ధోని ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా.. | Sakshi
Sakshi News home page

ధోని రికార్డు బద్దలు కొట్టిన సంజూ శాంసన్‌.. భారత తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు

Published Wed, May 8 2024 9:59 AM

సంజూ శాంసన్‌ (PC: BCCI/IPL)

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ అరుదైన ఫీట్‌ను న‌మోదు చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో  అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్‌ను చేరుకున్న తొలి భారత క్రికెటర్‌గా శాంసన్‌ నిలిచాడు. 

ఐపీఎల్‌-2024లో భాగంగా అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసకున్నాడు. శాంసన్‌ కేవలం 159 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును సాధించాడు. 

ఇప్పటివవరకు ఈ రికార్డు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పేరిట ఉండేది. ఎంఎస్‌ ధోని 165 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో ధోని రికార్డును శాంసన్‌ బ్రేక్‌ చేశాడు. 

ఓవరాల్‌గా పదో ప్లేయర్‌
ఇక ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 200 సిక్స్‌లు మైలు రాయిని అందుకున్న 10వ ప్లేయర్‌గా శాంసన్‌ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, సురేష్ రైనా  ఉన్నారు.

కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలైంది. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఢిల్లీ ఓపెనర్లు జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌(20 బంతుల్లో 50), అభిషేక్‌ పోరెల్‌(36 బంతుల్లో 65) దంచికొట్టారు.

 

 వీరికి తోడు ఆరో నంబర్‌ బ్యాటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ (20 బంతుల్లో 41) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పంత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

సంజూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృథా
ఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ 201 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రాజస్తాన్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. 

కాగా రాజస్తాన్‌ బ్యాటర్లంతా విఫలం కాగా సంజూ శాంసన్ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement