T20 WC: హార్దిక్‌ను సెలక్ట్ చేయ‌డం రోహిత్‌కు ఇష్టం లేదు.. కానీ! | Sakshi
Sakshi News home page

T20 WC: హార్దిక్‌ను సెలక్ట్ చేయ‌డం రోహిత్‌కు ఇష్టం లేదు.. కానీ!

Published Tue, May 14 2024 12:36 PM

Rohit Sharma Agarkar Were Against Hardik Pandya T20 WC Selection: Report

టీ20 ప్రపంచ‌క‌ప్‌-2024 టోర్నీ కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో పేస్ ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యాకు అవ‌కాశం ఇవ్వ‌డం కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌కు ఇష్టం లేదా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మ‌రి అత‌డిని ఏకంగా వైస్ కెప్టెన్‌గా ప్ర‌క‌టించడానికి కార‌ణం ఏంటి?..

ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియ‌న్స్‌లోకి వ‌చ్చిన గుజ‌రాత్ టైటాన్స్ సార‌థి హార్దిక్ పాండ్యాను ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా ప్ర‌క‌టించింది. ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శ‌ర్మ‌పై వేటు వేసి మ‌రీ ప‌గ్గాలు అత‌డికి అప్ప‌గించింది.

అయితే, పాండ్యా యాజ‌మాన్యం అంచ‌నాలు అందుకోలేక‌పోయాడు. అంతేకాదు జ‌ట్టులో సీనియ‌ర్లు అయిన రోహిత్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, సూర్య‌కుమార్ యాద‌వ్‌ల‌తో పాండ్యాకు స‌ఖ్య‌త లేన‌ట్లు చాలా సంద‌ర్భాల్లో నిరూపిత‌మైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ రెండు వ‌ర్గాలుగా విడిపోయింద‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

ఈ నేప‌థ్యంలో జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న పేల‌వంగా సాగ‌డం, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన తొలి జ‌ట్టుగా ముంబై నిల‌వ‌డం ఇందుకు బ‌లాన్ని చేకూర్చింది. కెప్టెన్‌గా విఫ‌ల‌మైన పాండ్యా ఆల్‌రౌండ‌ర్‌గానూ చెప్పుకోగ‌ద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన 13 మ్యాచ్‌ల‌లో క‌లిపి 144.93 స్ట్రైక్‌రేటుతో 200 ప‌రుగులు స్కోరు చేయ‌డంతో పాటు 10.59 ఎకాన‌మీతో 11 వికెట్లు తీశాడు. అయితే, ఆరంభంలో మాత్రం వ‌రుస‌గా విఫ‌ల‌మ‌య్యాడు. అయిన‌ప్ప‌టికీ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోగ‌లిగాడు.

ఈ నేప‌థ్యంలో ఫామ్‌లో లేకున్నా పాండ్యాకు చోటు ఇవ్వ‌డం ప‌ట్ల బీసీసీఐ తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ విష‌యం గురించి ఎదురైన ప్ర‌శ్న‌కు టీమిండియా ఛీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ స‌మాధానిమిస్తూ.. త‌మకు అందుబాటులో ఉన్న ఆట‌గాళ్ల‌లో పాండ్యా మాదిరి బ్యాటింగ్‌, బౌలింగ్ చేయ‌గ‌ల స‌మ‌ర్థ‌వంత‌మైన పేస్ ఆల్‌రౌండ‌ర్ లేనందు వ‌ల్లే అత‌డిని ఎంపిక చేసిన‌ట్లు వెల్ల‌డించాడు.

ఈ క్ర‌మంలో దైనిక్ జాగ‌ర‌ణ్ ఆస‌క్తిక‌ర క‌థ‌నం వెలువ‌రించింది. రోహిత్‌, అగార్క‌ర్‌ల‌కు ఇష్టం లేక‌పోయినా.. ఒత్తిడిలో కూరుకుపోయినందు వ‌ల్లే పాండ్యాను సెల‌క్ట్ చేసిన‌ట్లు తెలిపింది. 

 అదే విధంగా.. ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో కెప్టెన్‌గానూ ప్ర‌స్తుతం ప్ర‌త్యామ్నాయం లేనందు వ‌ల్లే వైస్ కెప్టెన్‌గా ప్ర‌కటించిన‌ట్లు వెల్ల‌డించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement