IPL 2024- WI: అలా అయితే.. సన్‌రైజర్స్‌, రాజస్తాన్‌కు షాక్‌! | West Indies Schedule T20I Series Vs South Africa, Dates Clash With IPL 2024 Playoffs | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌ బోర్డు కీలక ప్రకటన.. సన్‌రైజర్స్‌, రాజస్తాన్‌కు షాక్‌!

Published Sat, May 11 2024 12:15 PM

West Indies Schedule T20I Series Vs South Africa Dates Clash IPL 2024 Playoffs

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది.

మే 23, 25, 26 తేదీల్లో ప్రొటిస్‌ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడనున్నట్లు వెల్లడించింది. జమైకాలోని సబీనా పార్కు వేదికగా ఈ మూడు మ్యాచ్‌లు జరుగనున్నట్లు వెల్లడించింది. కాగా విండీస్‌- సౌతాఫ్రికా సిరీస్‌ సమయంలోనే ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ నాకౌట్‌‌, క్వాలిఫయర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి.

సన్‌రైజర్స్‌, రాజస్తాన్‌కు షాక్‌!
ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ చేరిన జట్లలో భాగమైన ఆటగాళ్లను గనుక విండీస్‌- ప్రొటిస్‌ బోర్డులు వెనక్కి పిలిపిస్తే ఆయా ఫ్రాంఛైజీలకు తలనొప్పి తప్పదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌-4లో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లోనే ఈ రెండు జట్ల ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.

ప్లే ఆఫ్స్‌ రేసులో దూసుకుపోతున్న ఈ రెండు జట్లు గనుక కీలక సమయంలో ఆటగాళ్లను కోల్పోతే కష్టాలు తప్పవు. కాగా మే 21న ఐపీఎల్‌-2024 తొలి క్వాలిఫయర్‌, మే 22న ఎలిమినేటర్‌ మ్యాచ్‌, మే 24న రెండో క్వాలిఫయర్‌, మే 26న ఫైనల్‌ జరుగనున్నాయి.

మెగా ఈవెంట్‌కు ముందు
కాగా గత టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేక చతికిలపడ్డ వెస్టిండీస్.. ఆ తర్వాత స్వదేశంలో టీమిండియా, ఇంగ్లండ్‌‌లపై సిరీస్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. తాజాగా సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.

ఇక జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్‌కు ముందు సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్‌తో విండీస్‌కు కావాల్సినంత ప్రాక్టీస్‌ దొరకనుంది.

ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌ టోర్నీ నేపథ్యంలో పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఐపీఎల్‌ నుంచి తమ ఆటగాళ్లను వెనక్కి పిలిపించేందుకు సమాయత్తమైన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2024లో భాగమైన వెస్టిండీస్‌, సౌతాఫ్రికా ఆటగాళ్లు వీరే
విండీస్‌ ప్లేయర్లు
రోవ్‌మన్ పావెల్ (రాజస్తాన్ రాయల్స్), షిమ్రాన్ హెట్మెయిర్ (రాజస్తాన్ రాయల్స్), అల్జారీ జోసెఫ్ (ఆర్సీబీ), షాయ్ హోప్ (ఢిల్లీ క్యాపిటల్స్), షమర్ జోసెఫ్ (లక్నో సూపర్ జెయింట్స్), నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్), ఆండ్రీ రస్సెల్ (కోల్‌కతా నైట్ రైడర్స్), రొమారియో షెఫర్డ్ (ముంబై ఇండియన్స్).

సౌతాఫ్రికా ఆటగాళ్లు
ఐడెన్ మార్క్రమ్ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్), హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్), మార్కో జాన్సన్ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్), గెరాల్డ్ కోట్జీ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డికాక్ (లక్నో సూపర్ జెయింట్స్), కేశవ్ మహరాజ్ (రాజస్తాన్ రాయల్స్), డేవిడ్ మిల్లర్ (గుజరాత్ టైటాన్స్), అన్రిచ్ నోర్జే (దక్షిణాఫ్రికా), కగిసో రబడ (పంజాబ్ కింగ్స్), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్).

చదవండి: గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. గిల్‌కు ఏకంగా!

 

Advertisement
 
Advertisement
 
Advertisement