Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sakshi Editorial On female awareness in AP Assembly elections Polling
మహిళా చైతన్యంపై మారీచ మేఘం!

ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్‌డీఎస్‌ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్‌ పోల్‌ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్‌డీఎస్‌ తెలిపింది. ఉజ్వల్‌ యోజన, స్వచ్ఛ భారత్‌ అభియాన్, జన్‌ధన్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్‌డీఎస్‌ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్‌ జగన్‌ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్‌ ఛేంజర్స్‌.మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్‌ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్‌ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్‌బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్‌ బిహేవియర్‌పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్‌ ఛాయిస్‌పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్‌ పోల్స్‌ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్‌ కిశోర్‌ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్‌శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్‌’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్‌ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్‌ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్‌ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్‌ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఎలక్షనీరింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్‌లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్‌లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్‌ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్‌ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Ksr Comments On Andhra Pradesh Election Results
అందుకే సీఎం జగన్‌ విక్టరీ వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికలలో పోలింగ్ పూర్తి అయిన రెండు రోజులకు ఆయన ఐ-ప్యాక్ సంస్థలో పనిచేసేవారితో సమావేశమై ఫలితాలపై తనదైన శైలిలో జోస్యం చెప్పారు. 2019లో వైఎస్సార్‌సీపీకు వచ్చిన 151 సీట్లను మించే ఈసారి కూడా సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇంత ధైర్యంగా జగన్ ఎలా చెప్పారు? ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి? ఇంతవరకు జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సాహసోపేతమైన రీతిలో ఆయన తన అంచనాలు వెల్లడించడంలో ఉద్దేశం ఏమిటి అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.జగన్ చెప్పినట్లు ఆ స్థాయిలో విజయం సాధ్యమేనా అన్న సంశయం పలువురిలో ఉంది. అయినా గత అనుభవాల రీత్యా ఏమోలే వస్తే రావచ్చు అని అనుకున్నవారూ ఉన్నారు. జగన్ ధైర్యానికి ఒకటే కారణం స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఇచ్చిన పేదలు vs పెత్తందార్లు అన్న నినాదం ఫలించిందని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. మీ ఇంట్లో తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటు వేయండని పిలుపు ఇచ్చారు. అది కూడా బాగా పని చేసి ఉండవచ్చు. ఎందుకంటే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కనీసం మూడు కోట్ల మందికి పైగా లబ్ది పొందారు. వారిలో ఏభై, అరవై శాతం ఓట్లు వేసినా, తాను అనుకున్న సీట్లు రావడం కష్టం కాదు.గత ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అత్యధికులు నమ్మారు. 120-130 సీట్లు రావచ్చని ఎక్కువ మంది భావించారు. ఆ టైమ్‌లో కూడా జగన్ 150 సీట్లు ఎందుకు రాకూడదని ప్రశ్నించేవారు. నిజంగానే ఆయన ఊహించినట్లుగానే 151 సీట్లు వచ్చాయి. అది ఒక రికార్డు. గతంలో విభజిత ఏపీలో ఆ స్థాయిలో ఏ పార్టీకి సీట్లు దక్కలేదు. ఎన్‌.టీ.రామారావు సాధించలేని రికార్డును జగన్ సాధించగలిగారు. అంతేకాక ఇరవైరెండు లోక్ సభ సీట్లు వైఎస్సార్‌సీపీ వచ్చాయి. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో లోక్ సభ సీట్లు వస్తాయని జగన్ అంటున్నారు. మామూలుగా అయితే పార్టీ క్యాడర్‌లో విశ్వాసం పెంచడానికి జగన్ ఇలా అని ఉండవచ్చులే అనుకుంటారు. కాని జగన్ ఎప్పుడు ఏమి చేసినా ఒక రివల్యూషన్‌లా ఉంటోంది.ప్రభుత్వాన్ని సైతం అలాగే నడిపారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను నెలకొల్పి పాలనలో కొత్త విప్లవాన్ని తెచ్చారు. ప్రజలకు వారి ఇళ్ల వద్దే సేవలు అందించారు. ఇది కొత్త అనుభూతే. దేశంలో ఏ రాష్ట్రంలోను ఇలాంటి సదుపాయం ప్రజలకు లేదు. జగన్ తీసుకువచ్చిన ఈ వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవడానికి సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్లు ఇచ్చి వారిని గౌరవించే ప్రభుత్వం ఏపీలో మాత్రమే ఉందని ఆయన రుజువు చేశారు. అలాగే రాజకీయంగా బలహీనవర్గాలకు, మహిళలకు ఏభై శాతం పదవులు వచ్చేలా చేయడం, పథకాలు కాని, ఇళ్ల స్థలాలు కాని మహిళల పేరుతోనే ఇవ్వడం తదితర చర్యల ద్వారా సామాజిక విప్లవం తెచ్చారు. వీటన్నిటి ఫలితంగానే పోలింగ్ రోజున బలహీనవర్గాలవారు వెల్లువలా ఓట్లు వేయడానికి తరలివచ్చారన్న అభిప్రాయం ఏర్పడింది. వీటన్నిటిని బెరీజు వేసుకునే ముఖ్యమంత్రి జగన్ 151 సీట్లు మించే వైఎస్సార్‌సీపీ వస్తాయని చెప్పి ఉండవచ్చు.ఇంకో సంగతి చెప్పాలి. కూటమి నేతలు హైదరాబాద్, తదితర చోట్ల ఉన్న తమ మద్దతుదారులను రప్పించిన తీరు కూడా ఆయా గ్రామాలలోని బలహీనవర్గాలు గుర్తించాయట. పెత్తందార్లకు మద్దతు ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చినవారికి పోటీగా స్థానికంగా ఉండే గ్రామాలలోని పేదలంతా ఓటింగ​్‌లో పాల్గొన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల ప్రభుత్వం నడిచిన తర్వాత తిరిగి అదే అధికార పార్టీకి గతంలో కన్నా అధికంగా సీట్లు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అయితే అదేమి అసాధ్యం కాదు. ఉదాహరణకు 2014లో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు వస్తే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయి. అంటే ఏకంగా ఇరవైఐదు సీట్లు పెరిగాయన్నమాట. అలాగే గుజరాత్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 99 సీట్లు వస్తే, 2022 ఎన్నికలలో 160 వరకు వచ్చాయి.గుజరాత్ మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ తిరుగులేని ఆధిక్యతతో పాలన చేస్తోంది. ఒడిషా లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పాతికేళ్లు పూర్తి చేశారు. బెంగాల్‌లో గతంలో సీపీఎం నేత జ్యోతిబసు వరసగా ఇరవైమూడేళ్లు పాలన చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో టర్మ్ కూడా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ప్రత్యర్ధి పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డిఎమ్.కె అధికారంలోకి వచ్చిన ఒక సందర్భంలో డిఎమ్.కెకి కేవలం రెండు స్థానాలే వచ్చాయి. ఉమ్మడి ఏపీలో 1994లో ఎన్‌.టీ.ఆర్‌ నాయకత్వంలోని తెలుగుదేశంకు 213 సీట్లు, మిత్రపక్షాలకు 34 సీట్లు వచ్చాయి.అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం 26 సీట్లే గెలుచుకుని ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఒక్కోసారి కొన్ని పరిణామాలను బట్టి, ప్రభుత్వాల పనితీరును బట్టి, ఎన్నికలలో ప్రకటించే మానిఫెస్టోలలోని అంశాలను బట్టి కూడా ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. 2024 ఎన్నికలలో జగన్‌కు ఉన్న క్రెడిబిలిటిని జనం విశ్వసించారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడి, అబద్దాలు చెప్పి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయారు. చంద్రబాబు నాయుడు లక్షన్నర కోట్లకుపైగా ఎన్నికల హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితి లేదు. జగన్ కొత్తగా పెద్దగా హామీలు ఇవ్వకుండా ఉన్న పరిస్థితిని చెప్పడం ఆయన నిజాయితీ తెలియచేస్తుంది. 2019లో ఇచ్చిన హామీలను జగన్ 99 శాతం నెరవేర్చడమే కాకుండా మానిఫెస్టోలను చూపించి మంచి జరిగితేనే తనకు ఓటు వేయండని ప్రజలకే పరీక్ష పెట్టారు. ఇవన్ని ఆయనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్‌గా కనిపిస్తాయి.ఈ నేపధ్యంలోనే ఆయన అంత ధీమాగా 151 సీట్లను మించి వస్తాయని చెప్పి ఉండవచ్చు. ఈసారి పలు సర్వే సంస్థలు పోలింగ్ పూర్తి అయిన తర్వాత చేసిన పరిశీలనలో వైఎస్సార్‌సీపీ దే అధికారం అని చెబుతున్నాయి. టీడీపీకి అనుకూలంగా పోలింగ్‌కు ముందు మాట్లాడిన సంస్థలు సైతం పోలింగ్ అయిన తర్వాత వైఎస్సార్‌సీపీవై పే మొగ్గు చూపుతున్నాయి. అయినా టీడీపీ కూటమిలో ఆశలు పూర్తిగా పోయాయని చెప్పలేం. వారి సోషల్ మీడియా ద్వారా తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఐ-ప్యాక్ పూర్వ వ్యవస్థాపకుడు ప్రశాంత కిషోర్ ఈ మధ్య టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ అధికారం దక్కదని ప్రచారం చేశారు. ఆ తరుణంలో టీడీపీతో పాటు, ఇలాంటివారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టేలా జగన్ ఈ ప్రకటన చేసినట్లు అనిపిస్తుంది. చాలామంది ఈసారి తీవ్రమైన పోటీ ఉంటుందని, అందువల్ల వైఎస్సార్‌సీపీ వంద నుంచి 110 సీట్ల వరకు రావచ్చని అంచనా వేశారు.ఒకవేళ జగన్‌కు అనుకూలంగా వేవ్‌ వస్తే మాత్రం ఆ సీట్ల సంఖ్య 140-150 వరకు వెళ్లవచ్చని లెక్కగడుతున్నారు. కాగా ఇండియా టుడ్-ఎక్సిస్ అనే సంస్థ వైఎస్సార్‌సీపీ 142-157 వరకు సీట్లు రావచ్చని అంచనావేసింది. అలాగే టుడేస్ చాణక్య అనే సంస్థ 144-158 సీట్లు దక్కుతాయని లెక్కగట్టింది. న్యూస్ ఎక్స్-నేత అనే సంస్థ 139-152 సీట్లు రావచ్చని చెబుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సీఎన్‌ఎన్‌ న్యూస్ 18 సంస్థ 132 lనుంచి 145 సీట్లు వస్తాయని భావిస్తోంది. టైమ్‌స్ నౌ జోస్యం ప్రకారం 128-133 సీట్లు రావచ్చు. ఇలా కొన్ని సర్వే సంస్థలు సైతం వైఎస్సార్‌సీపీకు 151 మించి సీట్లు వస్తాయని చెబుతున్నాయి. వీటిని గమనిస్తే జగన్ చెప్పినట్లు వైఎస్సార్‌సీపీకు ఈ స్థాయిలో విజయం లభిస్తుందన్న భావన కలుగుతుంది. ఇదే జరిగితే నిజంగానే దేశ మంతా జగన్ వైపు చూస్తుంది. ఏపీలో జరుగుతున్న పాలన వైపు, వ్యవస్థల వైపు చూస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

COVID-19: Singapore is experiencing a new wave of COVID-19
COVID-19: సింగపూర్‌లో మళ్లీ కోవిడ్‌ వేవ్‌

సింగపూర్‌: సింగపూర్‌లో కోవిడ్‌–19 మరోసారి విజృంభిస్తోది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కేవలం వారం వ్యవ ధిలో 25,900 కేసులు నమోద య్యాయి. దీంతో, ప్రభుత్వం మాస్క్‌లు ధరించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆరోగ్యమంత్రి ఓంగ్‌ యె కుంగ్‌ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ‘దేశంలో కోవిడ్‌ వేవ్‌ ప్రారంభ దశలో ఉంది. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో, జూన్‌ మధ్య నుంచి చివరి వరకు భారీగా కేసులు నమోదవుతాయి’ అని చెప్పారు. గత వారంలో మే 5 నుంచి 11వ తేదీ వరకు కేసులు 25,900పైగా నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 13,700 కేసులొచ్చాయి. ఆ వారంలో రోజుకు 181 నుంచి 250 మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఐసీయూ కేసులు సరాసరిన రోజుకు మూడు మాత్రమే ఉన్నాయని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధాశ్రమాల్లో ఉండేవారు అదనపు డోసు కోవిడ్‌ టీకా తీసుకోవాలని మంత్రి సూచించారు.

Ysrcp Likely To Clean Sweep Uttarandhra
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?

ఉత్తరాంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని టాక్‌. ఓటింగ్ జరిగిన తీరు, పెరిగిన ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి బింకంగా ఉన్నా..ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడాన్ని చూసి టీడీపీకి గుండె జారిపోయింది. దీంతో నాలుగు రోజుల నుంచి వారి కంటి మీద కునుకు కరువైంది. ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది?సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసి వర్గాల నుంచి ఊహించినవిధంగా ఓటింగ్ జరగడం వైఎస్సార్సీపీకే అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైఎస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపిందనే చర్చ జరుగుతోంది. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయని అంటున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్ట్, ఐటీ రంగం అభివృద్ధితోపాటు, భారీ పరిశ్రమల ఏర్పాటు, విశాఖ నగర అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం వంటివి ఓటర్లను వైఎస్సార్‌సీపీ వైపు మరింతగా ఆకర్షితులను చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి అక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమ్మఒడి, వైయస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలనే ఆలోచన మహిళల్లో స్పష్టంగా కనిపించింది.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తెరవకముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు. గంటల కొద్దీ ఓపికగా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ, ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ 81 శాతానికి పైగా జరగడం విశేషంగా చెబుతున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హేమా హేమీలైన నేతల్లో వణుకు పుడుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైఎస్‌ఆర్‌సీపీ కలిసి వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు, ఆమె పుట్టినూరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీవైపే మొగ్గు చూపారు. గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం, గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూకబ్జాలను విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఇదేవిధంగా తయారయ్యింది. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటాకు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు.ప్రతి ఎన్నికలోను రిగ్గింగ్‌తో గెలిచే అచ్చం నాయుడుకు ఈసారి టెక్కలిలో చెక్ పడనుంది. అచ్చం నాయుడు గూండాయిజం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది అదే పరిస్థితి. బూతులతో విరుచుకుపడే అయ్యన్నకు మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్త రోడ్లు నిర్మాణం, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైఎస్ఆర్‌సీపీకి మొగ్గు చూపించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావులు పక్క నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.అనకాపల్లి ఎంపీగా ఒకప్పటి నాటు సారా వ్యాపారి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేశారు. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడం, ఓసి వెలమ కావడంతో స్థానికంగా ఉన్న బీసీ వెలమలు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకే మోగ్గు చూపించారు.ఇక్కడున్న కొద్ది రోజుల్లోనే సీఎం రమేష్ రౌడీయిజంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సీఎం రమేష్ ఎన్నికలపుడే ఇంతటి గుండాయిజం చేస్తున్నాడు. పొరపాటున గెలిస్తే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతాడనే ఆందోళన అనకాపల్లి ప్రజల్లో కనిపించింది. దీంతో రమేష్‌కు మద్దతివ్వడానికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. ప్రస్తుత ఓటింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి తరపున పోటీ చేసిన హేమా హేమీలంతా మట్టి కరుస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీకి గతంలో వచ్చిన కొద్ది సీట్లు కూడా ఈసారి రావనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Kaleswaram barrages are being repaired on war footing
కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు!

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇటీ వల సమర్పించిన మధ్యంతర నివేదికలో సిఫారసు చేసిన అత్యవసర మరమ్మతులు, తదుపరి పరీక్షలను ఏకకాలంలో చేపట్టాలని అధికారులను ఆదే శించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. వర్షాలు ప్రారంభం కాకముందే వీలైనవన్నీ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనుల పురోగతిపై రోజువారీగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి నివేదిక సమర్పించాలని ఆ శాఖను కోరింది. కమిటీ సిఫారసు చేసిన మేరకు సీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, ఎన్జీఆర్‌ఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో బ్యారేజీల్లోని లోపాలపై తదుపరి పరీక్షలు (ఇన్వెస్టిగేషన్లు) జరిపించాలని సూచించింది. జియో టెక్నికల్, జియోఫిజికల్‌ పరీక్షల నిర్వహణ కోసం ఒక్కో సంస్థకు ఒక్కో బ్యారేజీ బాధ్యతలను అప్పగించనుంది. మరమ్మతులు, పరీక్షలు ఏకకాలంలో నిర్వహించాలని ఆదేశించింది. మేడిగడ్డలో ఆ గేట్లు ముందే ఎత్తేయండిమేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ఏడో నంబర్‌ బ్లాక్‌లోని గేట్లన్నింటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పియర్లు కుంగిపోవడంతో 20, 21వ నంబర్‌ గేట్లను ఎత్తడం సాధ్యం కాదని, వాటి విడిభాగాలను విడదీసి తొలగిస్తామని ఇంజనీర్లు వివరించారు. ఆ ఇంజనీర్లపై సస్పెన్షన్‌ వేటు!బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సొంత బాధ్యతతో నిర్వహించడానికి నిర్మాణ సంస్థలు ముందు వస్తే సరి.. లేకుంటే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత అవసరమైన నిధులు ఇస్తామని తెలిపారు. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ పూర్తికాకపోయినా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు ధ్రువీకరిస్తూ వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీకి వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన ఒక సూపరింటెండింగ్‌ ఇంజనీర్, మరో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌పై సస్పెన్షన్‌ వేటు వేసేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై కూడా..ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్‌ సమర్పించిన మధ్యంతర నివేదికల ఆధారంగా బ్యారేజీల నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీకి మరమ్మతుల నిర్వహణకు ఇంకా ముందుకు రాని నిర్మాణ సంస్థను రప్పించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నారం, సుందిళ్ల నుంచి సాగునీరుమేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో దానికి ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీళ్లను ఎత్తిపోసి వచ్చే వానాకాలంలో రైతులకు సాగునీరు సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది.

CM YS Jagan Mohan Reddy Landed In London
లండన్‌ చేరుకున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌.. శనివారం అక్కడకు చేరుకున్నారు. సీఎం జగన్‌ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్‌ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మళ్లీ రాష్ట్రానికి తిరిగి రానున్నారు సీఎం జగన్‌. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం జగన్‌ రాష్ట్రానికి వస్తారు.

Special Article On TDP Leader Chintamaneni Prabhakar
రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే..!

కౌరవ సంతతి మొత్తం తెలుగుదేశంలోనే ఉందా? మహిళల మీద దాడులు చేసేవారు, దళితులను నీచంగా చూసేవారు, రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే ఇలాంటి నికృష్ట పనులకు కేరాఫ్‌గా నిలిచారు. మహిళా తాహసీల్దార్‌ మీద దాడి నుంచి ఎన్నికల్లో దాడుల వరకు ఆ మాజీ మీద ఎన్నో నేరారోపణలున్నాయి. తాజాగా పోలీస్ స్టేషన్ మీదపడి అరెస్టయిన తన మనిషిని తీసుకెళ్లిపోయేంతగా తెగించాడు. ఇంతకీ ఈ అరాచక పచ్చ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం.ఏపీ రాజకీయాల్లో గోదావరి జిల్లాల పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే నాయకులు కొందరుంటారు. వారిలో రాజకీయాల్లో మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందినవారు కొందరైతే.