కరోనా: వేగంగా పరీక్షల ఫలితాలు

18 Apr, 2020 08:56 IST|Sakshi
తెనాలి జిల్లా వైద్యశాలలో కరోనా పరీక్షలు చేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లు   

జిల్లా వ్యాప్తంగా 126కి చేరిన  కేసుల సంఖ్య  

గుంటూరు నగరంలోనే 93 కేసులు 

త్వరలో అందుబాటులోకి ర్యాపిడ్‌ టెస్టులు 

నేటి నుంచి జిల్లాలో కరోనా పరీక్షల వేగం పుంజుకోనుంది. శాంపిళ్లకు సంబంధించిన ఫలితాలు వాయు వేగంగా రానున్నాయి. ఇప్పటికే జిల్లాలోని గుంటూరు, తెనాలి, మాచర్ల, నరసరావుపేటలప్రాంతాల్లో  ట్రూనాట్‌ మిషన్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 18 మిషన్ల ద్వారా కరోనా పరీక్షలు చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకి 200 లోపు ఫలితాలు మాత్రమే వస్తున్నాయి. ఇక నుంచి రోజుకి 760 శాంపిళ్ల ఫలితాలు రానున్నాయి. పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్ట్‌లు, అనుమానిత లక్షణాలు ఉన్న వారి శాంపిళ్లు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల రాకలో జాప్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

సాక్షి, గుంటూరు: జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల వేగం సైతం పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శాంపిళ్లు సేకరించి ఫలితాలు త్వరగా వచ్చేలా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకి  1000 నుంచి 1200 శాంపిళ్లు తీస్తున్నారు. ల్యాబ్‌ల సామర్థ్యం పెంపు, ఆధునిక పరికరాల  వల్ల ఇక నుంచి రోజుకి 760 శాంపిళ్ల ఫలితాలు తీయనున్నారు.

గుంటూరు, తెనాలి, మాచర్ల, నరసరావుపేటల ప్రాంతాల్లో ట్రూనాట్‌ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా రోజు 360 కరోనా పరీక్షా ఫలితాలు రానున్నాయి. ప్రస్తుతం గుంటూరు మెడికల్‌ కళాశాల ల్యాబ్‌లో 200 కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉండగా, దాని సామర్థ్యాన్ని 400కు పెంచే దిశగా ఏర్పాట్లు చేశారు. ర్యాపిడ్‌ టెస్టులకు సంబంధించి విజయవాడలో శుక్రవారం డాక్టర్లకు శిక్షణ ఇచ్చారు. మంగళవారం నాటికి జిల్లాలో రాపిడ్‌ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి.   

గుంటూరు నగరంపై ప్రత్యేక దృష్టి..
గుంటూరు నగరంలో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఇప్పటికే జిల్లాలో 126 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వాటిలో 93 కేసులు గుంటూరు నగరంలోనే ఉన్నాయి. శుక్రవారం నమోదైన పాజిటివ్‌ కేసులు మూడు గుంటూరు నగరంలోనే ఉండటం విశేషం. ఈ కేసులు ఆనందపేటలో ఒకటి, సంగడిగుంటలో రెండు నమోదయ్యాయి. మరో కేసు పొన్నూరులో నమోదైంది. ప్రధానంగా గుంటూరు నగరంలోని ఆనందపేటలో 25కు పైగా కేసులు, కుమ్మరిబజారులో  20కుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆప్రాంతాలపైన అధికారులు  ప్రత్యేకంగా దృష్టి  సారించారు.

రెడ్‌జోన్లలో కరోనా పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్ట్‌లు, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారి శాంపిళ్లు తీసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. నగరపాలక సంస్థ ఏర్పాటు  చేసిన కమిటీ సభ్యుల సహకారంతో వారు మత పెద్దలతో చర్చించి కరోనా వ్యాప్తి రాకుండా ఉండేందుకు వీలుగా మసీదుల నుంచి మైక్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్‌ ఉన్నవారు  క్వారెంటైన్‌ సెంటర్లకు తరలివెళ్లాలని, పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.   

హోం క్వారంటైన్‌కు తరలించే  ఏర్పాటు..
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 21 క్వారెంటైన్‌ సెంటర్లలో 1800 మందికిపైగా ఉన్నారు. వారిలో 14 రోజుల క్వారెంటైన్‌ పూర్తి చేసుకున్న వారు 360 మంది ఉన్నారు. వారికి కరోనా టెస్టులు చేశారు. ఆ ఫలితాలు రాగానే వారందరిని హోం క్వారంటైన్‌కు తరలించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం ట్రానార్ట్‌ కిట్‌ల ద్వారా 89 పరీక్షలు చేయగా, ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. శుక్రవారం రోజు 211 మందికి పరీక్షలు చేయగా, అందులో కేవలం  ఒక్క పాజిటివ్‌ మాత్రమే రావడం కొంత ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం తీసిన శాంపిళ్లకు సంబంధించిన ఫలితాలు రెండురోజుల్లో రానున్న దృష్ట్యా కరోనా వ్యాప్తికి సంబంధించి ఓ అవగాహన వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నాం
కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తిని కలిసిన వారు, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షల సామర్థాన్ని పెంచుతున్నాం. కరోనా పాజిటివ్‌ కేసుల ఆధారంగా రెడ్, ఆరంజ్, గ్రీన్‌జోన్లుగా విభజిస్తున్నాం.  – ఐ. శామ్యూల్‌ ఆనందకుమార్, కలెక్టర్‌   


మాచర్లలో కరోనా పరీక్షల కేంద్రం ప్రారంభం 
మాచర్ల : రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని, దీని వల్ల ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండవచ్చునని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో రూ. 10 లక్షల విలువైన నూతన ఆధునీకరణ యంత్రాలతో శుక్రవారం కరోనా టెస్టు నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని జిల్లా నోడల్‌ అధికారి రమేష్‌, స్పెషలాఫీసర్‌ శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పేదలు ఇబ్బందులు పడకుండా చూస్తుందన్నారు. కొందరు దీనినీ రాజకీయం చేయటం మంచిది కాదన్నారు. మాచర్ల పట్టణంలో మొదట ఐదు కేసులు వచ్చినా లాక్‌డౌన్‌ వలన నియంత్రణ చర్యలు పెరిగి అధికారుల కృషితో ఒక్క కేసు కూడా రాకపోవటం ఎంతో  సంతోషించదగ్గ విషయమన్నారు.  
 

కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  పీఆర్కే
 

మే 3 వరకు ఏఎన్‌యూకి సెలవులు
ఏఎన్‌యూ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి మే నెల 3వ తేదీ వరకు సెలవులు ప్రకటించామని రిజి్రస్టార్‌ ఆచార్య కె. రోశయ్య తెలిపారు. యూనివర్సిటీ కళాశాలలు, కార్యాలయాలు, ఒంగోలు పీజీ సెంటర్, యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు అన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయన్నారు. యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తమ హెడ్‌ క్వార్టర్‌లోనే ఉండాలని,  అవసరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. యూనివర్సిటీలోని అత్యవసర సేవలకు చెందిన విద్యుత్, నీటి సరఫరా, సెక్యూరిటీ, శానిటరీ, హెల్త్‌ సెంటర్‌ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులందరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ యథాతథంగా విధుల్లో పాల్గొనాలని కోరారు. 

మరిన్ని వార్తలు