పెన్షనర్లకు 100%

27 Apr, 2020 03:13 IST|Sakshi

వారికి పూర్తి పెన్షన్‌ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం 

మిగిలిన ఉద్యోగులకు మార్చి తరహాలోనే ఏప్రిల్‌ వేతనాలు చెల్లింపు 

సీఎం, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు వేతనాలు వాయిదా 

పోలీస్, వైద్య ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందికి పూర్తి వేతనాలు 

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ నీలం సాహ్ని

సాక్షి, అమరావతి: అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితిపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. మరోపక్క వైరస్‌ నియంత్రణతోపాటు ఇతర అత్యవసరాలకు నిధుల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సీఎంతో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు ఏప్రిల్‌ నెల వేతనాలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి వేతనాలు కూడా వారికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

► పెన్షనర్లను దృష్టిలో ఉంచుకుని వారికి ఏప్రిల్‌ నెలలో పూర్తి పెన్షన్‌ చెల్లించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్‌లో పూర్తి స్థాయిలో పెన్షన్‌ చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చిలో పెన్షనర్లకు 50 శాతమే చెల్లించిన విషయం తెలిసిందే.
► మిగతా ఉద్యోగులందరికీ మార్చి తరహాలోనే ఏప్రిల్‌ నెల వేతనాలను కూడా చెల్లించనున్నట్లు సీఎస్‌ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అఖిల భారత సర్వీసు విభాగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులందరికీ మార్చి తరహాలోనే ఏప్రిల్‌లో కూడా వేతనాల్లో 40% చెల్లించనున్నారు. మిగతా 60 శాతం వాయిదా వేయనున్నారు.
► రాష్ట్ర ప్రభుత్వ మిగతా ఉద్యోగులందరికీ (నాలుగో తరగతి సిబ్బంది మినహా) మార్చి నెల తరహాలోనే ఏప్రిల్‌ వేతనాల్లో కూడా 50 శాతం చెల్లించి మిగతా 50 శాతం వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
► నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాల్లో 10% వాయిదా వేసి మిగతా 90 శాతం వేతనాలను చెల్లించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకూ ఇది వర్తిస్తుంది. 
► అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే మార్చి మాదిరిగానే ఏప్రిల్‌ వేతనాలను చెల్లిస్తారు.
► కరోనాపై ముందు వరుసలో నిలిచి విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి ఏప్రిల్‌లో పూర్తి వేతనాలను చెల్లించనున్నారు. 

మరిన్ని వార్తలు