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, గూండాయిజంతో అందరిపైనా చిందులు తొక్కుతూ వార్తల్లో నిలిచేవాళ్ళు మరికొందరున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులోని పచ్చ పార్టీలో ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన నేరాల్లో సెంచరీ కొట్టేందుకు తహతహలాడుతున్నాడు. గూండాగిరీతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యే దెందులూరు నుంచి రెండుసార్లు టీడీపీ తరపున గెలిచి తన అధికార అహంకారాన్ని ప్రజలకు చూపించాడు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గట్టిగా గుణపాఠం చెప్పారు. తాజా ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని అర్థం కావడంతో తన గూండాగిరీతో అటు ప్రజల్ని..ఇటు పోలీసులను కూడా బెదిరించే స్థాయికి చేరాడు చింతమనేని ప్రభాకరచౌదరి.ఎంపీపీ దగ్గర నుంచి మొదలుపెట్టి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యేంతవరకూ చింతమనేని నేరాలు, దౌర్జన్యాల చిట్టా విప్పితే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. దశాబ్దాల రాజకీయ చరిత్రలో చింతమనేని అంటే దెందులూరులో ఒక రౌడీగా గుర్తింపు వచ్చిందే గాని రాజకీయ నాయకుడిగా, ఒక మంచి ప్రజాప్రతినిధిగా పేరు తెచ్చుకోలేకపోయారు.చింతమనేని దురాగతాలపై పలు కేసులు నమోదు అయినా ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతనుంచి మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే చింతమనేని తన నోటి దురుసు, దుడుకుతనంతో నిరంతరం వివాదాల్లో చిక్కుకుంటున్నారు.2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తన అక్రమ ఇసుక దందాను అడ్డుకున్నందుకు మహిళా తాహసీల్దార్‌ వనజాక్షిని నదిలో ఇసుకలో ఈడ్చుకుంటూ వెళ్ళి దాడి చేసిన విషయం రాష్ట్రంలో సంచలనం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభుత్వ అధికారిపై దాడి చేసినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోగా..ఆ తాహసీల్దార్‌నే తప్పుపట్టారు.ఇక అప్పటినుంచి చింతమనేని అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. ప్రజల మీద, ప్రత్యర్థుల మీద దాడులు చేయడం, పోలీసులనే బెదిరించడం నిత్యకృత్యంగా మారింది. దళితులంటే ఆయనకు ఎంత చిన్నచూపంటే..మీకు రాజకీయాలెందుకురా? రాజకీయాలు చేస్తే మేమే చేయాలంటూ.. మా బ్రీడ్ వేరు..మా బ్లడ్ వేరని తిక్కగా మాట్లాడే నందమూరి బాలకృష్ణలా అహంకారంతో కూడిన డైలాగ్స్‌ వదిలారు.ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఏలూరు టిడిపి ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు కలెక్టరేట్ కు వెళ్లిన చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన చింతమనేని పోలీసులతో ఓవరాక్షన్ చేయవద్దని..అలా చేస్తే ఏం చేయాలో తనకు తెలుసంటూ వారిని బెదిరించాడు. తమను అడ్డుకోవద్దని పోలీసులకు హెచ్చరికలు చేశారు. దీంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది. చింతమనేని మాటలకు ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులు అయ్యారు. ఎంతకాలం అయినా చింతమనేని ధోరణి మారకపోవడంతో పోలీసులు అతని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.. 13వ తేదీన పోలింగ్‌ జరుగుతున్నపుడు దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం..కొప్పులవారిగూడెంలో పంచాయతీ సర్పంచ్ సంజీవరావు కుమారుడు రవిపై టిడిపి కార్యకర్త రాజశేఖర్ కత్తెరతో దాడి చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముద్దాయిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ నుండి కోర్ట్ కు తీసుకువెళ్లే క్రమంలో ముద్దాయిని కస్టడీలో ఉంచారు. మూడు వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు పోలీసులతో ఘర్షణపడ్డారు. సీఐ తోపాటు పోలీస్ స్టేషన్ సిబ్బందిని దుర్భాషలాడుతూ...హత్యాయత్నం చేసి పోలీస్ కస్టడీలో ఉన్న టీడీపీ కార్యకర్తను చింతమనేని ప్రభాకర్ తన కారులో అక్కడి నుంచి తీసుకుని పరారయ్యాడు. అరెస్టయిని ముద్దాయిని పోలీస్ స్టేషన్‌ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్‌పీ స్పష్టం చేశారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరిపై కేసుల చిట్టా భారీగా ఉంది. బహుశా రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థిపైనా లేనన్ని కేసులు చింతమనేనిపై ఉన్నాయి. రౌడీషీట్ తో పాటు 93 కేసులు తనపై నమోదయ్యాయని చింతమనేని తన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో తెలిపారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన ఉదంతం రాష్ట్రం మరచిపోదు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్‌పై దాడిచేసిన కేసులో ప్రభాకర్ కు రెండేళ్ళ జైలు శిక్ష పడింది. తాజాగా పెదవేగి పోలీస్ స్టేషన్ విధ్వంసం సృష్టించడంతో మరో కేసు నమోదు అయింది.తమ బిడ్డపై దాడి చేసిన వ్యక్తిని చింతమనేని దౌర్జన్యంగా స్టేషన్ నుండి తీసుకుపోవడంపై కొప్పులవారి గూడెం సర్పంచ్ సంజీవరావు.. వైఎస్ఆర్సిపి శ్రేణులు పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని చింతమనేనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు..లేనపుడు కూడా చింతమనేని ప్రభాకర చౌదరి రౌడీయుజం, గూండాగిరీ ఏమాత్రం ఆగడంలేదు. ఆఖరుకు ఎన్నికల్లో కూడా అహంకారపూరితంగానే వ్యవహరిస్తున్నాడు. శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు అతనికి శిరచ్ఛేదం చేశాడు. మరి ఇప్పటికి 93 కేసులు తనపై ఉన్నాయని స్వయంగా చెప్పిన చింతమనేని అహంకారం ఎప్పుడు దిగుతుందా అని దెందులూరు ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Telangana EAPCET results released
ఇంజనీరింగ్‌లో 74 శాతం.. అగ్రి, ఫార్మాలో 89 శాతం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఈఏపీ సెట్‌–2024) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్‌ విభాగంలో 78.98 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66 శాతం అర్హత సాధించారు. ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ట్రాలూ పోటీ పడ్డాయి. రెండు విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తొలి 10 ర్యాంకులు సమానంగా వచ్చాయి. ఇంజనీరింగ్‌ విభాగంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రి, ఫార్మసీ విభాగంలో ఏపీకే చెందిన అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్‌ ర్యాంకులు తెచ్చుకొని టాప ర్లుగా నిలిచారు. ఈ మేరకు ఈఏపీ సెట్‌ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, వైస్‌ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సెట్‌ కనీ్వనర్‌ డీన్‌కుమార్, కో–కన్వీనర్‌ విజయకుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. 74.98 శాతానికి తగ్గిన అర్హులు టీఎస్‌ఈఏపీ సెట్‌ ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగింది. ఇంజనీరింగ్‌ విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2,54,750 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,40,618 మంది సెట్‌కు హాజరయ్యారు. 1,80,424 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా విభాగంలో రెండు రాష్ట్రాల నుంచి 1,00,432 మంది దరఖాస్తు చేస్తే 91,633 మంది పరీక్ష రాశారు. 82,163 మంది అర్హత సాధించారు. గత రెండేళ్ళతో పోలిస్తే సెట్‌ రాసిన వారి సంఖ్య పెరిగింది. కానీ అర్హత శాతం తగ్గింది. గత ఏడాది (2023) 3,01,789 మంది ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యారు. 2,48,814 (86.31%) మంది అర్హత సాధించారు. ఈ ఏడాది (2024) 3,32,251 మంది రాస్తే, ఇందులో 2,62,587 (74.98%) మంది అర్హత సాధించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కనీస అర్హత మార్కులు లేకపోవడంతో రాసిన అందరూ అర్హులయ్యారు. ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ రాష్ట్ర ఈఏపీ సెట్‌ ఫలితాలను వారం రోజుల్లో ప్రకటించడం అభినందనీయమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌ వెలువడకుండా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే కాలేజీలపై చర్య తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఈ సీట్లను భర్తీ చేసే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. అనుమతి లేకుండా విద్యార్థులను చేర్చుకున్న గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Renu Desai Comments On Pawan Kalyan Fans
వవన్‌ కల్యాణ్‌ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్‌

పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులున్నారు. కానీ వారిలో ఎక్కువమంది శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారని సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుందని చాలామంది అంటారు. పవనిజం ముసుగులో ఇతరులపై భూతులతో దండయాత్ర చేస్తారని కూడా తెలుపుతుంటారు. బ్రో సినిమా విడుదల సమయంలో మదనపల్లిలో ఒక సంఘటన గురించి చూస్తే.. బ్రో మూవీ ఎలా ఉందని కొందరు మీడియా వారు పవన్‌ అభిమానని అడిగిన పాపానికి అతడు బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెబుతూ.. పవన్‌ అభిమానుల్లో కొందరు శాడిస్టులు నిజంగానే ఉన్నారని బహిరంగంగానే నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో రేణు దేశాయ్, పూనమ్ కౌర్ ఇద్దరూ ఏ పోస్టు పెట్టినా సరే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందులోకి దూరిపోతుంటారు. వాళ్లు ఎలాంటి పోస్ట్‌ పెట్టినా సరే తమ నాయకుడి గురించే అంటూ భుజాలు తడుముకుంటారు. ఆపై వెంటనే ట్రోలింగ్‌కు దిగిపోతుంటారు. ఒకవేళ పవన్‌కు పాజిటివ్‌గా పోస్ట్‌ పెడితే ఆ క్రెడిట్‌ అంతా పవన్‌కు ఇచ్చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన గురించే రేణు దేశాయ్‌ ఒక పోస్ట్‌ పెట్టింది.ఇటీవల రేణు దేశాయ్ పలు యానిమల్స్ ఎన్జీవోలకు సహకారం అందిస్తుంది. కుక్కలు,పిల్లుల వంటి జంతువుల రక్షణ కోసం ప్రతి నెల తను కొంత డబ్బు సాయం చేస్తుంది. అందుకు సంబంధించి ఆమె తన ఇన్‌స్టాలో ఒక మెసేజ్‌ చేసింది. రేణు చేస్తున్న సాయాన్ని గుర్తించలేని పవన్‌ అభిమాని ఇలా కామెంట్‌ చేశాడు. పవన్ కల్యాణ్‌ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు. దీంతో రేణూ దేశాయ్‌కి కోపం వచ్చినట్లు ఉంది. అతనికి కరెక్ట్‌ సమాధానంతో ఇచ్చిపడేసింది.ప్రతిసారి నేను పెట్టే పోస్టుల కింద నా ఎక్స్ హస్బెండ్‌తో నన్ను ఎందుకు పోలుస్తున్నారు. ఇలాంటి వాళ్లను చాలామందిని నేను ఇప్పటికే బ్లాక్ చేశాను. పదేళ్ల వయస్సు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సాయం చేస్తున్నాను. జంతువులపై నేను చూపించే ప్రేమ, వాత్సల్యం ఆయనకు లేవు. నా మాజీ భర్త ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయకండి. వ్యక్తిగతంగా నా మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదు. నన్ను నన్నుగా చూడండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి. జంతువుల మీద నాకున్నంత కేర్ గానీ, ప్రేమ గానీ ఆయనకు ఉండదు. అతను నాలాగా యానిమల్స్ పై కేరింగ్ చూపించడు.' అని రేణు చెప్పింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)

RCB Seal Final IPL 2024 Playoff Spot Beating CSK by 27 runs
IPL 2024: సీఎస్‌కేపై ఘ‌న విజ‌యం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన‌ ఆర్సీబీ

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అడుగుపెట్టింది. ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స‌త్తాచాటింది.ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 27 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను బెంగ‌ళూరు ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ఫాప్ డుప్లెసిస్‌(54) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. విరాట్ కోహ్లి(47), ర‌జిత్ పాటిదార్‌(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంత‌రం 219 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 191 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ర‌చిన్ ర‌వీంద్ర‌(61) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌చిన్ ర‌వీంద్ర‌(18 బంతుల్లో 35), ధోని(25) ఆఖ‌రిలో పోరాటం చేశారు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో య‌శ్ ద‌యాల్ రెండు వికెట్లు, మాక్స్‌వెల్‌, సిరాజ్‌, గ్రీన్‌, ఫెర్గూస‌న్ త‌లా వికెట్ సాధించారు.అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడిపోయిన‌ప్ప‌టికి.. ఛేజింగ్‌లో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగుల మార్క్ దాటి ఉంటే ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించి ఉండేది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఆఖ‌రి ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి.ఆర్సీబీ పేస‌ర్ య‌శ్ ద‌యాల్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిత‌న జ‌ట్టుకు అద్బుత‌మైన విజ‌యాన్ని అందించాడు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement