8కి చేరిన కరోనా కేసులు

25 Mar, 2020 04:36 IST|Sakshi

లండన్‌ నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి యువకుడికి పాజిటివ్‌

తిరుపతి స్విమ్స్‌ ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో నిర్ధారణ

సాక్షి, అమరావతి/చిత్తూరు : రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. ఇటీవల లండన్‌ నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చిన యువకుడికి తిరుపతి స్విమ్స్‌లో చేసిన పరీక్షల్లో వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 251 నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా, 229 కేసుల్లో కరోనా లేదని తేలింది. మరో 14 కేసుల విషయంలో నివేదికలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

కరోనా అలర్ట్‌
కరోనా వ్యాప్తి చెందకుండా నిత్యం మనం జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఒక్కోసారి నిత్యావసరాలకు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. లేదా ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తి వస్తుంటారు. అలాంటప్పుడు ఈ వైరస్‌ వచ్చే అవకాశం ఉంది. ఇలా జరక్కుండా సోషల్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ నిపుణులు చేస్తున్న సూచనలు ఇవీ...

- కూరగాయలు ఇంటికి తీసుకురాగానే శుభ్రంగా కడగాలి. తేమ ఆరిపోయాకే ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. కూరగాయలు కడిగాక చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
- పాల ప్యాకెట్లు తీసుకురాగానే వాటిని ఓపెన్‌ చెయ్యకముందే నీటిలో కడగాలి. పాలు గిన్నెలో పోశాక ఆ కవర్లను మూత వున్న డస్ట్‌బిన్‌లో పడేయాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- మన ఇంటికి ఎవరైనా వస్తే శానిటైజర్‌ ఇచ్చి చేతులు శుభ్రం చేసుకోమని చెప్పాలి. కాళ్లు, చేతులు కడుక్కుని ఇంట్లోకి రావాలని సూచించాలి. 
- అతిథులకు కాఫీ, టీ వంటివి కప్పులు, గ్లాసుల్లో కాకుండా ప్లాస్టిక్‌ కప్పుల్లో ట్రేలో పెట్టి ఇవ్వాలి. తర్వాత ఆ కప్పులను మూత వున్న డస్ట్‌బిన్‌లో పడేయాలి.
- పాలు, లేదా కూరగాయలకు వెళుతున్నప్పుడు బయటి బ్యాగులు కాకుండా మన ఇంట్లో నుంచే క్లాత్‌ బ్యాగులు తీసుకెళ్లాలి. ఆ తర్వాత దాన్ని సబ్బు నీటిలో ఉతికి ఆరేయాలి.
- మన ఫోన్‌ను ఎక్కడెక్కడ పెడుతున్నామో చూసుకుని, ఇంటికొచ్చాక దాన్ని న్యాప్‌కిన్‌తో శుభ్రంగా తుడవాలి. ఆ న్యాప్‌కిన్‌ను మూత ఉన్న డస్ట్‌బిన్‌లో పడేయాలి.
- కారు డ్రైవర్, పని మనుషులకు నిత్యం శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలి. 
- ఇంట్లో గర్భిణులు, వృద్ధులు,చిన్నారులు ఉంటే వారు బయటకు రాకుండా చూడాలి. కొత్త వారెవరూ వారితో కలవకుండా జాగ్రత్త పడాలి. 

మరిన్ని వార్తలు