‘పట్టాభి’ మనుమరాలికీ తప్పని నోట్ల తిప్పలు

3 Dec, 2016 01:59 IST|Sakshi
‘పట్టాభి’ మనుమరాలికీ తప్పని నోట్ల తిప్పలు

సాక్షి, విశాఖపట్నం: పెద్దనోట్ల కష్టాలు చివరకు బ్యాంకు వ్యవస్థాపకుడు వారసురాలికి కూడా తప్పలేదు. దేశంలోనే ప్రముఖ జాతీయ బ్యాంకుల్లో ఒకటైన ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు బీ.పట్టాభిసీతారామయ్య మనుమరాలైన బీవీ మహాలక్ష్మి(75) తన భర్త పింఛన్ తీసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఫిషరీస్ శాఖలో పనిచేసిన భర్తకు పింఛన్ రూ.24 వేలు వస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంలలో పరిమితి విధించడంతో మనుమడిని అక్కయ్యపాలెంలోని ఆంధ్రా బ్యాంకుకు పంపింది.

మహాలక్ష్మిని చూడకుండా డబ్బు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు చెప్పడంతో కుమార్తె, మనుమడి సాయంతో బ్యాంకుకొచ్చి మెట్లు ఎక్కలేక బయటే కూర్చుండిపోరుుంది. ఆమె మనుమడు లోపలకు వెళ్లి బ్యాంకు సిబ్బందిని బయటకు పిలుచుకుని వచ్చాడు. వారు ఆమెను చూసి.. పింఛన్ రికార్డులను పరిశీలించి చేతిలో రూ.11 వేలు ఇచ్చారు. ఈ సొమ్ము తనకు సరిపోదని, మందులకే రూ.8 వేలు ఖర్చవుతుందని ఆమె వాపోయారు.

మరిన్ని వార్తలు