IPL 2024: బంతి వేయకుండానే రికార్డుల్లోకెక్కిన ముంబై సంచలన పేసర్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024 SRH VS MI: బంతి వేయకుండానే రికార్డుల్లోకెక్కిన ముంబై సంచలన పేసర్‌

Published Wed, Mar 27 2024 8:11 PM

IPL 2024 SRH VS MI: Kwena Maphaka Becomes Third Youngest Overseas Player On IPL Debut - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇవాళ (మార్చి 27) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ సంచలన బౌలర్‌ క్వేన మపాకా బంతి వేయకుండానే రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన మపాకా.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.

మపాకా 17 ఏళ్ల 354 రోజుల వయసులో ఐపీఎల్‌ ఎంట్రీ ఇవ్వగా.. లీగ్‌ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడి రికార్డు కేకేఆర్‌ ప్లేయర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ పేరిట ఉంది. ముజీబ్‌ 17 ఏళ్ల 11 రోజుల వయసులో ఐపీఎల్‌ ఎంట్రీ ఇచ్చాడు. ముజీబ్‌ తర్వాత అత్యంత పిన్న వయస్కుడి రికార్డు సందీప్‌ లామిచ్చేన్‌ (17 ఏళ్ల 283 రోజులు) పేరిట ఉంది. వీరిద్దరి తర్వాతి స్థానంలో మపాకా ఉన్నాడు. 

ఈ రికార్డుతో పాటు మపాకా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రెండో అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. రసిఖ్‌ సలామ్‌ (17 ఏళ్ల 353 రోజులు) ముంబై తరఫున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు కలిగి ఉన్నాడు.

కాగా, సన్‌రైజర్స్‌తో ఇవాల్టి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (18 బంతుల్లో 52; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దశతకంతో పూనకాలు తెప్పించడంతో సన్‌రైజర్స్‌ 5.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 74 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను (11) హార్దిక్‌ పాండ్యా ఔట్‌ చేయగా.. హెడ్‌కు జతగా అభిషేక్‌ శర్మ (8) క్రీజ్‌లో ఉన్నాడు. 
 

Advertisement
Advertisement