రాజధాని నిర్మాణానికి సహకరించండి

22 Mar, 2015 02:00 IST|Sakshi

విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో కలెక్టర్ బాబు.ఎ
 
విజయవాడ : నూతన రాజధాని అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, కృష్ణాజిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో శనివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ ప్రసంగించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం సమష్టిగా కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. మునిసిపల్ కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాను స్మార్ట్‌సిటీగా మార్చటానికి ప్రజలు కృషి చేయాలన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ కొండపల్లి అనసూయ, కాకు మల్లికార్జున యాదవ్, సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు తదితరులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు సభలో ఎంపీ కేశినేని నాని పాల్గొని ప్రసంగించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నాదస్వరం, వేదపఠనం, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం జరిగాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు వలివేటి శివరామకృష్ణ, ఆచార్య తమ్మారెడ్డి నిర్మల, సీహెచ్ బృందావనరావు, వి.ఉమామహేశ్వరి, పింగళి వెంకట కృష్ణారావు, పాణిగ్రాహి రాజశేఖర్, అవనిగడ్డ సూర్యప్రకాష్, మేరీ కృపాబాయి, ఎరుకలపూడి గోపీనాథరావు, కాటూరి రవీంద్ర త్రివిక్రమ్, కవయిత్రి శైలజ తదితరులు తమ కవిత్వంతో ఆకట్టుకున్నారు.

పలువురు విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో అలరించారు. అనంతరం అతిథులకు ఉగాది పచ్చడి అందజేశారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా వ్యాఖ్యాతగా వ్యవహరించగా, జిల్లా పౌరసంబంధాల అధికారి కె.సదారావు పర్యవేక్షించారు. నగర పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించుకున్న వారికి, ఈ-పోస్ విధానం అమలుచేస్తున్న డీలర్లకు ప్రభుత్వం పురస్కారాలు అందజేసింది.

రాజధాని నిర్మాణాం, కలెక్టర్ బాబు.ఎ, సహకరించండి,

 

మరిన్ని వార్తలు