రేటొచ్చిందని అదే పంట వేశారు

4 May, 2017 02:22 IST|Sakshi
రేటొచ్చిందని అదే పంట వేశారు

అందువల్లే ఈ పరిస్థితి వచ్చింది
మిర్చి ధర పతనంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్య
రైతులకు ఏ ఇబ్బందీ లేకుండా చేశామన్న ముఖ్యమంత్రి
ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటి.. పెండింగ్‌ అంశాలపై చర్చ
నేటినుంచి సీఎం బృందం అమెరికా పర్యటన


సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ‘‘ఒక్కోసారి వాణిజ్య పంటలు అధికంగా వచ్చినప్పుడు సంక్షోభం కూడా వస్తుంది. గతేడాది మిరపకు బాగా రేటు వచ్చిందని ఈ ఏడాది అందరూ అదే పంట వేశారు. అందువల్లే ఈ పరిస్థితి వచ్చింది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మిర్చి ధర పతనంపై వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనకోసం గురువారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి పయనమవుతున్న సీఎం బుధవారం దేశ రాజధానిలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. అనంతరం ఏపీభవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మిర్చి ధర పడిపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. ఆయన పైవిధంగా స్పందించారు.

మిర్చి రైతుల్ని ఆదుకునేందుకే తాము క్వింటాలుకు రూ.8 వేల ధర నిర్ణయించి.. ఒకవేళ అంతకంటే తగ్గిపోతే ఒక్కో క్వింటాలుకు రూ.1,500 చొప్పున ప్రయోజనం కల్పించామని చెప్పుకొచ్చారు. ఒక్కో రైతు వద్ద 20 క్వింటాళ్ల వరకు కొంటామన్నారు. కేంద్రం రూ.5 వేల వరకు కొనమని చెప్పిందని, అయితే అది రైతుకు గిట్టుబాటు కాదని, అందుకే తామిచ్చే బోనస్‌లోనూ చెరి సగం పెట్టుకుందామని కోరామని.. కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. మిర్చి రైతులకు మద్దతుగా వైఎస్‌ జగన్‌ చేసిన దీక్షను మీడియా ప్రస్తావించగా.. చంద్రబాబు ప్రతిపక్ష నేతపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

‘‘ఆయనకేమైనా అవగాహనుందా? వ్యవసాయం తెలుసా ఆయనకు? ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని వ్యక్తి. వ్యవసాయమంటే తెలియని వ్యక్తి. ఒక పద్ధతి, ఒక ప్రక్రియ తెలియదు. కాకిలెక్కలు చెప్పి కబుర్లు చెబుతున్నాడు’’ అంటూ మండిపడ్డారు. ‘‘ఈ సంవత్సరం వర్షం పడలేదు. అయినా ఎక్కడాలేని రీతిలో 14 శాతం వృద్ధిరేటు వచ్చింది. 28.4 శాతం వర్షపాతం తక్కువగా ఉన్నా ఇంత వృద్ధి సాధించాం. వాటర్‌ మేనేజ్‌మెంట్‌ చేశాం. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ చేశాం. కాంగ్రెస్‌ హయాంలో వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు. ఫలితంగా రైతులు సంక్షోభం ఎదుర్కొన్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం’’ అని అన్నారు.

కేంద్రమంత్రులతో భేటీ
అంతకుముందు చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, పర్యావరణ మంత్రి అనిల్‌ మాధవ్‌ దవే, కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌లను కలిశారు. నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవిం ద్‌పనగారియాతోనూ భేటీ అయ్యారు. ఈ భేటీలపై సీఎం వివరిస్తూ.. రాష్ట్రానికి చట్టపరంగా ఇవ్వాల్సిన పెండింగ్‌ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని జైట్లీని కోరామని చెప్పారు. రాష్ట్రానికివ్వాల్సిన బకాయిలను విడుదల చేయాల్సిందిగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కోరినట్టు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో సీజ్‌ చేసిన వాటిని అమ్ముకునేందుకు అనుమతులు, తదితర అంశాల గురించి పర్యావరణమంత్రితో చర్చించినట్టు వెల్లడించారు.

అమెరికా పర్యటనపై..
అమెరికా పర్యటనలో 300 మంది సీఈవోలను కలుస్తానని సీఎం చెప్పారు. గతంలో సీఎం అయినప్పుడు అమెరికా అంతా తిరిగి ఐటీ కంపెనీల్ని హైదరాబాద్‌ తీసుకొచ్చానన్నారు. ఈసారీ అందర్నీ కలుస్తానన్నారు. ఇండియా–అమెరికన్‌ చాంబర్స్‌ సంస్థ మోస్ట్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ సీఎంగా అవార్డు ఇస్తోందని, దానిని స్వీకరించబోతున్నానని వివరించారు. ఆపిల్‌ కంపెనీ రాష్ట్రానికి రావడంపై మీడియా ప్రస్తావించగా.. ఏ ప్రాజెక్టయినా సాకారం కాకముందే చర్చకు వస్తే సదరు కంపెనీలకు ఇబ్బంది ఉంటుందని ఆయన బదులిచ్చారు. విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి పాల్గొన్నారు.

 కాగా, సీఎం చంద్రబాబు గురువారం తెల్లవారుజామున ఢిల్లీనుంచి అమెరికాకు పయనమవుతారు. రాత్రి ఏడున్నర గంటలకు శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ నెల 11 వరకు వాషింగ్టన్‌ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగో తదితర నగరాల్లో పర్యటించనున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌సహా 16 మంది సభ్యుల బృందం సీఎం వెంట ఆమెరికా వెళ్లింది.

మరిన్ని వార్తలు