మా చేతగాని తనంగా తీసుకోవద్దు: సీపీ

9 Apr, 2020 16:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అరగంటలో పరిస్థితిని అదుపులోకి తీసుకొనే శక్తిసామర్ద్యాలు పోలీసులకు ఉన్నాయని విజయవాడ  నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీసుల శాంత స్వభావాన్ని చేతగానితనంగా భావిస్తే చర్యలు తీసుకోవగడం తప్పదని హెచ్చరించారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇంటిపట్టునే ఉండి ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. మొత్తం ఢిల్లీ వెళ్లిన వారు 35 మంది ఉండగా వారిలో ఏడుగురికి కరోనా వైరస్‌ పాజిటివ్, వారితో కాంటాక్ట్ అయిన 10 మందికి కరోనా సోకిందన్నారు. ఢిల్లీ వారితో ప్రైమరీ, సెకండరీ కంటాక్టు అయిన 830 మందిని గుర్తించామన్నారు. వీరందర్ని గృహ నిర్బంధంలో ఉంచి నిఘాపెట్టటం జరిగిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కంటే పెద్ద సవాల్‌ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. సంయమనంతో ప్రజారోగ్యాన్ని కాపాడే పనిలో ఉన్నామని మాటవినకుండా మొండికేస్తే కన్నెర్ర చేయక తప్పదంటున్నారు.  (ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు)

సీపీ గురువారం బెజవాడ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సేఫ్టీ టెన్నెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ‘ఈ టన్నెల్ మధ్య నుంచి నడవటం వల్ల వైరస్ పోతుంది. ఒక్కో టన్నెల్ లక్షన్నర వ్యయం అవుతుంది. అయితే అన్ని పోలీస్ స్టేషన్లలో ఇలా పెట్టడం కష్టం. అందుకే మా టెక్నీకల్ సిబ్బంది తయారు చేసిన మోడల్‌తో పాటు, ఫంక్షన్లలో పెర్ఫ్యూమ్ కొట్టే యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్స్‌తో కూడిన కిట్స్ ఇస్తున్నాం. బెజవాడ కమిషనరేట్‌ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయం. (ప్రతి తలుపూ తట్టండి: సీఎం జగన్)

అలాగే నగరంలో ఆరు రెడ్‌ జోన్లుగా నిర్ణయించాం. భవనీపురం, పాత రాజరాజేశ్వరి పేట, రాణిగారితోట, ఖుద్దుస్‌ నగర్‌, పాయకాపురం, సనత్‌ నగర్‌లో రెడ్‌ జోన్లు అమలు చేస్తున్నాం. ఈ రెడ్‌జోన్లలో ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ కూడా ఎవరూ బయటకు రావడానికి అనుమతి లేదు. రెడ్‌ జోన్లలో మున్సిపల్‌ సిబ్బంది ద్వారా, వాహనాల ద్వారా నిత్యావసర వస్తువులు ఇంటింటికి పంపుతాం. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా నిత్యావసర వస్తువుల పంపిణీకి దూరంగా ఉండాలి. అనుమతి తీసుకుని మాత్రమే పంపిణీ చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారిపై చర్యలు తప్పవు. కొందరు సామాజిక దూరం పాటించడం లేదని మా దృష్టికి వచ్చింది. నిత్యావసర వస్తువులను ఇప్పటికే ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. (వేగంగా మూడో విడత సర్వే)

ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లిన  ఓ యువకుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ కుటుంబంలో మొత్తం ఏడుగురికి కరోనా సోకింది.. ఆ తర్వాత  యువకుడు తన తండ్రిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు ప్యారిస్‌ నుంచి విజయవాడకు వచ్చిన ఓ విద్యార్థి హోం ఐసోలేషన్‌లో ఉండగా.. అతడికి జ్వరం రావడంతో నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. రక్త పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలింది. క్వారంటైన్‌లో చేరాడు. అతని తల్లిదండ్రులిద్దరికీ నెగటివ్‌ వచ్చింది. ఈ రెండు కేసుల్లో జాగ్రత్తలు తీసుకోవడం.. తీసుకోకపోవడం వల్ల జరిగిన లాభనష్టాలను ప్రజలందరూ గుర్తించాలి.’ ‘మీ భద్రత.. మా బాధ్యత కనుక చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ లాక్‌డౌన్‌ నిబంధనల్ని పాటించండి. కాదంటే కఠిన చర్యలు తీసుకుంటాం..’ అని నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. (మానవత్వాన్ని చాటుకుంటున్న సామాన్యులు)

మరిన్ని వార్తలు