ముగిసిన దేవరగట్టు బన్నీ ఉత్సవం

15 Oct, 2013 09:36 IST|Sakshi
ముగిసిన దేవరగట్టు బన్నీ ఉత్సవం

దేవరగట్టు : తరతరాల రక్త చరిత్ర మరోసారి పునరావృతమైంది. మాల మల్లేశ్వర స్వామి కోసం జరిగిన కర్రల సమరంలో తలలు పగిలాయి. రక్తం చిమ్మింది. అర్ధరాత్రి ఒకటిన్నరకు కర్నూలు జిల్లా హోలగంద మండలంలోని దేవరగట్టులో బన్ని ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటగా మల్లమ్మ మల్లేశ్వరుడికి వివాహం జరిపించారు.

అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఇది సుమారు అర్ధరాత్రి రెండున్నరకు.. అంతా చీకటి.. చేతుల్లో కాగడాలు.. ఇదే సమయంలో కర్రల సమరం జరిగింది. ఆ ఉత్సవ మూర్తుల విగ్రహాలను తమ గ్రామాని తీసుకెళ్లడానికి గ్రామస్థులు కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. వందల మంది తలలు పగిలాయి.

భక్తి పేరుతో జరిగిన సమరంలో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిలువరించడానికి లాఠీచార్జ్ చేసిన పోలీసులపై గ్రామస్తులు రాళ్లు , కర్రలతో దాడి చేశారు. గ్రామస్తుల దాడిలో 12 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా కొందరు అకతాయిలు.. కాగడాలను గాల్లోకి విసిరారు.

దీంతో నిప్పు రవ్వలు మహిళలపై పడి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపు ఆ ప్రాంతంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు  లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గతం కంటే ఈ యేడాది తలలు పగిలిన వారి సంఖ్య చాలా తక్కువ ఉందని పోలీసులు చెప్పారు.  కర్రల సమరం మొత్తాన్ని వీడియో తీసినట్లు.. కావాలని అల్లర్లకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు