ఏపీఎన్జీవోలు- ఓయూ జేఏసీ నేతల పోటాపోటీ నిరసనలు

22 Aug, 2013 16:16 IST|Sakshi

ఏపీ ఎన్జీవోలు, ఓయూ జేఏసీ నేతలు పోటాపోటీ నిరసనలకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ ఏడో తేదీన ఎల్బీ స్టేడియంలో భారీగా సమైక్యాంధ్ర సభ నిర్వహించాలని ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు నిర్ణయించారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే.. అదే రోజున అదే ఎల్బీ స్టేడియం వేదిగా మరో భారీ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ సిద్ధమవుతోంది. చలో ఎల్బీ స్టేడియం కార్యక్రమాన్ని ఈనెల ఏడో తేదీన నిర్వహిస్తామని, అందుకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ సెంట్రల్ జోన్ డీసీపీని కలిసింది. ఆరోజు తాము శాంతి ర్యాలీ నిర్వహించి ఎల్బీ స్టేడియానికి వెళ్తామని ఓయూ జేఏసీ నాయకులు డీసీపీకి తెలిపారు.

సమైక్యాంధ్ర కోసం వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న ఏపీ ఎన్జీవోలు తాము హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్నారు. హైదరాబాద్లోనూ భారీ సంఖ్యలోనే సీమాంధ్ర ప్రాంత వాసులు ఉన్నారని, వాళ్ల ప్రయోజనాలను సైతం కాపాడాలని అంటున్నారు. ఇప్పటివరకు విద్యుత్ సౌధ, జలసౌధ లాంటి ప్రాంతాల్లో ఏపీ ఎన్జీవోలు - టీఎన్జీవోల మధ్య పలు సందర్భాల్లో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కానీ, నేరుగా ఇలా బహిరంగ సభలలో కూడా పోటాపోటీగా వ్యవహరించడం మాత్రం ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు తొలిసారిగా అలాంటి దృశ్యం కూడా ఆవిష్కృతం అవుతుందో.. లేదా పోలీసులు ఎవరో ఒకరికి అనుమతి నిరాకరించి అడ్డుకుంటారో చూడాల్సిందే.

మరిన్ని వార్తలు