రికార్డు స్థాయిలో టెస్టులు

15 Jun, 2020 03:53 IST|Sakshi

రాష్ట్రంలో పదిలక్షల జనాభాకు సగటున 10,341 పరీక్షలు

గడిచిన 24 గంటల్లో 15,663 కరోనా టెస్టులు

మహమ్మారి నుంచి కోలుకున్న వారు 3,316 మంది

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,52,202 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రతీ పది లక్షల జనాభాకు సగటున 10,341 మందికి పరీక్షలు నిర్వహించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డులకు ఎక్కింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 15,663 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 294 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,152కు చేరింది.

ఈ కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,107 మంది ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారి కేసులు 204 ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా 131 మంది డిశ్చార్జి అయ్యారు. ఇందులో 48 మంది ఇతర రాష్ట్రాలు, ఒకరు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య  3,316కు చేరింది. రాష్ట్రంలో మరణాల సంఖ్య 88కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,748గా ఉంది. 

మరిన్ని వార్తలు