మరో 18 కరోనా పాజిటివ్‌ కేసులు

11 Apr, 2020 03:53 IST|Sakshi

రాష్ట్రంలో 381కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

గుంటూరులో 7, తూ.గో.లో 5 నమోదు

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 77కి చేరిన కేసులు.. రెడ్‌ జోన్లపై అప్రమత్తం

పాజిటివ్‌ వ్యక్తుల సన్నిహితులు క్వారంటైన్‌కు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 381కి చేరింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 7, తూర్పు గోదావరిలో 5, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో రెండేసి కేసులు చొప్పున వెలుగులోకి వచ్చాయి. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 77కు చేరగా గుంటూరు జిల్లాలో 58కి పెరిగాయి. కరోనా పాజిటివ్‌గా నిర్థారించిన బాధితుల నివాస ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వారితో సన్నిహితంగా ఉన్నవారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారు నివసిస్తున్న ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రకటిస్తోంది. 

చికిత్స పొందుతున్న వారు 365
రాష్ట్రంలో ప్రస్తుతం 365 యాక్టివ్‌ కరోనా పాజిటివ్‌ కేసులున్నాయి. 10 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి కాగా ఆరుగురు మరణించారు. 24 గంటల వ్యవధిలో 892 శాంపిళ్లు పరిశీలించగా 17 కేసులు పాజిటివ్‌గా, 875 కేసులు నెగిటివ్‌గా తేలినట్లు శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కరోనాను జయించాడు
– ఆస్పత్రి నుంచి విజయవాడ యువకుడు డిశ్చార్జి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మనోధైర్యంతో పోరాడిన విజయవాడకు చెందిన మరో యువకుడు కరోనాని జయించాడు. స్వీడన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న బాధితుడు మార్చి 17న నగరానికి వచ్చాడు. 25వతేదీన జలుబు, దగ్గు, జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలడంతో 15 రోజులపాటు చికిత్స అందించారు. అనంతరం రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జి చేసినట్లు కోవిడ్‌ 19 చికిత్సా కేంద్రం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎన్‌. గోపీచంద్‌ తెలిపారు. ఇప్పటికే నగరానికి ఇద్దరు యువకులు కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని వివరించారు. ఆస్పత్రిలో తనకు అందించిన వైద్య సేవలకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.

>
మరిన్ని వార్తలు