అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ | Sakshi
Sakshi News home page

సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ

Published Wed, May 8 2024 10:48 AM

సంజూ శాంసన్‌ అవుటైన తీరుపై వివాదం(PC: BCCI/Jio Cinema)

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. 

అసలేం జరిగిందంటే.. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్‌ గెలిచిన రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌.. పంత్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 

దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లు
ఓపెనర్లు జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌(20 బంతుల్లో 50), అభిషేక్‌ పోరెల్‌(36 బంతుల్లో 65), ఆరో నంబర్‌ బ్యాటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు.

ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

అవుటా? నాటౌటా?
మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.

రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో పదహారో ఓవర్‌లో ఢిల్లీ పేసర్‌ ముకేశ్‌ కమార్‌ బౌలింగ్‌కు వచ్చాడు. అతడి బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్‌ వద్ద షాయీ హోప్‌ క్యాచ్‌ పట్టగా ఫీల్డ్‌ అంపైర్‌ అవుటిచ్చాడు.

చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్‌తో వాగ్వాదం
అయితే, ఆ సమయంలో షాయీ హోప్‌ బౌండరీ లైన్‌ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్‌ అంపైర్‌ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. 

అదే సమయంలో ఢిల్లీ డగౌట్‌ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్‌ జిందాల్‌ సైతం అవుట్‌ అంటూ అరుస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్‌ అంపైర్లతో వాదనకు దిగాడు. 

ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్‌ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది.  ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్‌ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.

చదవండి: యువీ, ధావన్‌ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటా

Advertisement
 
Advertisement
 
Advertisement