IPL 2024: ముంబై ఇండియన్స్‌ అంటే చాలు యశస్వికి పూనకం వస్తుంది..! | Sakshi
Sakshi News home page

IPL 2024: ముంబై ఇండియన్స్‌ అంటే చాలు యశస్వికి పూనకం వస్తుంది..!

Published Tue, Apr 23 2024 11:10 AM

IPL 2024: RR Opener Yashasvi Jaiswal Scored His Two IPL Hundreds Against Mumbai Indians - Sakshi

రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌కు ముంబై ఇండియన్స్‌ అంటే చాలు పూనకం వస్తుంది. యశస్వి ఏ జట్టుపై అయినా ఆడతాడో లేదో తెలీదు కానీ ముంబై ప్రత్యర్దిగా ఉంటే మాత్రం రెచ్చిపోతాడు. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 22) జరిగిన మ్యాచ్‌లో యశస్వి మరోసారి చెలరేగిపోయాడు. విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 104 నాటౌట్‌; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు.

రెండేళ్లలో యశస్వికి ముంబైపై ఇది రెండో సెంచరీ. యశస్వి తన కెరీర్‌లో చేసిన రెండు సెంచరీలు ముంబైపై చేసినవే కావడం విశేషం. గత సీజన్‌లో ముంబైపై వారి సొంత మైదానమైన వాంఖడేలో శతక్కొట్టిన (124) యశస్వి.. తాజాగా తమ హోం గ్రౌండ్‌ జైపూర్‌లోని సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియంలో అజేయ సెంచరీతో ఇరగదీశాడు. యశస్వితో పాటు సందీప్‌ శర్మ (4-0-18-5) చెలరేగడంతో నిన్నటి మ్యాచ్‌లో రాయల్స్‌ ముంబైపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజా శతకంతో యశస్వి ఐపీఎల్‌లో 23 ఏళ్లలోపు రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (65), నేహల్‌ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రాయల్స్‌ బౌలర్లలో సందీప్‌తో పాటు బౌల్ట్‌ (4-0-32-2) కూడా రాణించాడు. 

అనంతరం​ నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. 18.4  ఓవర్లలో కేవలం వికెట్‌ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి మెరుపు సెంచరీతో రాయల్స్‌ను గెలిపించాడు. బట్లర్‌ (35), సంజూ శాంసన్‌ (38 నాటౌట్‌) రాణించారు. రాయల్స్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ (బట్లర్‌) పియూశ్‌ చావ్లాకు దక్కింది.

Advertisement
Advertisement