LSG VS CSK: గెలిచినప్పుడు ధోనిని పొగిడి, ఓడితే రుతురాజ్‌ను నిందిస్తారా..? | Sakshi
Sakshi News home page

IPL 2024 LSG VS CSK: గెలిస్తే ధోని, ఓడితే రుతురాజా..?

Published Thu, Apr 25 2024 2:51 PM

IPL 2024 LSG VS CSK: Ambati Rayudu And Navjot Sidhu Banter On CSK Captaincy - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా సీఎస్‌కేతో నిన్న (ఏప్రిల్‌ 23) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్‌ అజేయమైన మెరుపు శతకంతో (63 బంతుల్లో 124 నాటౌట్‌; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోను విజయతీరాలకు చేర్చాడు. స్టోయినిస్‌కు పూరన్‌ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్‌ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) సహకరించారు. 

గెలిస్తే ధోని ఓడితే రుతురాజా..?
మ్యాచ్‌ అనంతరం జరిగిన డిబేట్‌లో నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్దూ, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్‌కే ఓటమికి రుతురాజ్‌ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే.. గెలిచినప్పుడు ధోని పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజ్‌ నిందించడం సమంజసం కాదని సిద్దూ అభిప్రాయపడ్డాడు. 

 

 

తొలుత రాయుడు మాట్లాడుతూ.. డెత్‌ ఓవర్లలో రుతురాజ్‌ ఫీల్డింగ్‌ను మొహరించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడింది. స్టోయినిస్‌ విధ్వంసకర మూడ్‌లో ఉన్నప్పుడు రుతురాజ్‌ సిల్లీ ఫీల్డ్‌ సెటప్‌ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని అన్నాడు.

ఇందుకు సిద్దూ కౌంటరిస్తూ.. సీఎస్‌కే గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్‌ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్‌ను నిందించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడు ధోనిని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని అన్నాడు. సీఎస్‌కే కెప్టెన్సీని ధోనినే ఇంకా మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్‌ గైక్వాడ్‌ మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 108 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్‌ మెరుపులకు శివమ్‌ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం తోడు కావడంతో సీఎస్‌కే భారీ స్కోర్‌ చేసింది. 

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. తొలి ఓవర్‌లోనే డికాక్‌ వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే స్టోయినిస్‌.. పూరన్‌, హుడా సహకారంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. చివరి ఓవర్‌లో లక్నో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. మస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో ప్టోయినిస్‌ వరుసగా 6, 4, 4, 4 పరగులు సాధించాడు. ఫలితంగా లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement