ఫోన్‌ చేస్తే ఇంటికే సరుకులు

28 Mar, 2020 03:39 IST|Sakshi

వాట్సాప్‌లో సరుకుల జాబితా పంపితే చాలు 

24 గంటల్లో డోర్‌ డెలివరీ 

క్యాష్‌ ఆన్‌ డెలివరీ సదుపాయం 

ప్రజలు బయట గుమిగూడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు

దేశమంతా లాక్‌డౌన్‌.. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల కొనుగోలుకు మధ్యాహ్నం 1 గంటలోపే బయటకు వెళ్లాలి. నగరాలు, పట్టణాల్లో దుకాణాలు మరీ దూరంగా ఉంటున్నాయి.. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసరాల కొనుగోలు ఎలా అని దిగులు చెందుతున్నారా?... మరేం ఫర్వాలేదు..  మీరు ఫోన్‌ చేస్తే చాలు.. కావాల్సిన సరుకుల వివరాలు వాట్సాప్‌లో పంపితే చాలు.. నేరుగా మీ ఇంటికే సరుకులు వచ్చేస్తాయి.

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో నగరాలు, పట్టణాల్లో ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందులు పడకుండా  ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిత్యావసర సరుకులను సూపర్‌ మార్కెట్ల నుంచి నేరుగా వినియోగదారుల ఇళ్లకే సరఫరా చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ప్రజలు బయటకొచ్చి సూపర్‌ మార్కెట్ల వద్ద గుమిగూడకుండా ఉండటానికే ఈ ఏర్పాటు చేసింది. ముందుగా విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సరుకుల డోర్‌ డెలివరీ కోసం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు ఆయా సూపర్‌ మార్కెట్ల యాజమాన్యాలతో చర్చించారు. డీమార్ట్, రిలయన్స్‌ మార్ట్, బిగ్‌ బజార్, స్పెన్సర్, బెస్ట్‌ ప్రైస్, మెట్రో, మోడర్న్‌ సూపర్‌ మార్కెట్‌.. ఇలా పలు సూపర్‌ మార్కెట్ల వివరాలతో ప్రకటనలు ఇచ్చారు.  వినియోగదారులు తమకు కావాల్సిన సరుకుల వివరాలు, తమ చిరునామాను ఆ సూపర్‌ మార్కెట్ల వాట్సాప్‌ నంబర్లకు పంపి ఫోన్‌ చేస్తే చాలు.

24 గంటల్లో సరుకులను వినియోగదారుల ఇళ్లకు సరఫరా చేస్తారు. సరుకులు ఇంటికి చేరాక నగదు చెల్లించే వెసులుబాటును కల్పించారు. అయితే.. కనీసం రూ.వెయ్యి విలువైన సరుకులు కొంటేనే ఇంటికి సరుకులను సరఫరా చేస్తారు. విజయవాడలో మొదటి రెండు రోజుల్లోనే 5 వేల ఇళ్లు, విశాఖలో 8 వేల ఇళ్లకు సరుకులను డోర్‌ డెలివరీ చేశారు. కాకినాడ, రాజమహేంద్రవరంలలో గురువారం నుంచి ఈ సదుపాయం ప్రారంభం కాగా మొదటి రోజే  2 వేల ఇళ్ల చొప్పున సరుకులను డోర్‌ డెలివరీ చేశారు. తిరుపతి, కర్నూలు తదితర చోట్ల కూడా వినియోగదారులు ఈ సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తమకు ఇబ్బంది లేకుండా సూపర్‌ మార్కెట్ల నుంచి నేరుగా ఇళ్లకే సరుకులను సరఫరా చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్‌ మార్కెట్ల సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు
కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా వైద్యుల సూచనల మేరకు డోర్‌ డెలివరీ చేసే సిబ్బంది పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించడంతోపాటు చేతికి ప్రతి గంటకు శానిటైజర్లు రాసుకుంటున్నారు.  ఒకరికొకరు దూరాన్ని కూడా పాటిస్తున్నారు. 

వినియోగదారులకు వైద్యుల సూచనలు..
సూపర్‌ బజార్ల నుంచి వచ్చిన సరుకులను వెంటనే ఇంటిలో డబ్బాల్లో వేయవద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. సరుకులను ఏడెనిమిది గంటల పాటు ఎండలో పెట్టాలని చెబుతున్నారు. అనంతరమే డబ్బాల్లో వేయాలని స్పష్టం చేస్తున్నారు. ఖాళీ ప్యాకెట్లను కూడా ఇంటిలో ఉంచకుండా బయట డస్ట్‌బిన్‌లలో వేయాలని పేర్కొంటున్నారు.

ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది
సూపర్‌ మార్కెట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు సరుకుల సరఫరా విధానానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరంలలో ఈ విధానాన్ని ప్రారంభించాం. వైద్యుల సూచనలతో సూపర్‌ మార్కెట్ల యాజమాన్యాలు, సిబ్బంది, డెలివరీ బాయ్స్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో కూడా ఈ విధానాన్ని ప్రారంభిస్తాం.
–డి.మురళీధర్‌రెడ్డి, కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా

నిత్యావసరాల కోసం ఆందోళన లేదు
విజయవాడలో లాక్‌డౌన్‌ ప్రకటించిన రోజు నిత్యావసరాల కోసం ప్రజలు దుకాణాల వద్ద బారులు తీరారు. సామాజిక దూరం కూడా పాటించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సూపర్‌ మార్కెట్ల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి డోర్‌ డెలివరీకి ఒప్పించాం. 
– ప్రసన్న వెంకటేశ్, కమిషనర్, విజయవాడ నగరపాలక సంస్థ

>
మరిన్ని వార్తలు