ఆదిబట్ల చైర్మన్‌ ఎన్నికకు గ్రీన్‌సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

ఆదిబట్ల చైర్మన్‌ ఎన్నికకు గ్రీన్‌సిగ్నల్‌

Published Thu, Mar 28 2024 7:05 AM

ఆదిబట్ల మున్సిపల్‌ కార్యాలయం  - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: హైకోర్డు ఆదేశాలతో ఎట్టకేలకు ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు ఎన్నికల కమిషన్‌ పపచ్చజెండా ఊపింది. ఈ మేరకు రంగారెడ్డి కలెక్టర్‌ శశాంక మున్సిపల్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక సమావేశం నిర్వహించి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాలని బుధవారం సూచించారు. ఆదిబట్ల మున్సిపాలిటీలోని 15 వార్డుల కౌన్సిలర్లు గతంలో చైర్‌పర్సన్‌ కొత్త ఆర్తికగౌడ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ కోరే కళమ్మలపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన 13 మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. అనంతరం జనవరి 9వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆర్తికగౌడ్‌, కళమ్మలను తొలగించారు. అప్పటి నుంచి మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పీఠాలు ఖాళీగా ఉంది.

కోర్టు జోక్యంతో..

ఆదిబట్ల మున్సిపాలిటీ కొత్త చైర్మన్‌గా కావడానికి మర్రి నిరంజన్‌రెడ్డి శతవిధాలా ప్రయత్నం చేశారు. సొంత పార్టీకి చెందిన నాయకుడిపై అవిశ్వాసానికి పురిగొల్పడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ సైతం అయ్యారు. ఈ క్రమంలో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పలుమార్లు నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. దీంతో జనవరి 9వ తేదీ నుంచి మార్చి నెల దాటినా నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంతో నిరంజన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం కోర్టు ఆదేశాలతో అధికార యంత్రాంగంలో చలనం మొదలైంది.

మే 6న ఎన్నిక

హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్‌, జిల్లా కలెక్టర్‌ చర్యలు మొదలు పెట్టారు. మే 6న చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాలని కలెక్టర్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్‌ అధికారిని నియమించి మే 4వ తేదీ వరకు అందరి కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. 6వ తేదీ ఉదయం చైర్మన్‌, మధ్యాహ్నం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ తెలిపారు. దీంతో కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

మళ్లీ క్యాంపునకు

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ తొలగించడానికి ఏకంగా 20 రోజుల వరకు క్యాంపు రాజకీయాలు చేశారు. మళ్లీ తేది ప్రకటన కావడంతో క్యాంపులకు వెళ్లే ఆస్కారం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే మర్రి నిరంజన్‌రెడ్డికి స్థానికంగా ఉన్న ఓ బడా ప్రజాప్రతినిధి అనుకూలంగా లేకపోవడంతో ఎవరి పైరవీల్లో వారు నిమగ్నమయ్యారు. ఈ దశలో మళ్లీ క్యాంపులకు వెళ్లక తప్పదని స్థానిక రాజకీయవేత్తలు జోరుగా చర్చించుకుంటున్నారు.

ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ఆదేశం

కలెక్టర్‌కు ఉత్తర్వులు

సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

అన్ని ఏర్పాట్లు చేస్తాం

జిల్లా కలెక్టర్‌, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పని చేస్తాం. అధికారికంగా ఎన్నికకు ఆదేశాలు జారీ చేశారు. 15 మంది కౌన్సిలర్లకు మే 4వ తేదీ వరకు ప్రత్యేక సమావేశం మెమోను అందజేస్తాం. 6న ప్రత్యేక సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

– బాలకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌, ఆదిబట్ల

కోర్టును ఆశ్రయించాం..

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇన్నాళ్లు తేది ఖరారు చేయడంలో జాప్యం జరిగింది. హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయడంతో అధికారుల్లో చలనం వచ్చింది. ప్రభుత్వంలో ఉండి కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 13 మంది కౌన్సిలర్లు నా వెంటే ఉన్నారు.

– మర్రి నిరంజన్‌రెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్‌

1/2

2/2

Advertisement
Advertisement