24 గంటల్లోనే పూర్తి సేవలు

9 May, 2020 02:33 IST|Sakshi
ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ​​​​​​​

మరింత గొప్పగా టెలిమెడిసన్‌  

కోవిడ్‌ నివారణ చర్యలు, పంటల మార్కెట్‌పై సమీక్షలో సీఎం జగన్‌ 

పీహెచ్‌సీలలో బైక్‌లు,థర్మో బ్యాగ్‌లు అందుబాటులో ఉంచాలి 

క్వారంటైన్‌ కేంద్రాలు బాగుండేలా చూడాలి 

10 వేల టన్నుల బత్తాయి కొనుగోలుకు సిద్ధమవ్వాలి

రైతు భరోసాకు ఇంకా అర్హులెవరైనా ఉంటే 10లోగా దరఖాస్తు చేసుకోవాలి 

రాష్ట్రంలో మరో ఫిషింగ్‌ హార్బర్, రెండు ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు

విదేశాల్లో చిక్కుకుపోయిన వారు దేశంలోకి రావడం ప్రారంభమైంది. గల్ఫ్‌ నుంచే కాకుండా యూకే, యూఎస్‌ నుంచి కూడా కొంత మంది వచ్చే అవకాశం ఉంది. వారికీ షెల్టర్లు, క్వారంటైన్‌ సదుపాయాలు బాగుండేలా చూడాలి.  

డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌ ఇవ్వగానే 24 గంటల్లోగా మందులు అందేలా చూడాలి. దీని కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బందికి బైకు, థర్మో బ్యాగు అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు అవసరమైన బైక్‌లు కొనుగోలు చేయాలి.  

సాక్షి, అమరావతి: టెలి మెడిసిన్‌ సేవలను మరింత విజయవంతంగా అందించేందుకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఫోన్‌ చేసిన 24 గంటల్లోనే పూర్తి వైద్య సేవలు అందాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా బైక్‌లు, థర్మో బ్యాగ్‌లు వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. కోవిడ్‌ యేతర కేసులు ప్రతి రోజూ ఎన్ని వస్తున్నాయన్న దానిపై వివరాలు సమర్పించాలని ఆదేశించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, విదేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్‌ వసతులు, పంటల మార్కెట్, ధరలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 

పడకల పెంపుపై దృష్టి సారించాలి 
► నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న 75 వేలకు పైగా పడకలను ముందస్తుగా వినియోగించుకోవాలి. వాటి సంఖ్యను 1 లక్ష వరకు పెంచాలి. మిగిలినవి స్పేర్‌లో ఉంచాలి. వాటన్నింటిలో ఏ లోటు లేకుండా సదుపాయాలు మెరుగు పరచడంపై దృష్టి పెట్టాలి.  
► కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారందరికీ పరీక్షలు పూర్తి చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.   

రైతులకు నష్టం రాకుండా చూడాలి
► 10 వేల టన్నుల బత్తాయిల కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. బయటి మార్కెట్లు పూర్తిగా తెరుచుకోనందున ఎక్కడికక్కడ స్థానికంగా విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రిటైల్‌ అమ్మకాల్లో ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వాలన్న అధికారుల సూచనకు సీఎం అంగీకరించారు.  
► రాష్ట్రంలో పసుపు, మొక్కజొన్నకు కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుండగా, పక్క రాష్ట్రాలలో ఆ మేరకు ధర లేకపోవడంతో అక్కడి నుంచి కొందరు ఆ పంటలు తీసుకువస్తున్నారని అధికారులు వివరించారు.  
కరోనా కష్టాల్లోనూ రాష్ట్రానికి చెందిన రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించి మనం కొనుగోలు చేస్తుంటే, పక్క రాష్ట్రాల నుంచి పసుపు, మొక్కజొన్న వస్తే ఇక్కడి రైతులకు నష్టం కలుగుతుందని, ఈ విషయంపై దృష్టి సారించండని సీఎం సూచించారు.  

అదనంగా ఫిషింగ్‌ హార్బర్, ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు 
► విజయనగరం జిల్లాలో ఒక ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుకు సీఎం అనుమతించారు. రాష్ట్రంలో మొత్తం 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నారు.  
► విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, నక్కపల్లిలో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో మూడు చోట్ల ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయి.  
► ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

రైతుల పాస్‌లు అనుమతించాలి 
► ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే పాస్‌లు అనుమతించాలని సీఎం అధికారులకు సూచించారు.  
► ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు. ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  
► రైతు భరోసా లబ్ధిదారులపై సామాజిక తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ పథకానికి ఇంకా అర్హులెవరైనా మిగిలిపోయి ఉంటే 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రచారం చేయాలని చెప్పారు. ఆ మర్నాడు గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించాలన్నారు. 
► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెరుచుకుంటున్న దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలి. మాస్క్‌లు ధరించేలా అవగాహన కల్పించాలి. ఇప్పటి దాకా 6 కోట్లకు పైగా మాస్క్‌లు పంపిణీ చేశామని అధికారులు వివరించారు. ప్రతి రోజూ 42 లక్షల మాస్క్‌లు తయారవుతున్నాయన్నారు.  

మరిన్ని వార్తలు