వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు యాప్‌

7 Apr, 2020 02:20 IST|Sakshi

చీని, బొప్పాయి, అరటి, మామిడి, టమాటా రైతులకు ఇబ్బందులు రాకూడదు 

కోవిడ్‌–19 నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం  

ఆక్వా రైతులకు నష్టం చేకూర్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి 

ఆక్వా ఫీడ్, సీడ్‌పై నియంత్రణ, పర్యవేక్షణ కోసం బిల్లు తెస్తాం 

మే 31 నాటికి రైతు భరోసా కేంద్రాల కార్యకలాపాలు 

సాక్షి, అమరావతి: వ్యవసాయం, ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై వారంలో ప్రత్యేక యాప్‌ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ నేపథ్యంలో లాక్‌ డౌన్‌ అమల్లో ఉన్నందున పంటలకు ధరల కల్పన, రైతుల ఉత్పత్తుల కొనుగోళ్ల తీరు తెన్నులపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల ద్వారా పంటలు, వాటి పరిస్థితి, ఉత్పత్తి, ధరలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రియల్‌ టైంలో తెలుసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ వారంలోగా ఇందుకు సంబంధించిన యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలు, సీఎం సూచనలు ఇలా ఉన్నాయి.  

► చీని, బొప్పాయి, అరటి, మామిడి, టమాటా రైతులకు ఇబ్బందులు రాకూడదు. ఈ దిగుబడులు బయటి రాష్ట్రాలకు, రాష్ట్రంలోని మార్కెట్లలోకి రావడానికి చర్యలు తీసుకోవాలి. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ప్రస్తుత విపత్తు సమయంలో వారికి సహాయం చేసే విషయంలో నూటికి 110 శాతం అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది.   
► తూర్పుగోదావరి, అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఆయా పంటల దిగుబడి ఎక్కువ. ప్రత్యేకంగా దృష్టి సారించాలి. రైతు బజార్లు, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రయోగాత్మకంగా పంటల ఉత్పత్తులను విక్రయించే అవకాశం కల్పిస్తున్నాం. దీన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. 
► పంట నూర్పిడిలో ఇబ్బందులు రాకుండా పలు రాష్ట్రాల నుంచి హార్వెస్టర్‌లను తెప్పిస్తున్నాం. 
► కోవిడ్‌ –19 రెడ్‌ జోన్లలో ఉన్న కర్నూలు, గుంటూరుల్లోని మార్కెట్‌ యార్డులను తాత్కాలికంగా వేరే చోటుకు తరలించాలి. 
► ఆక్వా రైతులకు నష్టం చేకూర్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బెంగాల్, అసోం, బిహార్‌ లాంటి రాష్ట్రాలకు చేపలు రవాణా చేయడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలి. ఆక్వా దాణా రేట్లపై కూడా దృష్టి పెట్టాలి. ఫీడ్, సీడ్‌పై నియంత్రణ, పర్యవేక్షణ కోసం అసెంబ్లీలో బిల్లు తీసుకొస్తాం.  
► మే 31 నాటికి రైతు భరోసా కేంద్రాల కార్యకలాపాలు ప్రారంభం కావాలి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు