పాటైన 299మంది సభ్యులతో కూడిన కాన్‌స్టిట్యుయెంట్‌ అసెంబ్లీ ఆఫ్‌ ఇండియాలో నియమితులయ్యారు. 1951లో మొదటి లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.  

ఆ ఆరుగురి అదృష్టం ఏంటో?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు ఎంపీ ఎన్నికలు జరగ్గా  2014 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత(టీఆర్‌ఎస్‌) నిజామాబాద్‌ నుంచి, 2019 ఎన్నికల్లో మాలోతు కవిత(టీఆర్‌ఎస్‌) మహబూబాబాద్‌ నుంచి గెలుపొందారు. ఇక, 2024 ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సిట్టింగ్‌ ఎంపీ మాలోతు కవిత మళ్లీ మహబూబాబాద్‌ నుంచి పోటీలో ఉండగా, బీజేపీ సీనియర్‌ నాయకురాలు డీకే.అరుణ మహబూబ్‌నగర్‌ నుంచి బరిలో నిలిచారు. హాస్పిటల్‌ రంగానికి చెందిన కొంపెల్లి మాధవీలత (బీజేపీ) హైదరాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించింది. ఆదిలాబాద్‌ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, వరంగల్‌ నుంచి డాక్టర్‌ కడియం కావ్య, మల్కాజ్‌గిరి నుంచి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డిలను రంగంలోకి దింపింది.  

జాతీయస్థాయి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటున్న నారీమణులు 
1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో  గెలిచిన 22 మంది మహిళలు     
 2009లో 50 దాటిన మహిళా ఎంపీల సంఖ్య...   2019లో అత్యధికంగా 78 మంది గెలుపు 

Advertisement
Advertisement