అఖిలప్రియపై కోర్టుకెక్కిన సోదరుడు!

23 Nov, 2019 14:54 IST|Sakshi

భూ వివాదమే కారణం

విక్రయించిన స్థలంపై వాటా కోరుతూ కేసు

అవన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేసిన జగత్‌విఖ్యాత్‌రెడ్డి 

అయితే ఒకే ఇంట్లో ఉంటూ కేసు దాఖలుపై కొనుగోలుదారుల్లో అనుమానాలు 

సాక్షి, ఆళ్లగడ్డ:  భూ వివాదానికి సంబంధించి టీడీపీ నేత భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇద్దరు అక్కల నుంచి తనకు న్యాయం చేయాలంటూ ఈనెల 14న రంగారెడ్డి జిల్లా అదనపు కోర్డులో కేసు దాఖలు చేసి ప్రతివాదులకు నోటీసులు పంపించారు. భూమా శోభా నాగిరెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం మంచిరేవులలో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని ఆమె మృతి అనంతరం 2016లో దాదాపు రూ.2 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అప్పట్లో భూమా నాగిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు ఆఖిలప్రియ, మౌనికారెడ్డి దీనిపై సంతకాలు చేయగా తనయుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి వేలిముద్ర వేశాడు. ప్రస్తుతం ఆ స్థలం విలువ రెట్టింపు అయింది. 

అయితే స్థలం అమ్మే సమయానికి తాను మైనర్‌నని, తనకు ఏమీ తెలియని వయసులో తండ్రితో పాటు సోదరిలిద్దరూ కలిసి విక్రయించారని, ఇప్పుడు తన వాటాగా మూడో భాగం కావాలని కోరుతూ జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కలతో పాటు భూమిని కొనుగోలు చేసిన హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి, వెంకటహరిత చీమల, సుబ్బరాయ ప్రఫుల్ల చందు రేటూరి, సయ్యద్‌ ఎతేష్యామ్‌ హుస్సేన్, పశ్చిమ గోదావరికి చెందిన ప్రవీణ రంగోలను ప్రతివాదులుగా పేర్కొన్నాడు. 

కాగా జగత్‌విఖ్యాత్‌రెడ్డి తరపున అఖిలప్రియ మరిది (భార్గవరామ్‌ తమ్ముడు) శ్రీసాయి చంద్రహాస్‌ కేసు వేశారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటూ కోర్టును ఆశ్రయించడం పట్ల కొనుగోలుదారులు అఖిలప్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.  అయితే తన సోదరుడు తమపై కేసు వేయలేదని అఖిలప్రియ అన్నారు. భూ విక్రయంపై కొనుగోలుదారులు కోర్టుకు వెళ్లారని, అందులో భాగంగా తమకు తాఖీదులు వచ్చాయన్నారు. 

మరోవైపు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవంటూ ఓ వీడియో విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రస్తుతం సోదరి అఖిలప్రియతో కలిసి దుబాయ్‌లో ఉన్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు