తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ | Sakshi
Sakshi News home page

తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ

Published Mon, Dec 25 2023 1:18 AM

- - Sakshi

విశాఖపట్నం: పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళ అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఆ కుటుంబ సభ్యులు. జీవన్‌దాన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌, విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గవరపాలెం గ్రామానికి చెందిన వెలమ పూర్ణకుమారి(53) తన కుమారుడుతో ద్విచక్రవాహనంపై ఈనెల 21న విశాఖ వస్తున్నారు.

విశాఖ పోర్టు ఫ్లై ఓవర్‌పై వారి ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో కిందపడిన పూర్ణకుమారి తలకు తీవ్రగాయమై అధిక రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెను రామ్‌నగర్‌లో కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కేర్‌ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి తలకు శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ ఈనెల 23 రాత్రి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు ప్రకటించారు.

మంత్రి అమర్‌నాఽథ్‌ ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయదానం కోసం ప్రోత్సహించగా అంగీకరించారు. జీవన్‌ధాన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రాంబాబుతో మాట్లాడి అవయదాన ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఆమె గుండె, రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, లివర్‌ తొలగించి అవసరమైన వారి కోసం తరలించినట్లు డాక్టర్‌ రాంబాబు తెలిపారు. అవయదానం చేయడానికి ముందుకు వచ్చిన పూర్ణకుమారి కుటుంబ సభ్యులను డాక్టర్‌ రాంబాబు అభినందించారు. పూర్ణకుమారికి భర్త జగదీశ్వరరావు, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement
Advertisement